Begin typing your search above and press return to search.

సెక్స్‌ స్కాండల్‌ లో ఇద్దరు అమెరికా మాజీ అధ్యక్షులు!

అమెరికా మాజీ అధ్యక్షుడు, డెమోక్రటిక్‌ పార్టీ నేత బిల్‌ క్లింటన్‌ తెలియనివారు లేరు

By:  Tupaki Desk   |   4 Jan 2024 10:18 AM GMT
సెక్స్‌ స్కాండల్‌ లో ఇద్దరు అమెరికా మాజీ అధ్యక్షులు!
X

అమెరికా మాజీ అధ్యక్షుడు, డెమోక్రటిక్‌ పార్టీ నేత బిల్‌ క్లింటన్‌ తెలియనివారు లేరు. అమెరికా అధ్యక్షుడిగా వరుసగా ఆయన ఎనిమిదేళ్లపాటు పనిచేశారు. కాగా గతంలో మోనికా లూయిన్‌ స్కీ అనే మహిళ తనను బిల్‌ క్లింటన్‌ లైంగికంగా వేధించాడని ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనానికి కారణమైంది. ఈ వ్యవహారం బిల్‌ క్లింటన్, ఆయన సతీమణి హిల్లరీ క్లింటన్‌ విడిపోవడానికి కూడా దారితీసింది. అయితే తన భర్తను హిల్లరీ క్షమిస్తున్నానని ప్రకటించడంతో బిల్‌ క్లింటన్‌ నాడు ఊపిరిపీల్చుకున్నారు.

ఇప్పుడు మరోసారి అమెరికాను కుదిపేసిన హైప్రొఫైల్‌ సెక్స్‌ కుంభకోణం తెరపైకి వచ్చింది. ప్రముఖ ఫైనాన్షియర్‌ జెఫ్రీ ఎప్‌ స్టీన్‌ అరాచకాలను న్యూయార్క్‌ కోర్టు తాజాగా బహిర్గతం చేసింది. ఈ కేసుకు సంబంధించిన రహస్య పత్రాలను బహిర్గతం చేసే ప్రక్రియను జనవరి 3న మొదలుపెట్టారు. ఇందులో భాగంగా తొలి విడతలో 40 పత్రాలను విడుదల చేశారు. ఈ కుంభకోణంలో అమెరికా మాజీ అధ్యక్షులు బిల్‌ క్లింటన్, డొనాల్డ్‌ ట్రంప్‌ సహా పలువురు ప్రముఖులు, సంపన్నుల పేర్లు ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

తాజాగా విడుదల చేసిన పత్రాల్లో చాలా వరకు ఎప్‌ స్టీన్‌ కేసుకు సంబంధించిన వార్తా పత్రికల కథనాలు, టీవీ డాక్యుమెంటరీలు, ఇంటర్వ్యూలు, బాధితుల వాంగ్మూలాలే ఉన్నాయి.

అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ తో ఎప్‌ స్టీన్‌ సాన్నిహిత్యం, బ్రిటన్‌ రాజకుటుంబానికి చెందిన ప్రిన్స్‌ ఆండ్రూపై ఆరోపణల వంటి వివరాలు ఈ పత్రాల్లో చోటు చేసుకున్నాయి. ఈ డాక్యుమెంట్లలో ప్రముఖ డ్యాన్సర్‌ మైకేల్‌ జాక్సన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సహా దాదాపు 200 మంది ప్రముఖుల పేర్లు ఉండటం గమనార్హం.

కాగా ఎప్‌ స్టీన్‌పై ఆరోపణలు చేసిన జొహన్నా సోబెర్గ్‌ ఇచ్చిన వాంగ్మూలంలో మైకేల్‌ జాక్సన్‌ ప్రస్తావన చోటు చేసుకుంది. ఎప్‌ స్టీన్‌ కు చెందిన ఫ్లోరిడాలోని పామ్‌ బీచ్‌ నివాసంలో తాను ఓ సారి మైకేల్‌ జాక్సన్‌ ను కలిసినట్లు జొహన్నా సోబెర్గ్‌ తెలిపారు. అయితే, అప్పుడు ఆ మైకేల్‌ జాన్సన్‌ తనతో తప్పుగా ప్రవర్తించలేదని తెలిపారు.

అలాగే జొహన్నా సోబెర్గ్‌ ఇచ్చిన మరో వాంగ్మూలంలో ఆమె బ్రిటన్‌ రాజకుటుంబానికి చెందిన ప్రిన్స్‌ ఆండ్రూపై సంచలన ఆరోపణలు చేశారు. 2001లో తాను న్యూయార్క్‌ వెళ్లినప్పుడు ఎప్‌ స్టీన్‌ నివాసంలో ఓ గ్రూప్‌ ఫొటో దిగామని ఆమె తెలిపారు. ఆ ంసదర్భంగా ప్రిన్స్‌ ఆండ్రూ తనని అసభ్యంగా తాకారని ఆరోపించారు. ఇక ఇదే వాంగ్మూలంలో బిల్‌ క్లింటన్, ట్రంప్‌ పేర్లను కూడా ఆమె ప్రస్తావించారు.

న్యూయార్క్‌కు వెళ్తున్నప్పుడు వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఎప్‌ స్టీన్‌ తన ప్రైవేట్‌ జెట్‌ ను న్యూజెర్సీలోని అట్లాంటిక్‌ సిటీకి మళ్లించాడని సోబెర్గ్‌ తెలిపారు. అక్కడ తాము కొన్ని గంటల పాటు ట్రంప్‌ క్యాసినోలో ఉన్నామన్నారు. అయితే, తాను ఆయన్ను కలవలేదని చెప్పారు. ఇక బిల్‌ క్లింటన్‌ ను కూడా తానెప్పుడూ ప్రత్యక్షంగా కలవలేదని స్పష్టం చేశారు. ఆయనకు బాలికలు, యువతులంటే ఇష్టమని ఎప్‌ స్టీన్‌ ఓసారి తనతో అన్నాడని సోబెర్గ్‌ ఆ పత్రాల్లో పేర్కొన్నారు.

గొలుసుకట్టు పథకాన్ని పోలినట్లు ఎప్‌ స్టీన్‌ పాల్పడిన సెక్స్‌ కుంభకోణం అమెరికాను అప్పట్లో కుదిపేసింది. పేద, మధ్య తరగతి బాలికలు, యువతులకు భారీ మొత్తం ధనాన్ని ఆశగా చూపించి పామ్‌ బీచ్‌ బంగ్లాకు పిలిపించి అత్యాచారాలు చేసేవాడు. బాధితురాలికి కొంత డబ్బు ఇచ్చి.. మరో యువతిని ఆ బంగ్లాకు తెస్తే ఇంకొంత మొత్తం కమిషన్‌ ఇస్తానని చెప్పేవాడు.

ఇలా 20 ఏళ్లపాటు సాగిన వ్యవహారం 2005లో వెలుగు చూసింది. అప్పుడు ఎఫ్‌ స్టీన్‌ ను అరెస్టు చేసి కొన్ని నెలలు పాటు జైల్లో ఉంచారు. 2019 ఆగస్టులో అతడు జైల్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు.