Begin typing your search above and press return to search.

అందరూ చదవాల్సిన సోషల్ 'పోస్టు'

అవును.. ఈ సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఒక పోస్టును మిస్ కాకుండా చదవాల్సిన అవసరం ఉంది

By:  Tupaki Desk   |   27 Feb 2024 4:55 AM GMT
అందరూ చదవాల్సిన సోషల్ పోస్టు
X

అవును.. ఈ సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఒక పోస్టును మిస్ కాకుండా చదవాల్సిన అవసరం ఉంది. కారణం.. ఇందులో పేర్కొన్న సమాచారం. ఒక అంశం మీద అందరికి ఒకేలాంటి భావన ఉంటుంది. దరిద్రం ఏమంటే.. అది తప్పన్న సంగతి కూడా తెలీని పరిస్థితి. డిజిటల్ యుగంలో.. అందునా ఏఐ.. అదేనండి కృత్రిమ మేధ ఎంట్రీ ఇచ్చినప్పుడు దాని స్థాయి.. సత్తా అన్నది ఎవరికి తెలీదు. కానీ.. కొద్దిరోజులుగా అదేమిటన్నది జనసామ్యానికి తెలుస్తున్న పరిస్థితి. ఇప్పుడే ఇలా ఉంటే.. రానున్న రోజుల్లో మరెన్నో మార్పులకు ఏఐ శ్రీకారం చుట్టటమే కాదు.. సగటు మనిషి జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేయటం ఖాయం. ఇలాంటి వేళ.. వాస్తవాలుగా భావించే కొన్ని అవాస్తవాల గురించి స్పష్టత అవసరం. లేకుంటే దాని వల్ల జరిగే నష్టం ఎంతో ఎక్కువ. అదెంత? అన్నది తాజా సోషల్ పోస్టు చెబుతుంది.

‘వాసిరెడ్డి అమర్నాథ్’ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ మహానగరంలో ఆయన ఒకలాంటి కార్పొరేట్ స్కూళ్లను (ఒకలాంటి ఎందుకుంటే.. మిగిలిన కార్పొరేట్ స్కూళ్లకు భిన్నంగా నిర్వహిస్తుండటంతో) నిర్వహిస్తున్నారు. తనకు అవగాహన ఉన్న అంశాల మీద ఆయన తరచూ సోషల్ పోస్టులు పెడుతుంటారు. తాజా పోస్టు మాత్రం.. నెట్ వాడే ప్రతి ఒక్కరు చదవటం.. అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇంట్లో పిల్లలు ఉండే ప్రతి పేరెంట్ చదివి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చదువుకుంటున్న విద్యార్థులే కాదు.. ఉద్యోగ అన్వేషణ దిశగా పయనించే వారు.. ఆ మాటకు వస్తే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. అందుకే ఈ రోజు ఈ సోషల్ పోస్టును తప్పనిసరిగా చదవాలని చెప్పటం జరుగుతోంది. ఇక.. నేరుగా సదరు పోస్టులో ఏముందో చూసేద్దామా?

‘‘కోడింగ్ పని అయిపోయిందా?’’

మీ పిల్లలు కోడింగ్ నేర్చుకొంటే లక్షలు సంపాదించవచ్చు అని ఊదర గొట్టి కొన్ని కంపెనీ లు పెద్ద ఎత్తున లాభాలు ఆర్జించాయి . ఆలా కోడింగ్ నేర్చుకొన్న పిల్లలు ఎవరూ ఉద్యోగాలు సాధించలేదు . సరే కోడింగ్ నేర్చుకొంటే పిల్లల్లో లాజికల్ థింకింగ్ పెరుగుతుంది . భవిష్యత్తు అంతా అంత కోడింగ్ దే అని తల్లితండ్రులు సరిపెట్టుకున్నారు .

న్విడియా కంపెనీ సీఈఓ జెన్సెన్ హుయాంగ్ ఇప్పుడొక బాంబు పేల్చారు . ఆయన ఏమన్నారంటే ..

