ఆర్టీసీ హ్యాండోవర్ లోకి జీవన్ రెడ్డి మాల్
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో ఆర్టీసీ స్థలంలో నిర్మించిన జీవన్ రెడ్డి మాల్ కు సంబంధించిన అద్దె బకాయిల అంశానికి సంబంధించిన వివాదం గురించి అందరికి తెలిసిందే.
By: Tupaki Desk | 17 May 2024 3:51 AM GMTబీఆర్ఎస్ నేతకు చెందిన విష్ణుజిత్ ఇన్ ఫ్రా డెవలపర్స్ నిర్మించిన జీవన్ రెడ్డి మాల్ ను తెలంగాణ ఆర్టీసీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు బకాయిలు చెల్లించటంలో విఫలం కావటంతో తాజా పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో ఆర్టీసీ స్థలంలో నిర్మించిన జీవన్ రెడ్డి మాల్ కు సంబంధించిన అద్దె బకాయిల అంశానికి సంబంధించిన వివాదం గురించి అందరికి తెలిసిందే.
ఆర్టీసీ స్థలంలో నిర్మించిన జీవన్ రెడ్డి మాల్ కు సంబంధించి.. బకాయిలు ఉన్నాయి. వీటిని చెల్లించకుండా జాప్యం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో బకాయిల్లోకొంత మొత్తాన్ని ఆర్టీసీకి చెల్లించేందుకు ముందుకు వచ్చారు. దీంతో.. స్వాధీనం చేసుకోవాలన్న నిర్ణయాన్ని వాయిదా వేశారు. ఇదిలా ఉండగా ఆర్టీసీ ఉన్నతాధికారులపై విష్ణుజిత్ ఇన్ ఫ్రా సంస్థ యజమాని అయిన రజితారెడ్డి భర్త కం మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇటీవల పలు ఆరోపణలు చేశారు.
ఇదిలా ఉండగా.. గురువారం మరోసారి మాల్ కు వచ్చిన అధికారులు.. మారచి 27న పూర్తి బకాయిలు చెల్లించాలంటూ హైకోర్టు ఆదేశాల్ని ప్రస్తావించారు. గత ఏడాది అక్టోబరు నాటికి రూ.8.65 కోట్ల బకాయిలు ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు. విడతల వారీగా బకాయిల్ని కడుతున్నప్పటికి.. ఇప్పటికి రూ.2.51 కోట్ల బకాయిలు ఉన్నాయి. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో బకాయిల చెల్లింపునకు నెల రోజులు గడువు ఇచ్చినా.. బకాయిల్ని క్లియర్ చేయలేదు. దీంతో.. రూల్ ప్రకారం మాల్ ను స్వాధీనం చేసుకుంటున్నట్లుగా గురువారం మధ్యాహ్నం ప్రకటించారు.
మాల్ తమ స్వాధీనంలోకి వచ్చిన తర్వాత మాల్ లోని షాపుల వారంతా ఆర్టీసీతో వేరుగా ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మాల్ ను స్వాధీనం చేసుకున్న తర్వాత అద్దెకు ఉన్న షాపుల వారిని.. వినియోగదారులను బయటకు పంపేసి తాళం వేశారు. బయట ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేసి.. అందులో ఆర్టీసీకి సకాలంలో అద్దెను చెల్లించని కారణంగా షాపింగ్ మాల్ ను టీఎస్ ఆర్టీసీ స్వాదీనం చేసుకున్నట్లుగా పేర్కొన్నారు. మాల్ లోని షాపుల వారు.. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని.. సహకరించాలని పేర్కొన్నారు. ఈ వ్యవహారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అంతటా హాట్ టాపిక్ గా మారింది.