జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు అరెస్ట్... వ్యవహారం లెక్క పెద్దదే!
ఇందులో భాగంగా జెట్ ఎయిర్ వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ (74)ను శుక్రవారం రాత్రి అరెస్టు చేసింది.
By: Tupaki Desk | 2 Sep 2023 6:20 AM GMTఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఒక కీలక అరెస్ట్ చేసింది. ఇందులో భాగంగా జెట్ ఎయిర్ వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ (74)ను శుక్రవారం రాత్రి అరెస్టు చేసింది. అయితే ఇది ఈడీ చేసిన పెద్ద పెద్ద అరెస్టుల్లో ఒకటిగా చెబుతున్నారు. మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టం కింద ఆయనను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.
అవును... విదేశీ విమాన సర్వీసుల సంస్థ "ఎతిహాద్"కు వాటాల విక్రయ ఒప్పందం విషయంలో ఫెమా నిబంధనలను నరేష్ గోయల్ ఉల్లంఘించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. జెట్ ఎయిర్ వేస్ కోసం రూ.538 కోట్ల రుణాలను కెనరా బ్యాంకు నుంచి పొంది.. వాటిని దారి మళ్లించారనే ఆరోపణలతో ఇప్పటికే ఆయనపై సీబీఐ కేసు నమోదయ్యింది.
వాస్తవానికి 2019 సెప్టెంబర్ లో ముంబై, ఢిల్లీల్లోని ఆయన నివాసాలు, కార్యాలయాలపై తనిఖీలు చేశారు. అనంతరం 2020లో నరేశ్ గోయల్ ని ఈడీ అధికారులు పలు దఫాలు ప్రశ్నించారు. ఇదే క్రమంలో గతేడాది నవంబరులో నరేశ్ గోయల్, ఆయన భార్య అనితా గోయల్ తదితరులపై కెనరా బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ పీ సంతోష్, సీబీఐకి ఫిర్యాదు చేశారు.
అంతక ముందు 2019 మే 25న విదేశాలకు బయలుదేరి వెళ్లేందుకు నరేష్ గోయల్, అనితా గోయల్ లు ప్రయత్నించారు. అయితే... ముంబై విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు విమానం ఎక్కడానికి అనుమతి నిరాకరించారు.
కాగా... దాదాపు 25 ఏండ్ల పాటు నిరంతరాయంగా విమాన సేవలు నిర్వహించిన జెట్ ఎయిర్వేస్.. భారీ నష్టాలను సవిచూసింది. ఈ క్రమంలో సర్వీసుల నిర్వహణకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడంలో పూర్తిగా విఫలం అయ్యింది. ఫలితంగా... 2019 ఏప్రిల్ లో ఈ సంస్థ మూత పడింది.
అనంతరం బ్యాంకులు నిర్వహించిన వేలంలో జలాన్ కల్రాక్ కన్సార్టియం.. జెట్ ఎయిర్వేస్ సంస్థ బిడ్ సొంతం చేసుకుంది. అయితే ఆ సంస్థ ఆధ్వర్యంలో ఇంకా విమానా సర్వీసులు ప్రారంభం కాలేదు!