"కృత్రిమ మేధతో ఇప్పుడు ఎవరైనా కోడింగ్ చెయ్యొచ్చు .. అంటే కోడింగ్ ను కృత్రిమ మేధ చూసుకొంటుంది . పిల్లలు కోడింగ్ నేర్చుకోనక్కర లేదు ."

కోడింగ్ సంగతి ఎలా ఉన్నా నూతన టెక్నాలజీ పేరుతొ గత కొంత కాలంగా జరుగుతున్న నాటకాలు అన్నీ ఇన్నీ కాదు . మన పిలల్లు టెక్నాలజీ పరంగా అప్డేట్ కాకపోతే ఎక్కడ వెనుకబడి పోతారో అన్న ఆదుర్దా తల్లితండ్రుల్లో ఉంటుంది . దీన్ని కాష్ చేసుకోవడానికి కొన్ని కంపెనీ లు పుట్టుకొచ్చాయి . మీ పిలల్లకు రోబో సైన్స్ నేర్పుతాము అని ఇలాంటి కంపెనీ లు కొన్ని పాఠశాలలతో కలిసి తల్లితండ్రుల్ని బురిడీ కొట్టిస్తున్నాయి .

అక్కడ నేర్పేది ఏమీ ఉండదు . గడ్డీగాదంతో రోబో లాంటిది తయారు చెయ్యడం దానితో కాసేపు పిల్లలు ఏదో నేర్చుకొన్నట్టు కలరింగ్ ఇవ్వడం . టెక్నాలజీ ఎలా వాడుకోవాలో తెలియకపోవడం డిజిటల్ ఏజ్ నిరక్షరాస్యత అవుతుంది . సుమారుగా పదేళ్ల క్రితం కొన్ని కంపెనీ లు .. "మీ స్కూల్ లో ట్యాబు లు తప్పని సరి చెయ్యండి . నోట్స్ ... హోమ్ వర్క్ వీటి ద్వారానే ఇవ్వండి ఇదిగో మీకు నెలకు ఇంత ఆదాయం" అని వచ్చాయి .

" అసలు స్కూల్ లో మొబైల్స్ టాబ్స్ వాడం. ఇంట్లో కూడా వీటి వాడకం అవసరం లేదు. తమరిక దయచేయండి "అని చెప్పాను. అప్పట్లో అదొక సంచలనం .

బ్రెయిన్ ఫెడ్ అనే మ్యాగజైన్ నన్ను ఇంటర్వ్యూ చేసింది ." అన్ని స్కూల్స్.. మొబైల్స్ ను టాబ్స్ ను ప్రోత్సహిస్తుంటే మీరేంటి? అని. టెక్నాలజీని ఎలా వాడుకోవాలో వివరంగా చెప్పాను . ముందుగా ఫ్రాన్స్ .. ఇప్పుడు అనేక ఐరోపా దేశాలు స్కూల్స్ లో మొబైల్స్ ను టాబ్స్ ను నిషేధించాయి . దుబాయ్ లాంటి గల్ఫ్ దేశాల్లో ఇది ఇంకా కొనసాగుతోంది . చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం గ్యారెంటీ .

మరి టెక్నాలజీ ఎలా వాడుకోవాలి ?

అవసరం అనుకొంటే ఇంట్లో డెస్క్ టాప్ ఏర్పాటు చెయ్యాలి . అడల్ట్ సైట్స్ ఓపెన్ కాకుండా దానికి సాఫ్ట్ వెర్ లాక్ వుండాలి . డెస్క్ టాప్ ను ఇంట్లో అందరూ తిరిగే చోట అంటే డ్రాయింగ్ రూమ్ లో ఉండేలా చేసుకోవాలి . పిలల్లు ఏమి బ్రౌజ్ చేస్తుంన్నారో నిరంతరం కనిపెట్టి ఉండాలి .

