ఆ కాలేజీల్లో చేరికకు లింగ మార్పిడి.. జేడీ వాన్స్ సంచలన వ్యాఖ్యలు
రిపబ్లికన్ పార్టీ నుంచి అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా బరిలో ఉన్న జేడీ వాన్స్ తమ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ నకు తమ్ముడే అని చెప్పాలి.
By: Tupaki Desk | 1 Nov 2024 12:30 PM GMTమరొక్క నాలుగు రోజులే.. అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు. అటు రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్.. ఇటు డెమోక్రటిక్ పార్టీ నుంచి కమలా హారిస్. హోరాహోరీగా సాగుతున్న ఈ ఎన్నికల్లో విజయం ఇద్దరి మధ్య దోబూచులాడుతోంది. ఒకరిని మించి ఒకరు అన్నట్లుగా పోటీ పడుతున్నారు. ఇక ఈ రెండు పార్టీల నుంచి ఉపాధ్యక్ష అభ్యర్థులు ఎవరన్నదీ ఆసక్తికరమే. ట్రంప్ పార్టీ రిపబ్లికన్ తరఫున జేడీ వాన్స్. డెమోక్రటిక్స్ నుంచి టిమ్ వాల్జ్ నిలిచారు.
ట్రంప్ తమ్ముడే..
రిపబ్లికన్ పార్టీ నుంచి అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా బరిలో ఉన్న జేడీ వాన్స్ తమ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ నకు తమ్ముడే అని చెప్పాలి. అయితే, ఇది రక్త సంబంధంలో కాదు. వివాదాస్పద వ్యాఖ్యల్లో కావడం గమనార్హం. తాజాగా ఆయన ప్రతిష్ఠాత్మక కాలేజీల్లో ప్రవేశానికి కొంతమంది టీనేజర్లు చేస్తున్న ప్రయత్నాలను విమర్శించే క్రమంలో మాటలు అదుపుతప్పారు. అమెరికాలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలుగా హార్వర్డ్, యేల్ లకు పేరున్న సంగతి తెలిసిందే. వీటిలో అడ్మిషన్ల కోసం టీనేజర్లు లింగమార్పిడి చేయించుకుంటున్నారని వాన్స్ నోరు జారారు. వీటిలో చోటు కోసం మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి పిల్లలకు లింగ మార్పిడి మాత్రమే మార్గంగా ఉందని పేర్కొన్నారు.
రిపబ్లికన్ల రూటే వేరు..
మొదటినుంచి ట్రాన్స్ జెండర్ల హక్కులపై రిపబ్లికన్ పార్టీ నేతలది భిన్న వైఖరి. వీరు ఈ విషయంలో తీవ్రమైన అభిప్రాయాలతో ఉంటారు. సాక్షాత్తు ట్రంప్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఒలింపిక్స్‌లో అల్జీరియాకు చెందిన బాక్సర్ ఇమానె ఖెలిఫ్ లో ఎక్స్, వై క్రోమోజోములు ఉన్నాయని, మహిళల విభాగంలో అనుమతించొద్దనే దుమారం రేగింది. ఈ సమయంలో ట్రంప్ కలుగజేసుకుని మహిళల క్రీడలో పురుషులు లేకుండా చేస్తానని వ్యాఖ్యానించారు. వాన్స్ అయితే.. ఓసారి అబార్షన్ ను కొందరు మహిళలు వేడుకగా చేసుకుంటున్నారని ఆరోపించారు. కేకులు సిద్ధం చేసుకుని ఫొటోలు దిగుతున్నారని వ్యాఖ్యానించారు. ట్రంప్ కూడా తొమ్మిది నెలల్లో గర్భ విచ్ఛిత్తి ఎలా చేస్తారని ప్రశ్నించారు. అబార్షన్ పై నిషేధానికి అనుకూలం కాదని, అలాంటి బిల్లుపై సంతకం చేయనని చెప్పారు.