Begin typing your search above and press return to search.

కేసీఆర్ చెప్పిన‌ట్లే చేస్తున్న జేడీ!

అయితే ఈ వ్యాఖ్య‌ల వెనుక కేసీఆర్ ఉన్నార‌ని, తెలంగాణలో బీఆర్ఎస్‌కు ప్ర‌యోజ‌నం చేకూరేందుకే జేడీ ఇలా మ‌ట్లాడార‌ని టాక్‌.

By:  Tupaki Desk   |   1 Jun 2024 7:34 AM GMT
కేసీఆర్ చెప్పిన‌ట్లే చేస్తున్న జేడీ!
X

సొంత పార్టీ పెట్టుకున్న‌ప్ప‌టికీ సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ మాత్రం కేసీఆర్ చెప్పినట్లే చేస్తున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. తాజాగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లే అందుకు నిద‌ర్శ‌న‌మ‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. ఉమ్మ‌డి రాజ‌ధానిగా హైద‌రాబాద్ మ‌రింత కాలం కొన‌సాగాల‌ని జేడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అయితే ఈ వ్యాఖ్య‌ల వెనుక కేసీఆర్ ఉన్నార‌ని, తెలంగాణలో బీఆర్ఎస్‌కు ప్ర‌యోజ‌నం చేకూరేందుకే జేడీ ఇలా మ‌ట్లాడార‌ని టాక్‌.

2014 ఎన్నిక‌ల్లో విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన జేడీ ఆ త‌ర్వాత జ‌న‌సేన నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఈ సారి ఎన్నిక‌ల‌కు ముందు జై భార‌త్ నేష‌న‌ల్ పార్టీ పెట్టారు. ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ, తెలంగాణ‌లో లోక్‌స‌భ స్థానాల్లోనూ ఆ పార్టీ పోటీ చేసింది. జేడీ ఏమో విశాఖ నార్త్ నుంచి అసెంబ్లీ బ‌రిలో దిగారు. ఇదిలా ఉండ‌గా తాజాగా తెలంగాణ‌లో వ‌రంగ‌ల్‌-నల్గొండ‌-ఖ‌మ్మం ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జ‌రిగింది. ఈ ఎన్నిక‌ల్లో జేడీ అనూహ్యంగా బీఆర్ఎస్ అభ్య‌ర్థికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌డం హాట్ టాపిక్‌గా మారింది.

అప్ప‌టి నుంచి బీఆర్ఎస్‌తో, కేసీఆర్‌తో జేడీ స‌న్నిహితంగా ఉంటున్నార‌ని తెలిసింది. తెలంగాణలో బీఆర్ఎస్ ఉనికి కోసం జేడీ కూడా ప్ర‌య‌త్నిస్తున్నార‌నే టాక్ వినిపిస్తోంది. ఏపీ విభ‌జ‌న స‌మ‌యంలో ఉమ్మ‌డి రాజ‌ధానిగా హైద‌రాబాద్ ప‌దేళ్ల పాటు కొన‌సాగుతుంద‌ని ప్ర‌క‌టించారు. ఇప్పుడు ప‌దేళ్లు పూర్తి అయింది కాబ‌ట్టి హైద‌రాబాద్ ఇక ఉమ్మ‌డి రాజ‌ధాని కాదు. ఇప్ప‌టికే తొంభై శాతం సంస్థ‌లు హైద‌రాబాద్ నుంచి ఏపీకి వ‌చ్చేశాయి.

కానీ జేడీ ఉన్న‌ట్లుండి ఉమ్మ‌డి రాజ‌ధానిగా హైద‌రాబాద్ మ‌రింత కాలం కొన‌సాగాల‌ని డిమాండ్ చేయ‌డం వెనుక కేసీఆర్ వ్యూహ‌ముంద‌ని అంటున్నారు. ఈ డిమాండ్ పెరిగి ఏపీలో కొత్త‌గా ఏర్ప‌డే ప్ర‌భుత్వం లేదా ప్ర‌తిప‌క్షం కూడా ఉమ్మ‌డి రాజ‌ధానిగా హైదరాబాద్ కొన‌సాగాల‌ని పోరాడితే అప్పుడు కేసీఆర్‌కే ప్ర‌యోజ‌నం క‌లిగే అవ‌కాశ‌ముంద‌ని చెబుతున్నారు. అప్పుడు తెలంగాణ ప్ర‌యోజ‌నాల కోసం మ‌రోసారి సెంటిమెంట్‌ను ర‌గిల్చే అవ‌కాశం కేసీఆర్‌కు క‌లుగుతుంద‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.