Begin typing your search above and press return to search.

జేడీ లక్ష్మీనారాయణ ట్వీట్‌ పవన్‌ ను ఉద్దేశించేనా?

ఈ నేపథ్యంలో సీబీఐ మాజీ జాయింట్‌ డైరెక్టర్‌ లక్ష్మీనారాయణ చేసిన ట్వీట్‌ హాట్‌ టాపిక్‌ గా మారింది.

By:  Tupaki Desk   |   15 Sep 2023 7:00 AM GMT
జేడీ లక్ష్మీనారాయణ ట్వీట్‌ పవన్‌ ను ఉద్దేశించేనా?
X

కాగా తాజాగా జనసేన, టీడీపీల మధ్య పొత్తు కుదిరిన సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్నామని ఈ రెండు పార్టీలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో సీబీఐ మాజీ జాయింట్‌ డైరెక్టర్‌ లక్ష్మీనారాయణ చేసిన ట్వీట్‌ హాట్‌ టాపిక్‌ గా మారింది.


జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ కు ప్రముఖ కవి గుంటూరు శేషేంద్ర శర్మ అంటే ఇష్టమనే సంగతి తెలిసిందే. ఆయన సాహిత్యం బయట ప్రస్తుతం దొరకడం లేదని పవనే స్వయం ఖర్చు భరించి ఆయన పుస్తకాలను కూడా ముద్రించారు.

అలాగే తరచూ గుంటూరు శేషేంద్ర శర్మ రచనల్లోని కొన్ని పంక్తులను పవన్‌ దాదాపు తన ప్రతి సభలోనూ ఉటంకిస్తుంటారు. "సముద్రం ఒకడి కాళ్ల దగ్గర కూర్చుని మొరగదు.. తుపాను గొంతు చిత్తం అనడం ఎరుగదు.. పర్వతం వంగి ఎవడికి సలాం చెయ్యదు.. నేను ఒక పిడికెడంత మట్టే కావచ్చు.. కానీ తల ఎత్తితే ఈ దేశపు జెండాకున్నంత పొగరుంది" అనే పంక్తులను పవన్‌ ప్రతి సభలోనూ చాలా ఉద్వేగంగా చెబుతుంటారు.

ఈ నేపథ్యంలో జేడీ లక్ష్మీనారాయణ.. గుంటూరు శేషేంద్ర శర్మ రాసిన ఈ వాక్యాలను ఉటంకిస్తూ ట్విట్టర్‌ లో ఒక పోస్టు చేశారు. శేషేంద్ర చిత్రంతో కూడిన పంక్తులతో ఒక ఫొటోను షేర్‌ చేశారు. ఇప్పుడిది హాట్‌ టాపిక్‌ గా మారింది. జేడీ లక్ష్మీనారాయణ ట్వీట్‌ ఖచ్చితంగా పవన్‌ కళ్యాణ్‌ ను ఉద్దేశించేనని భావిస్తున్నారు.

రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్న చంద్రబాబు వద్దకు పవన్‌ కళ్యాణ్‌ వెళ్లడం, మద్దతు ప్రకటించడం, జైలు నుంచి బయటకొచ్చాక టీడీపీతో పొత్తు ప్రకటించడం, చంద్రబాబును పొగుడుతూ మాట్లాడటం వంటివేవీ లక్ష్మీనారాయణకు నచ్చలేదని టాక్‌ నడుస్తోంది. అందువల్లే ఇలా పవన్‌ కు ఎంతో ఇష్టమైన, పవన్‌ తరచూ చెబుతుండే గుంటూరు శేషేంద్ర శర్మ పంక్తుల రూపంలో పరోక్షంగా విమర్శలు సంధించారని చర్చ జరుగుతోంది.

అంతేకాకుండా గుంటూరు శేషేంద్ర శర్మ పంక్తులను పోస్టు చేసిన జేడీ లక్ష్మీనారాయణ తన కామెంట్‌ సెక్షన్‌ ను ఆఫ్‌ చేయడం గమనార్హం. అంటే.. తాను గుంటూరు శేషేంద్ర శర్మ వాక్యాలను పోస్టు చేస్తే జనసేన నేతలు, కార్యకర్తలు తనను విమర్శించే అవకాశం ఉండటం వల్లే జేడీ తన కామెంట్‌ సెక్షన్‌ ను డిజేబుల్‌ చేశారని అంటున్నారు. దీన్ని బట్టి దీన్ని ఖచ్చితంగా పవన్‌ ను ఉద్దేశించే జేడీ చేశారని చెబుతున్నారు.

కాగా ఇటీవలకాలంలో జేడీ లక్ష్మీనారాయణ పరోక్షంగా చేస్తున్న వ్యాఖ్యలు వైసీపీకి అనుకూలంగా ఉన్నాయనే అభిప్రాయాలు నెటిజన్లలో వ్యక్తమవుతున్నాయి. తాజాగా పవన్‌ పై జేడీ పరోక్ష ట్వీట్‌ పై జనసేన శ్రేణులు ఎలా స్పందిస్తాయో వేచిచూడాల్సిందే.