జేడీ పార్టీ.. ఇలాగయితే కష్టమే!
ప్రస్తుతం ఎన్నికల్లో గెలుపొందాలంటే ఏ పార్టీ అయినా ఉచిత పథకాలను ప్రకటించాల్సిందే.
By: Tupaki Desk | 19 Jan 2024 1:30 PM GMTప్రస్తుతం ఎన్నికల్లో గెలుపొందాలంటే ఏ పార్టీ అయినా ఉచిత పథకాలను ప్రకటించాల్సిందే. దేశంలో అయినా, ఏదైనా రాష్ట్రంలో అయినా ఏ పార్టీ ఉచిత పథకాలను ప్రకటిస్తుందో, ఎవరి ఉచిత పథకాలయితే ఆకర్షణీయంగా ఉన్నాయో వారికే ప్రజలు ఓట్లు వేస్తున్నారు. కర్ణాటక, తెలంగాణ ఎన్నికలు ఇందుకు నిదర్శనం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లడంతో ఆ పార్టీ ఈ రెండు రాష్ట్రాల్లో విజయం సాధించింది.
ఆంధ్రప్రదేశ్ లో కూడా వైఎస్ జగన్ ప్రభుత్వం ఎన్నో ఉచిత పథకాలను అమలు చేస్తోంది. గత ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే నవరత్న పథకాలను అమలు చేస్తామని వైసీపీ అధినేత జగన్ ప్రకటించారు. ఈ ఉచిత పథకాలు ప్రజల్లోకి బాగా వెళ్లడంతో ఆ పార్టీ గెలుపొందింది. ఇప్పుడు టీడీపీ, జనసేన కూటమి కూడా వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎన్నో ఉచిత పథకాలను ప్రకటించింది.
వాస్తవానికి ఆయా రాష్ట్రాలు అమలు చేస్తున్న ఉచిత పథకాలపై ఎప్పటి నుంచో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కొంతమంది ప్రజలు పన్నుల రూపంలో కట్టిన మొత్తాలను తీసుకుపోయి వేరే వారికి పథకాల రూపంలో ఇవ్వడం ఏమిటనే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అభివృద్ధికి, మౌలిక సదుపాయాలకు ఖర్చు పెట్టకుండా పప్పుబెల్లాల్లా కావాల్సిన వారికి ఉచిత పథకాల పేరుతో ఇవ్వడం ఏమిటనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి.
ఈ నేపథ్యంలో ఇటీవల జై భారత్ నేషనల్ పార్టీని ఏర్పాటు చేసిన సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ మాత్రం ఉచిత పథకాలకు విరుద్ధంగా సంచలనానికి తెర లేపారు. తాము ఎలాంటి ఉచిత పథకాలను ప్రకటించబోమని.. అభివృద్ధికే ప్రాధాన్యత ఇస్తామని ఆయన ప్రకటించారు. ‘‘ జై భారత్ నేషనల్ పార్టీ (జేబీఎన్పీ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ‘ఓన్లీ డెవలప్మెంట్.. నో ఫ్రీబీస్ మేనిఫెస్టో’ ముసాయిదా ప్రక్రియలో ఉంది. మీ విలువైన సూచనలను మేము స్వాగతిస్తున్నాం’’ అంటూ లక్ష్మీనారాయణ ఎక్స్ లో పోస్టు చేశారు. అంతేకాకుండా సూచనలు ఇవ్వడానికి ఒక మెయిల్ ఐడీని కూడా అందులో పేర్కొన్నారు.
ఉచిత పథకాలంటే అంటే ఏమిటో నిర్వచించాలని తనను చాలా మంది అడిగారని లక్ష్మీనారాయణ తెలిపారు. శారీరక సామర్థ్యం ఉండి, పనిచేయగలిగే వయసు గల వ్యక్తి ఏ పనిచేయకుండానే నగదు రూపంలో ప్రయోజనం పొందడమే.. ఉచిత పథకాలని లక్ష్మీనారాయణ వెల్లడించారు.
‘‘ఫ్రీబీ‘ని నిర్వచించమని చాలా మంది నన్ను అడిగారు..
ఫ్రీబీ అంటే: ‘శారీరక సామర్థ్యం, పనిచేసే వయస్సు గల వ్యక్తి ఏ పని చేయకుండానే నగదు రూపంలో ప్రయోజనం పొందడం‘ అని ఉచిత పథకాలపై తనకున్న అభిప్రాయాన్ని లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో పోస్టు చేశారు. దీన్ని బట్టి ఆయన ఉచిత పథకాలకు వ్యతిరేకమని, అభివృద్ధికే కట్టుబడి ఉన్నట్టు స్పష్టమవుతోంది.
ఉచిత పథకాలు లేకుండా కేవలం అభివృద్ధికి మాత్రమే ప్రాధాన్యత అంటే జేడీ పార్టీకి ఓట్లు ఎలా వస్తాయనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఉచిత పథకాలకు అలవాటుపడిపోయిన ప్రజలు ఉన్నంతవరకు ఆయన ఆశించేది నెరవేరదని అంటున్నారు.