స్కూల్ లో కంప్యూటర్ ల్యాబ్ లో ప్రతి కంప్యూటర్ కు ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి . పిలల్లు అవసరం అయిన సమాచారాన్ని దీని ద్వారా బ్రౌజ్ చేస్తారు .. డౌన్ లోడ్ చేసుకొంటారు . మా పాఠశాలలో అయితే ఐదో తరగతి నుంచి ప్రతి లెస్సన్ అయిపోయాక కంప్యూటర్ ల్యాబ్ లో పిల్లలు చాట్ జిపిటి వుపయోగించి ఆ చాప్టర్ కు సంబంధించి హయ్యర్ ఆర్డర్ థింకింగ్ ప్రశ్నలు చాట్ జిపిటి ని అడిగి విశ్లేషణాత్మక నైపుణ్యాలను పెంపొందించుకోవడం గత సంవత్సరం గా జరుగుతోంది .

ఎడ్యుకేషన్ సెగ్మెంట్ ఒక పెద్ద లాభాల గని.. అని.. అనేక టెక్ కంపెనీ లు భావిస్తున్నాయి . ఎలాగైనా వీటిలోకి చొరబడాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి . ఆన్లైన్ లెర్నింగ్ ... డిస్టెన్స్ లెర్నింగ్ .. హోమ్ స్కూలింగ్ .. స్కూల్స్ తో కాలాబోరేట్ అయ్యి పిల్లలకు కోడింగ్.. రోబోటిక్స్ నేర్పిస్తాము... అని ముందుకు వస్తున్నాయి . ఐఐటీ స్థాయి మేధావులు గత పదేళ్లుగా స్కూల్ సెగ్మెంట్ లోకి చొచ్చుకొని పోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు . తమ తమ ప్రపోజల్స్ తో ఎంతో మంది నన్ను కలిసారు .

ఇలా చెబుతున్నందుకు సారీ .. మరో సారి.. నాది అహంకారం .. అతిశయోక్తి అనిపించవచ్చు . వీరిలో నూటికి తొంబై తొమ్మిది మందికి స్కూలింగ్ బేసిక్స్ తెలియదు . వీరు తయారు చేసి తీసుకొని వచ్చే ప్రపోజల్స్ క్రేజీ గా ఉంటాయి . వీళ్ళెవరూ ఒక్క రోజు కూడా పిల్లలకు పాఠాలు చెప్పివుండరు . టెక్నాలజీ వుపయోగించి మొత్తం విద్య వ్వవస్థ తమ గుప్పిట పట్టేసి లాభాలు పిండుకోవాలనే ఆత్రుత తప్పించి పిల్లల మనస్తత్వం .. సామజిక తెలివి తేటలు .. భావోద్వేగ తెలివితేటలు..లాంటి అంశాల గురించి ఒక ముక్క అవగాహన ఉండదు . వీరి ఆలోచన చూస్తే జాలి పడి నవ్వుకోవడం తప్పించి చేసేది ఏమీ ఉండదు .

ఒకటి చెప్పనా ?

ఎల్ కేజీ.. మొదలు పదో తరగతి వరకు .. ఆ మాటకొస్తే డిగ్రీ.. పీజీ .. అటుపైన సివిల్స్ ప్రిపరేషన్ దాకా అన్ని అంశాలు నెట్ పై ఫ్రీ గా దొరుకుతాయి . వికీ పీడియా .. యూట్యూబ్ .. ఇప్పుడు చాట్ జిపిటి .. ఇక ఏడూ టెక్ కంపెనీ ల అవసరం ఏముంది ? పిల్లల్ని స్కూల్స్ మానిపించి ఒక లాప్టాప్ ఇచ్చి ఇంట్లో ఫ్రీగా చదివించుకోవచ్చుగా ?

