Begin typing your search above and press return to search.

ఆంధ్రా అల్లుడు.. అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థి తెచ్చిన తంటా!

ఈ నేపథ్యంలో గతంలో రిపబ్లికన్‌ పార్టీ తరఫున ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపికయిన జేడీ వాన్స్‌ చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్‌ అవుతున్నాయి.

By:  Tupaki Desk   |   17 July 2024 9:26 AM GMT
ఆంధ్రా అల్లుడు.. అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థి తెచ్చిన తంటా!
X

వచ్చే ఏడాది నవంబరులో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పోటీ చేస్తున్నారు. కాగా ఆయన తన ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఓహాయో సెనేటర్‌ జేడీ వాన్స్‌ ను ఎంపిక చేసుకున్నారు. ఈ జేడీ వాన్స్‌ ఎవరో కాదు. ఆంధ్రా అమ్మాయి ఉషా చిలుకూరి భర్త కావడం గమనార్హం. కృష్ణా జిల్లా పామర్రుకు చెందిన ఉషా చిలుకూరి తల్లిదండ్రులు 1980వ దశకంలోనే అమెరికాకు వెళ్లారు. అక్కడే ఉష పుట్టిపెరిగారు. ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. జేడీ వాన్స్‌. ఈ నేపథ్యంలో ఆయన ప్రస్తుతం వార్తల్లో నిలిచారు.

ఈ నేపథ్యంలో గతంలో రిపబ్లికన్‌ పార్టీ తరఫున ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపికయిన జేడీ వాన్స్‌ చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్‌ అవుతున్నాయి. అమెరికా మిత్ర దేశమైన యునైటెడ్‌ కింగ్‌ డమ్‌ (యూకే) లేబర్‌ పార్టీ పాలనలో అణ్వాయుధాలు కలిగిన తొలి ఇస్లామిక్‌ దేశంగా మారుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన వివాదంలో కూరుకుపోయారు.

ఇటీవల బ్రిటన్‌ లో జరిగిన ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్‌ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. లేబర్‌ పార్టీ 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో జేడీ వాన్స్‌ చేసిన వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌ గా మారాయి. లేబర్‌ పార్టీ పాలనలో యూకే అణ్వాయుధాలు కలిగిన తొలి ఇస్లామిక్‌ దేశంగా మారే అవకాశం ఉందంటూ ఆయన తేనెతుట్టెను కదిపారు.

గతవారం జరిగిన యూకే కన్జర్వేటివ్‌ నేతల సదస్సుకు జేడీ వాన్స్‌ హాజరయ్యారు. ఇందులో ఆయన మాట్లాడుతూ ఇప్పుడు ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద ముప్పుల్లో అణ్వాయుధాలను పెంచుకోవడం ఒకటి అని ఆయన తెలిపారు.

ప్రస్తుతం అమెరికాలో అధికారంలో ఉన్న జో బైడెన్‌ ప్రభుత్వం అణ్వాయుధాల విస్తరణ ముప్పును పట్టించుకోవడం లేదని జేడీ వాన్స్‌ ఆరోపించారు. ప్రపంచంలో అణ్వాయుధాలు కలిగిన తొలి ఇస్లామిక్‌ దేశంగా పాకిస్థాన్‌ లేదా ఇరాన్‌ నిలుస్తాయని తాము అనుకున్నామన్నారు. అయితే చివరకు యునైటెడ్‌ కింగ్‌ డమ్‌.. లేబర్‌ పార్టీ పాలనలో అణ్వాయుధాలు కలిగిన తొలి ఇస్లామిక్‌ దేశంగా నిలుస్తుందని భావిస్తున్నామని జేడీ వాన్స్‌ హాట్‌ కామెంట్స్‌ చేశారు.

మిత్రదేశంపై జేడీ వాన్స్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే యూకే ఉప ప్రధాని ఏంజెలా రేనెర్‌ ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. గతంలోనూ ఆయన ఇలాంటి వ్యాఖ్యలే చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందువల్ల తాము ఆయన వ్యాఖ్యలను సీరియస్‌ గా తీసుకోబోమని తెలిపారు.

బ్రిటన్‌ పైనే కాకుండా చైనాపైనా జేడీ వాన్స్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు చైనా అతిపెద్ద ముప్పుగా మారే ప్రమాదముందన్నారు. ఈ నేపథ్యంలో జేడీ వాన్స్‌ వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి.

అలాగే గతంలో డోనాల్డ్‌ ట్రంప్‌ కు బద్ధ వ్యతిరేకిగా జేడీ వాన్స్‌ ఉండేవారు. ఈ క్రమంలో ఆయనపై పలు తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు. అలాంటిది ఇప్పుడు ఆయనకు సన్నిహితంగా మారారు. అంతేకాకుండా ట్రంప్‌ అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా తనను ఎంపిక చేసుకునేలా ఎదిగారు.