జేడీ లక్ష్మీనారాయణ అక్కడి నుంచి పోటీకి అసలు కారణం ఇదేనా?
సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ (జేడీ) లక్ష్మీనారాయణ జై భారత్ నేషనల్ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 22 March 2024 5:44 AM GMTసీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ (జేడీ) లక్ష్మీనారాయణ జై భారత్ నేషనల్ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. పార్టీ ఏర్పాటు ముందు వరకు ఆయన ఇండిపెండెంట్ గా విశాఖపట్నం నుంచి ఎంపీగా పోటీ చేస్తానని చెబుతూ వచ్చారు. అయితే సొంతంగా జై భారత్ నేషనల్ పార్టీని ఏర్పాటు చేశాక లక్ష్మీనారాయణ మనసు మారింది. అసెంబ్లీకి పోటీ చేస్తానని చెబుతున్నారు.
ఇందులో భాగంగా విశాఖపట్నం ఉత్తరం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్టు లక్ష్మీనారాయణ ఇప్పటికే ప్రకటించారు. గత ఎన్నికల సమయంలో జనసేన పార్టీలో ఉన్న ఆయన విశాఖపట్నం ఎంపీగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచారు. అయితే 2,88,874 ఓట్లు సాధించారు.
అయితే ఈసారి విశాఖ నార్త్ నుంచి అసెంబ్లీకి పోటీ చేయడం వెనుక ఆసక్తికర కారణాలు ఉన్నాయని అంటున్నారు. గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసినప్పుడు విశాఖ నార్త్ నియోజకవర్గంలోనే లక్ష్మీనారాయణకు ఎక్కువ ఓట్లు పడ్డాయని తెలుస్తోంది. అందులోనూ ఈ నియోజకవర్గంలో కాపు ఓటర్ల సంఖ్య ఎక్కువ. లక్ష్మీనారాయణ కూడా కాపు సామాజికవర్గానికి చెందినవారే. ఈ నేపథ్యంలో ఆయన విశాఖ నార్త్ నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. సొంత సామాజికవర్గంతోపాటు మేధావులు, చదువుకున్న యువత తనకు ఓట్లేస్తారని ఆయన ఆశలు పెట్టుకున్నారు.
మరోవైపు గత ఎన్నికల్లో విశాఖ నార్త్ నుంచి టీడీపీ తరఫున గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గంటా కూడా కాపు సామాజికవర్గానికి చెందినవారే. గంటా ఈసారి భీమిలి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం గంటా శ్రీనివాసరావును చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని కోరుతున్నారు.
కాగా వచ్చే ఎన్నికల్లో విశాఖ నార్త్ నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తరఫున మాజీ ఎమ్యెల్యే విష్ణుకుమార్ రాజు పోటీ చేస్తారని టాక్ నడుస్తోంది. ఇక ౖÐð సీపీ తరఫున గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలైన కేకే రాజు పోటీ చే స్తున్నారు. విష్ణుకుమార్ రాజు, కేకే రాజు ఇద్దరూ కూడా క్షత్రియ సామాజికవర్గానికి చెందినవారు. మరోవైపు లక్ష్మీనారాయణ కాపు సామాజికవర్గానికి చెందినవారు.
ఈ నేపథ్యంలో కాపుల ఓట్లను లక్ష్మీనారాయణ ఆకర్షించగలిగితే ఆయన విజయం సాధించినట్టేనని అంటున్నారు. క్షత్రియుల ఓట్లు, ఇతరుల ఓట్లను విష్ణు కుమార్ రాజు, కేకే రాజు చీల్చుకుంటే లక్ష్మీనారాయణ పని సులువు అవుతుందని టాక్ నడుస్తోంది.
ఈ క్రమంలో లక్ష్మీనారాయణ ఇప్పటికే విశాఖ నార్త్ నియోజకవర్గంలో చురుగ్గా పర్యటిస్తున్నారు. ప్రజలతో మమేకమవుతున్నారు. మరి ఈ మాజీ జేడీ ఈసారి గెలుపు బావుటా ఎగురవేయగలరో, లేదో వేచిచూడాల్సిందే.