ఇదేంది యోగి? ఈ తప్పుల మీద తప్పులేంది?
ఒక మెడికల్ కాలేజీలో అగ్నిప్రమాదం ఏమిటి? అంటూ యోగి సర్కారును నిలదీస్తున్న పరిస్థితి. ఈ విషాద వేళ.. అధికారులు వ్యవహరించిన తీరుపై ప్రజలు మండిపడుతున్నారు
By: Tupaki Desk | 17 Nov 2024 4:05 AM GMTఒకరు కాదు.. ఇద్దరు కాదు. ఏకంగా పది మంది. అది కూడా అభం శుభం తెలియని శిశువులు. తమను తాము కాపాడుకోలేని వయసులో.. అనారోగ్యం బారిన పడి.. ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే అగ్నిప్రమాదం చోటు చేసుకోవటం.. ఆ మంటల్లో సజీవ దహనమైన ఘోర విషాదం ఉత్తరప్రదేశ్ లోని ఝూన్సీ జిల్లాలో జరగటం తెలిసిందే. ఈ విషాద ఉదంతంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక మెడికల్ కాలేజీలో అగ్నిప్రమాదం ఏమిటి? అంటూ యోగి సర్కారును నిలదీస్తున్న పరిస్థితి. ఈ విషాద వేళ.. అధికారులు వ్యవహరించిన తీరుపై ప్రజలు మండిపడుతున్నారు.
షార్ట్ సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటల్లో పది మంది చిన్నారులు సజీవ దహనమైన విషాద ఉదంతం గురించి తెలిసిన వారంతా కన్నీటి పర్యంతం కావటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆసుపత్రికి వచ్చే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కోసం అక్కడి సిబ్బంది చేసిన ఏర్పాట్లను చూసిన వారు తీవ్రంగా తప్పు పడుతున్నారు. ఒకవైపు పుట్టెడు శోకంలో బాధితులు ఉంటే.. వారిని పరామర్శించేందుకు వచ్చే డిప్యూటీ సీఎంను రిసీవ్ చేసుకోవటానికి.. ఆసుపత్రి ఆవరణను యుద్ధ ప్రాతిపదికన శుభ్రం చేయటం.. సున్నం చల్లి.. విపీఐ ట్రీట్ మెంట్ ఇవ్వటాన్ని తప్పు పడుతున్నారు.
అగ్నిప్రమాదంలో చిన్నారులు సజీవ దహనమై.. బాధిత కుటుంబాలు గుండెలు అవిసేలా రోదిస్తుంటే.. వారిని ఓదార్చటానికి బదులు.. మెడికల్ కాలేజీకి వస్తున్న డిప్యూటీ సీఎంకు స్వాగతం పలికేందుకు రోడ్లను శుభ్రం చేస్తారా? అంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రహం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించిన ఒక వీడియోను పోస్టు చేసింది. అప్పటివరకు మురికి కూపంలా ఉన్న ఆసుపత్రిని శుభ్రం చేసేందుకు ముందుకు రాని సిబ్బంది.. ఉప ముఖ్యమంత్రి వస్తున్నారన్నంతనే ఇలాంటి హడావుడి చేయటాన్ని తప్పు పడుతున్నారు. యూపీలోని ప్రభుత్వ ఆసుపత్రులు అవినీతికి.. నిర్లక్ష్యానికి నిలువెత్తు రూపాలుగా మారాయన్న విమర్శలు వస్తున్నాయి. మంటల్లో చిక్కుకున్న చిన్నారుల్ని రక్షించేందుకు ఆసుపత్రిలో ఎలాంటి ఏర్పాట్లు లేవని.. ప్రజలు చనిపోతున్నా యోగి సర్కారుకు ఏం పట్టదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి నిప్పులు చెరిగారు.
చిన్నారుల మరణంపై యోగి సర్కారు రియాక్టు అయ్యే తీరు ఇదేనా? అన్నది ప్రశ్నగా మారింది. మరోవైపు.. దేశంలోని ఏ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినా.. ముఖ్యమంత్రి యోగిని అక్కడికి పంపటం బీజేపీకి రివాజుగా మారిన సంగతి తెలిసిందే. దీర్ఘకాలంగా ముఖ్యమంత్రిగా ఉంటూ రాష్ట్రాన్ని ఒక కొలిక్కి తీసుకురావటంలో యోగి ఫెయిల్ అయ్యారన్న విమర్శలు ఈ మధ్యన ఎక్కువ అయ్యాయి. తన రాక కోసం వీఐపీ ఏర్పాట్లు చేసిన వైనంపై విమర్శలు పెద్ద ఎత్తున రావటంతో ఉప ముఖ్యమంత్రి బ్రజేశ్ పాఠక్ రియాక్టు అయ్యారు. తాను ఆసుపత్రికి వెళ్లేసరికే ఏర్పాట్లు చేశారని.. అందులో తన పాత్ర ఏమీ లేదన్న వివరణ ఇచ్చిన ఆయన.. దీన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. అందుకు బాధ్యులైన అధికారుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా మెజిస్ట్రేట్ ను ఆదేశించినట్లుగా పేర్కొన్నారు. ఏమైనా.. ఝూన్సీ జిల్లా మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కాలేజీ ఎపిసోడ్ యోగి సర్కారు ఇమేజ్ ను భారీగా డ్యామేజ్ చేసిందని మాత్రం చెప్పక తప్పదు.