ఆ కేరళ బైజూస్ రవీంద్రన్ .. ఏదో క్యాట్ కోచింగ్ తో ప్రారంభించాడు . అటుపై సివిల్స్ సెగ్మెంట్ లోకి దూరాడు . పదేళ్ల క్రితమే బ్రెయిన్ ట్రీ డైరెక్టర్ మిత్రుడు గోపాల కృష్ణ " వీరిది అత్యాశ . ఏదో అనుకొని సివిల్స్ ఫీల్డ్ లోకి వచ్చాడు . ఇక్కడ నడవదు " అన్నాడు .

లాక్ డౌన్ వచ్చేటప్పటికి ఇతని అత్యాశ.. అంతకు మించి ఇంగిత జ్ఞాన లేమి ఆకాశాన్ని దాటేసి బ్లాక్ హోల్ దాక వెళ్ళిపోయింది . "ఇంకేముంది స్కూల్స్ పని అయిపొయింది . హ్యాపీగా ఇంట్లో కూర్చొని పిల్లలు చదివేసుకొంటారు అని అనుకొన్నాడు . తానొక్కడు అనుకోవడం కాదు . నేటి ప్రపంచం చదువుకొన్న మూర్ఖుల నిలయం .పెద్ద ఎత్తున ఫండింగ్ కంపెనీ లు ఇన్వెస్టర్స్ నమ్మించాడు . గాలిబుడల వ్యాపారం పై లక్షల కోట్లు ప్రవహించాయి . ఎన్నో ఎడ్ టెక్ కంపెనీ లను కొనేశారు . ఇక తాను విశ్వ గురు అనుకొన్నాడు . కరోనా కాలం లో నైతే క్రేజ్ వాలా లను మేనేజ్ చేసి స్కూల్స్ రెండుళ్లు లాక్ డౌన్ ఉండేలా చూసి ఏదో వ్యాపారం సాగించాడు . కోట్లాది తల్లితండ్రులు నమ్మారు .

కరోనా కష్ట కాలం లో " పిల్లలు ఇంట్లో లాప్ టాప్ తో కూర్చుంటే ఏమి జరుగుతోందో నేను చెబితే మండిపడి... నాది అజ్ఞానం అని తేల్చేసిన మేధావుల సాక్షిగా ఇప్పుడు అందరు తల్లితండ్రులకు విషయం అవగతం అయ్యింది . తాను పెట్టిన బైజూస్ నుంచి ఇప్పుడు మెడ పట్టుకొని గెంటి వేయబడిన రవీంద్రన్ .. టెక్నాలజీ పేరుతొ నేడు జరుగుతున్న మోసానికి సజీవ సాక్షం . చెరకురా చెడేవు అని నీతి కథ మరో సారి ఆవిష్కృతం . రవీంద్రన్ బాధలు... బైజూస్ బాధలు.. అయిపోయాయి అని అందరూ ఇప్పడు అనుకొంటునాన్రు . లేదు ... ఇది జస్ట్ బెగిన్నింగ్ .

మోసపోయేవాడు ఉన్నంత కాలం మోసగించేవారు పుట్టుకొస్తూనే వుంటారు . కృషి బ్యాంకు వెంకటేశ్వర రావు లు .. బైజూస్ రవీంద్రన్ లు .. కేవలం పాత్ర దారులు . మన అవగాహాన లేమి అసలు సూత్ర దారి. డిజిటల్ యుగం లో బతికి బట్టకట్టాలంటే క్రిటికల్ థింకింగ్ అవసరం .. లేక పొతే కరోనా వాక్ సీన్ లు .. బైజూస్ రవీంద్రన్ లు .. కట్టలుగా వస్తాయి . ముందుముందు ఇంకా మోసాలు .. హై టెక్ నేరాలు ఘోరాలు జరుగుతాయి . ఒకటి గుర్తు పెట్టుకోండి .. కృత్రిమ మేధ యుగం లో మిమ్మల్ని కాపాడేది మా సహజ మేధ మాత్రమే . దాని పదును పెట్టండి . శుభోదయం . గుడ్ మార్నింగ్.