బర్రెలక్కకు జేడీ మద్దతు.. ఆమె రోల్ మోడల్ అని కితాబు!
ఈ క్రమంలో తాజాగా సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ.. బర్రెలక్క తరఫున కొల్లాపూర్‌లో పర్యటించారు. ఆమెకు మద్దతు గా మాట్లాడారు. శిరీషను చూసి తాను గర్విస్తున్నానని చెప్పారు.
By: Tupaki Desk | 25 Nov 2023 1:52 PM GMTతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అనేక మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అయితే.. వీరందరిలోనూ.. ఎక్కువగా ఫామ్‌లో ఉన్న వ్యక్తి.. బర్రెలక్క. సోషల్ మీడియా ప్లాట్ ఫాం.. ఇన్‌స్టాగ్రామ్‌లో బర్రెలక్కగా ప్రాచుర్యం పొందిన కర్నే శిరీష.. బీకాం వరకు చదువుకుంది. అయితే..ఉద్యోగం రాకపోవడంతో బర్రెలు కాస్తూ.. తన తండ్రికి సాయం చేస్తోంది. ఈ క్రమంలోనే ఆమె చేసిన వీడియోలు.. హల్చల్ చేయడం.. ప్రముఖ యూట్యూబర్ కావడం తెలిసిందే.
అయితే.. ప్రస్తుత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్ కర్నూలు జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఆమె స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగారు. నిరుద్యోగంపై పోరాటం చేయడంతోపాటు.. నియోజకవర్గం అభివృద్ధి కోసమే తాను.. ఈ ఎన్నికల్లో పోటీకి దిగానని శిరీష్ తెలిపారు. అయితే.. శిరీషకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. యానాం కు చెందిన పుద్దేచ్చేరి మాజీ మంత్రి మల్లాడి కృష్నారావు వంటి వారు.. ఆమెకు మానసికంగా ధైర్యం చెబుతూ.. ఆర్థికంగా కూడా సాయం చేస్తున్నారు. ఇక, యువతకూడా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.
ఈ క్రమంలో తాజాగా సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ.. బర్రెలక్క తరఫున కొల్లాపూర్‌లో పర్యటించారు. ఆమెకు మద్దతు గా మాట్లాడారు. శిరీషను చూసి తాను గర్విస్తున్నానని చెప్పారు. ఆమె మనందరికీ ఒక రోల్ మోడల్ కావాలని పిలుపునిచ్చారు. పార్టీల స్వామ్యం కాదు.. ప్రజాస్వామ్యం కావాలి.. బర్రెలక్క వంటివారిని ప్రజలు ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించాలి.. అని ఆయన పిలుపునిచ్చారు. ఆమె ఎన్నికల్లో పోటీ చేస్తోందని తెలిసి.. మొదట సంతోషించింది తానేనని జేడీ చెప్పుకొచ్చారు. యువత ఆమెను చూసి స్ఫూర్తి పొంది.. రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. మొత్తానికి బర్రెలక్కకు అన్ని వైపుల నుంచి మద్దతు లభిస్తుండడం గమనార్హం. మరో వైపు ఆమెకు 1 గన్‌మెన్‌తో భద్రత కల్పించాలని హైకోర్టు కూడా ఆదేశించిన విషయం తెలిసిందే.