జమిలితో జీడీపీ పెరుగుదల.. అదేం లాజిక్ అనుకుంటున్నారా?
దేశీయంగా పాలనా అంశాలకు సంబంధించి కొన్ని కీలక మార్పులు తెచ్చేందుకు వీలుగా మోడీ సర్కారు కంకణం కట్టుకున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 12 Dec 2024 4:27 AM GMTదేశీయంగా పాలనా అంశాలకు సంబంధించి కొన్ని కీలక మార్పులు తెచ్చేందుకు వీలుగా మోడీ సర్కారు కంకణం కట్టుకున్న విషయం తెలిసిందే. ఒక దేశం.. పేరుతో పలు అంశాల్ని ఒకే గొడుగు కిందకు తీసుకొస్తున్న క్రమంలో ఒక దేశం.. ఒక ఎన్నికల పేరుతో జమిలి ఎన్నికలను తెర తీసిన మోడీ సర్కారు, ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు.. రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించే ఈ ప్రక్రియకు సంబంధించి కేంద్రం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి ఛైర్మన్ గా మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
జమిలి ఎన్నికల నిర్వహణపై తాజాగా ఆయన ఆసక్తికర వ్యాఖ్య చేశారు. దేశ వ్యాప్తంగా జమిలి ఎన్నికల్ని ఒకేసారి నిర్వహించటం కారణంగా దేశ జీడీపీ ఒక శాతం నుంచి ఒకటిన్నర శాతం పెరుగుతుందని పేర్కొన్నారు. ఇది తాను చెబుతున్న మాట కాదని.. ఆర్థిక నిపుణులు చెబుతున్నట్లుగా వెల్లడించారు. లోక్ సభకు.. దేశంలోని అనని రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికల్ని నిర్వహించటం అన్నది ఏదో ఒక రాజకీయ పార్టీ అభిప్రాయం కాదని.. దేశ ప్రజలందరి కోరికగా ఆయన పేర్కొన్నారు.
అయితే.. దీని కోసం కేంద్రం ఇతర పార్టీల ఆమోదం పొందాలన్న సూచన చేసిన కోవింద్.. ‘జమిలి ఎన్నికల్లో భాగంగా లోక్ సభకు.. అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికల్ని నిర్వహించటం.. తర్వాత వంద రోజుల్లో మున్సిపాలిటీలు.. పంచాయితీ ఎన్నికలను పూర్తి చేయాల్సి ఉంటుంది’’ అని చెప్పారు. అన్ని ఎన్నికల్ని ఒకేసారి పూర్తి చేయటం కారణంగా.. పాలనాపరమైన వేగంతో పాటు.. ప్రతి ఎన్నికల సందర్భంలోనూ ప్రభుత్వం ప్రజారంజక నిర్ణయాల పేరుతో అవసరానికి మించిన హామీల్ని ఇవ్వాల్సి వస్తుంది. ఎన్నికల వేళ విధించే పరిమితులు.. పాలనపై ప్రభావాన్ని చూపిస్తుంది. వీటికి జమిలి ఎన్నికలు చెక్ చెబుతాయన్న మాట వినిపిస్తోంది.