Begin typing your search above and press return to search.

ఏపీ అల్లుడే.. ట్రంప్ ఉపాధ్యక్ష అభ్యర్థి!

యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూసే అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ..భారతదేశ ప్రస్తావన రావటం ఈ మధ్యన చూస్తున్నాం.

By:  Tupaki Desk   |   16 July 2024 4:06 AM GMT
ఏపీ అల్లుడే.. ట్రంప్ ఉపాధ్యక్ష అభ్యర్థి!
X

యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూసే అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ..భారతదేశ ప్రస్తావన రావటం ఈ మధ్యన చూస్తున్నాం. ప్రస్తుతం అమెరికా ఉపాధ్యక్ష పదవిలో ఉన్న కమలా హ్యారీస్ భారత సంతతికి చెందిన వ్యక్తి కావటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో రిపబ్లికన్ల అభ్యర్థిగా అధ్యక్ష బరిలో ఉన్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ఎంపిక చేశారు. దీని ప్రకారం ఉపాధ్యక్ష అభ్యర్థిగా జేడీ వాన్స్ ను ఎంపిక చేశారు. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. వాన్స్ సతీమణి ఒక తెలుగమ్మాయి. అందునా ఏపీకి చెందిన మహిళ కావటం ఆసక్తికరంగా మారింది. ఆమె పేరు ఉషా చిలుకూరి. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఆమె తల్లిదండ్రులు అమెరికాలోని శాన్ డియాగోలో స్థిరపడ్డారు.

రిపబ్లికన్ల ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపికైన జేడీ వాన్స్ తో ఆమెకు ప్రేమ వివాహం జరిగింది. భారత కాలమానం ప్రకారం సోమవారం అర్థరాత్రి వేళలో మిల్వాకీలో జరిగిన పార్టీ జాతీయ సదస్సులో ప్రతినిధులంతా డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థిత్వానికి ఆమోదం తెలపగా.. అదే సమయంలో ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఒహాయో సెనేటర్ జేడీ వాన్స్ పేరును ట్రంప్ ప్రకటించారు. మెరైన్ విభాగంలో అమెరికాకు సేవలు అందించిన జేడీ వాన్స్ ఒహాయో స్టేట్ వర్సిటీ.. యేల్ లా విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రుడయ్యారు. అతేకాదు.. యేల్ లా జర్నల్ కు ఎడిటర్ గా వ్యవహరించారు.

ఇక.. ఆయన సతీమణి ఉషా చిలుకూరి విషయానికి వస్తే.. ఆమె తల్లిదండ్రులు భారత్ నుంచి వెళ్లి అమెరికాలో స్థిరపడ్డారు. ఉషా చిలుకూరి యేల్ వర్సిటీ నుంచి హిస్టరీలో బ్యాచిలర్ డిగ్రీ పొందారు. కేంబ్రిడ్జి వర్సిటీ నుంచి ఫిలాసఫీలో మాస్టర్స్ పూర్తి చేశారు. న్యాయ సంబంధమైన విబాగాల్లో

సుదీర్ఘంగా పని చేసిన అనుభవం ఆమె సొంతం. కాలిఫోర్నియాలోని శాండియాగో ప్రాంతంలో ఉషా చిలుకూరి పుట్టి పెరిగారు. యేల్ వర్సిటీలో లా అండ్ టెక్ జర్నల్ కు మేనేజింగ్ ఎడిటర్ గా.. యేల్ లా జర్నల్ కు ఎగ్జిక్యూటివ్ డెవలప్ మెంట్ ఎడిటర్ గా పని చేశారు.

వర్సిటీలో నిర్వహించిన అనేక కార్యక్రమాల్లోచురుగ్గా పాల్గొన్న ఆమె..కేంబ్రిడ్జి వర్సిటీకి గేట్స్ ఫెలోగా వెళ్లారు. అక్కడ ఆమె లెఫ్ట్ వింగ్..లిబరల్ గ్రూప్స్ తో కలిసి పని చేవారు. 2014లో ఆమె డెమోక్రాటిక్ పార్టీ కార్యకర్తగా తన పేరును నమోదు చేసుకోవటం విశేషం. యేల్ లా స్కూల్ లోనే జేడీ

వాన్స్ ను ఉషా తొలిసారి కలిశారు. ఆ తర్వాత వారి పరిచయం ప్రేమగా మారింది. చివరకు 2014లో కెంటకీలో వారు పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం హిందూ సంప్రదాయంలో జరిగింది.

ఈ దంపతులకు ముగ్గురు సంతానం. భర్త సాధించిన విజయాల్లో ఉషా కీలక పాత్ర పోషించినట్లుగా చెబుతారు. రాజకీయంగా అనేక అంశాల్లో ఆయనకు అండగా నిలిచారన్న పేరుంది. ఒహాయా సెనేటర్ గా బరిలో నిలిచినప్పుడు ఆయన ప్రచారంలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు.తన భర్త ప్రజాకర్షక విధానాలతోముందుకువెళ్తున్నారంటూ ఆయనపై వచ్చిన విమర్శలను సమర్థంగా తిప్పికొట్టిన టాలెంట్ ఆమె సొంతమని చెబుతారు. జేడీ వేన్స్ సైతం తాను సాధించిన విజయాల్లో తన భార్య ఉషా పాత్ర కీలకమని చెబుతూ ఉంటారు. ఇదిలా ఉంటే.. గత నెలలో (జూన్)లో ఫాక్స్ అండ్ ఫ్రెండ్స్ తో జరిగిన ఇంటర్వ్యూలో తన భర్త ఉపాధ్యక్ష అభ్యర్థిత్వంపై సందిగ్థత నెలకొన్నట్లుగా పేర్కొన్నారు. 2015 నుంచి పలు సంస్థల్లో కార్పొరేట్ లిటిగేటర్ గా పని చేస్తున్నారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ జాన్ రాబర్ట్స్ .. జస్టిస్ బ్రెట్ కెవానా వద్ద పని చేసిన అనుభవం ఆమెకు ఉంది. ఇక.. ఆమె భర్త కం ప్రస్తుత రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి అయిన జేడీ వాన్స్.. 39 ఏళ్ల

వయసులో అమెరికాసెనేట్ కు ఎన్నికయ్యారు. ఇక్కడో ఆసక్తికరమైన విషయాన్ని ప్రస్తావించాలి. మొదట్లో ట్రంప్ విధానాల్ని ఆయన విమర్శించేవారు. తర్వాతి కాలంలో ఆయనకు విధేయుడిగా మారారు. తాజాగా ట్రంప్ అధ్యక్ష రేసులో ఉంటే.. ఆయన ఏకంగా ఉపాధ్యక్ష అభ్యర్థిగా బరిలో నిలవటం గమనార్హం. రెండు రోజుల క్రితం ఎన్నికల ప్రచార సభలో హత్యయత్నం నుంచి త్రుటిలో తప్పించుకున్న ట్రంప్ మీద పెద్ద ఎత్తున సానుభూతి వెల్లువెత్తుతున్న వేళ.. అధ్యక్ష.. ఉపాధ్యక్ష ఎన్నికలు రిపబ్లికన్లకు సానుకూలంగా మారనున్నట్లుగా అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగువారి అల్లుడు అమెరికా ఉపాధ్యక్ష పదవిని చేపట్టే రోజు త్వరలోనే ఉందన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.