ట్విస్ట్ : బీఆర్ఎస్‌కు మద్దతుగా జేడీ
జై భారత్ నేషనల్ పార్టీ అంటూ వేరు కుంపటి పెట్టుకున్నారు సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ.
By: Tupaki Desk | 24 May 2024 11:30 AM GMTజై భారత్ నేషనల్ పార్టీ అంటూ వేరు కుంపటి పెట్టుకున్నారు సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ. జాతీయ పార్టీగానే ఈ కొత్త పార్టీని స్థాపించి ఏపీ ఎన్నికల బరిలో దిగారు. తెలంగాణలోనూ కొన్ని ఎంపీ స్థానాల్లో ఈ పార్టీ పోటీ చేసింది. లక్ష్మీనారాయణ ఏమో విశాఖ ఉత్తరం నుంచి ఏపీ అసెంబ్లీకి పోటీ చేశారు. ఎవరితో పొత్తులు లేకుండా జేడీ విడిగానే ఎన్నికల బరిలో దిగారు. అయితే తాజాగా తెలంగాణలో మాత్రం ఆయన బీఆర్ఎస్‌కు మద్దతు ప్రకటించడం హాట్‌టాపిక్‌గా మారింది.
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల సందడి ముగిసింది. ప్రస్తుతం నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందడి కనిపిస్తోంది. ఈ సిటింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని బీఆర్ఎస్ తెగ ప్రయత్నిస్తోంది. ఇక్కడ రాకేశ్ రెడ్డిని గెలిపించే భారాన్ని కేటీఆర్ భుజాలకెత్తుకున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న రాకేశ్ రెడ్డికి జై భారత్ నేషనల్ పార్టీ మద్దతు ఇస్తున్నట్లు లక్ష్మీనారాయణ ప్రకటించారు. రాజకీయాల్లో నీతి నిజాయతీ కలిగిన వ్యక్తులు ఉండాలని తాను ఎప్పుడూ కోరుకుంటానని చెప్పారు. అందుకే రాకేశ్ రెడ్డిని గెలిపించాలని కోరుతున్నానన్నారు.
ఇక్కడ కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న పోటీ చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఆయనే విజయం సాధించేలా కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థికి లక్ష్మీనారాయణ మద్దతు ప్రకటించడం ఆశ్చర్యాన్ని కలిగించేదే. జేడీ చెప్పినంత మాత్రాన ఇక్కడ బీఆర్ఎస్‌కు ఓట్లు పడే అవకాశం లేదు. బీఆర్ఎస్‌కు మద్దతు ప్రకటించడం జేడీకే కలిసొస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన గతంలో బీఆర్ఎస్ తరపున ఏపీలో పనిచేస్తారనే టాక్ వినిపించింది. కానీ తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోవడంతో అది వీలుకాలేదని అంటున్నారు. ఒకవేళ ఇక్కడ బీఆర్ఎస్ గెలిచి ఉంటే ఏపీలో పోటీ చేసేదనే చెప్పాలి. అప్పుడు విశాఖ ఎంపీగా బీఆర్ఎస్ తరపున జేడీ పోటీ చేసే అవకాశాలు ఉండేవనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు మద్దతు నేపథ్యంలో భవిష్యత్‌తో బీఆర్ఎస్‌తో జేడీ పొత్తు పెట్టుకునే ఛాన్స్ ఉందనే టాక్ వినిపిస్తోంది.