Begin typing your search above and press return to search.

జేడీ కొత్త పార్టీ పేరు జై భారత్...!

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీ పెట్టారు. ఏపీలో ఎన్నికలు కూత వేటు దూరం ఉన్న టైంలో జేడీ తన కొత్త పార్టీని ఆవిష్కరించారు

By:  Tupaki Desk   |   22 Dec 2023 4:46 PM GMT
జేడీ కొత్త పార్టీ పేరు జై భారత్...!
X

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీ పెట్టారు. ఏపీలో ఎన్నికలు కూత వేటు దూరం ఉన్న టైంలో జేడీ తన కొత్త పార్టీని ఆవిష్కరించారు. ఈ మేరకు పార్టీ జెండాను జేడీ లక్ష్మీనారాయణ ఆవిష్కరించారు. దాని పేరు 'జై భారత్ నేషనల్ పార్టీ'. పేరు బాగుంది. రూపం బాగుంది. ఆశయాలు కూడా బాగున్నాయి.

జేడీ అంటేనే నీతి నిజాయతీపరుడు అని అంతా ఒప్పుకుంటారు. యూత్ లో మంచి క్రెజ్ ఉన్న జేడీ రైతుగా మారి వ్యవసాయం కూడా చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేస్తాను అని చాలా కాలంగా చెబుతూ వస్తున్న జేడీ అవసరం అయితే కొత్త పార్టీ పెడతాను అని కొద్ది రోజుల క్రితం విశాఖ నుంచే ప్రకటించారు.

ఇపుడు ఆయన కొత్త పార్టీని ప్రకటించారు. జేడీ 2019 ఎన్నికలక ముందు కూడా పార్టీ పెట్టాలని చూశారు. దాని కోసం ఆయన మహారాష్ట్ర క్యాడర్ లో సీబీఐ లో చేస్తున్న ఉన్నత ఉద్యోగానికి రాజీనామా చేసి బయటకు వచ్చారు. అయితే అప్పట్లో ఆయన జనసేనలో చేరి విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేస్తే రెండు లక్షల ఎనభై వేల దాకా ఓట్లు వచ్చాయి.

దానికి జనసేన బలంతో పాటు జేడీ ఇమేజ్ కూడా కారణం అని విశ్లేషిస్తారు. కేవలం పదిహేను రోజులు మాత్రమే ఆయన విశాఖలో ఉంటూ ప్రచారం చేశారు. కానీ ఆయనకు టీడీపీ వైసీపీతో సరిసమాంగా ఓట్లు వచ్చాయి. అంతే కాదు గాజువాక లో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఆయన కంటే పది వేల ఓట్లు ఎక్కువగా జేడీకి ఎంపీగా వచ్చాయి.

ఆ తరువాత జేడీ జనసేనకు రాజీనామా చేసి బయటకు వచ్చారు. ఆయన వైసీపీ టీడీపీ బీజేపీలలో ఏదో ఒక పార్టీలో చేరుతారు అని ప్రచారం సాగింది. కానీ ఆయన మాత్రం తాను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాను అంటూ వచ్చారు. ఇపుడు మాత్రం ఆయన తనకంటూ సొంత పార్టీనే పెట్టారు. దాంతో ఏపీలో రాజకీయాల్లో మరో కొత్త పార్టీ పురుడు పోసుకున్నట్లు అయింది.

ఏపీలో వైసీపీ టీడీపీ మాత్రమే అధికారం కోసం ఢీ కొంటున్నాయి. రాజకీయం ఈ రెండు పార్టీల మధ్యనే కేంద్రీకృతం అయిపోయింది. జనసేన సైతం టీడీపీతో పొత్తు పెట్టుకుంటోంది. దాంతో ఏపీలో కొత్త రాజకీయం రావాలని ఉంది. దానికి నాందిగా జేడీ పెట్టారు అని అంటున్నారు. యువత కోసమే తన పార్టీ అని ఆయన చెప్పుకొచ్చారు.

బీఅర్ అంబేద్కర్ స్పూర్తితో కొత్త పార్టీ ప్రారంభించానని జేడీ చెబుతున్నారు. వివిధ వర్గాల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చేందుకే తన కొత్త పార్టీ అని ఆయన అంటున్నారు. ఏపీలో నిరుద్యోగం ప్రధాన సమస్య అని ప్రత్యేక హోదా తీసుకుని రావడం తన అజెండా అని జేడీ అంటున్నారు. ప్రత్యేక హోదా తీసుకుని రావడానికే కొత్త పార్టీ పుట్టిందని ఆయన అన్నారు.

ఏపీలో టీడీపీ వైసీపీ పాలన మీద జేడీ నిశితమైన విమర్శలు చేశారు. ఈ రెండు పార్టీలు ప్రత్యేక హోదాను తీసుకుని రాలేకపోయాయని అన్నారు. ఇక అభివృద్ధి అని ఒకరు అవసరాలు అని ఒకరు సమగ్రమైన ప్రగతిని ఏపీకి అందించలేకపోయారు అని అన్నారు. త్వరలో పార్టీ వివరాలతో ఒక వెబ్ సైట్ కూడా లాంచ్ చేస్తున్నామని జేడీ తెలిపారు.