కవిత కోసం రంగంలోకి మాజీ జేడీ లక్ష్మీనారాయణ!
ఎవరూ ఊహించని విధంగా అన్నట్లుగా బీఆరెస్స్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.
By: Tupaki Desk | 16 March 2024 4:18 AM GMTతెలంగాణలో లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఎవరూ ఊహించని విధంగా అన్నట్లుగా బీఆరెస్స్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. దీంతో... ఈ అరెస్ట్ అక్రమం అని.. ఎన్నికలు ఎక్కడుంటే అక్కడికి ముందు ఈడీ వస్తుంది, తర్వాత మోడీ వస్తారు అని బీఆరెస్స్ నేతలు కామెంట్లు చేస్తుంటే... తప్పు చేయనప్పుడు భయమెందుకని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇది ఆ రెండు పార్టీలూ ఆడుతున్న డ్రామా అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
అవును... కవిత అరెస్ట్ అనంతర జరుగుతున్న వాద ప్రతివాదాల నడుమ సీబీఐ మాజీ జేడీ, జై భారత్ నేషనల్ పార్టీ వ్యవస్థాపకుడు లక్ష్మీనారాయణ ఎంట్రీ ఇచ్చారు. ఇందులో భాగంగా... కవితకు ఏకంగా లీగల్ అడ్వైజర్ గానే మారిపోయారు! ఈ క్రమంలో ఆమె అరెస్ట్, అనంతరం శనివారం ఆమెను కోర్టులో ప్రవేశపెట్టడం నుంచి పలు అంశాలపై ఆమె లేవనెత్తాల్సిన విషయాలపై ఆయన కూలంకషంగా వివరించారు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన విషయాలను ఇప్పుడు చూద్దాం...!
వాస్తవానికి ఈకేసుకు సంబంధించి కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆమె అరెస్ట్ జరిగింది. ఈ నేపథ్యంలో స్పందించిన లక్ష్మీనారాయణ... 161 సి.ఆర్.పి.ఎసి. ప్రకారం మహిళలు విచారణ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు! విచారణ అధికారులే సదరు మహిళ వద్దకు వచ్చి విచారిస్తారు! అయితే... గతంలో కవితను ఈడీ అధికారులు ఢిల్లీకి పిలిపించినప్పుడు కూడా ఇదే అంశం తెరపైకి వచ్చింది.
ఈ సమయంలో ఇదే విషయాన్ని కవిత లేవనెత్తిన సమయంలో స్పందించిన ఈడీ... తాము కవితను విచారిస్తున్నది సీఆర్పీసీ ప్రకారం కాదని, పీ.ఎం.ఎల్.ఏ చట్టం కింద అని, సీఆర్పీసీ కి - పీ.ఎం.ఎల్.ఏ కీ తేడా ఉందని సుప్రీంకోర్టుకు తెలిపింది. ప్రస్తుతం ఈ వ్యవహారం సుప్రీంకోర్టులో ఉంది. ఈ కేసు సుప్రీం మార్చి 19కి వాయిదా వేసింది అని తెలిపారు.
అయితే... ఒక కేసులో వ్యక్తిని అరెస్టు చేసే అధికారాలు దర్యాప్తు సంస్థలకు ఉంటాయని చెప్పిన లక్ష్మీనారాయణ... కవితను శనివారం మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి, ఎందుకు అరెస్ట్ చేసిందీ చెప్పాలని అన్నారు. ఆ సమయంలో కవిత న్యాయవాది కూడా అక్కడ వాదనలు వినిపించవచ్చని.. తాము దర్యాప్తు సంస్థతో సహకరిస్తున్నప్పటికీ అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని మేజిస్ట్రేట్ కు వివరించవచ్చని సూచించారు.
ఇదే క్రమంలో... సీఆర్పీసీలోని అంశాలు తమకు వర్తించవని ఈడీ అధికారులు అంటున్నారని తెలిపిన లక్ష్మీనారాయణ... క్రిమినల్ ప్రొసీజర్స్ ప్రకారం ఎవరినైనా అరెస్ట్ చేస్తే 24 గంటల్లోపే మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలని అన్నారు. ఇదే సమయంలో... సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ అరెస్ట్ చేస్తే సవాల్ చేయొచ్చని సూచించారు.
ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్లుగా... కవిత అరెస్టులో రాజకీయపరమైన అంశాలు ఉన్నట్లు కవిత భావిస్తే, ఆ అంశాలను కూడా మెజిస్ట్రేట్ ముందు ప్రస్తావించవచ్చని.. పైగా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే సమయంలో ఇలా అరెస్ట్ చేయడం రాజకీయ ప్రేరేపితమే అని నిరూపిస్తే రిలీఫ్ దొరుకుతుందని అన్నారు. అయితే... ఎన్నికల సమయంలో ఎవరినీ అరెస్ట్ చేయకూడదనే నియమం అయితే లేదని స్పష్టం చేశారు!