Begin typing your search above and press return to search.

ఝార్ఖండ్ టు హైదరాబాద్... రేవంత్ ఆధ్వర్యంలో జేఎంఎం ఎమ్మెల్యేలు?

ఝార్ఖండ్ లో తలెత్తిన రాజకీయ సంక్షోభం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   1 Feb 2024 10:41 AM GMT
ఝార్ఖండ్  టు హైదరాబాద్... రేవంత్  ఆధ్వర్యంలో జేఎంఎం ఎమ్మెల్యేలు?
X

ఝార్ఖండ్ లో తలెత్తిన రాజకీయ సంక్షోభం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అరెస్టు తర్వాత అక్కడ రాజకీయంగా ఆసక్తికర పరిణామాలు ఎదురవుతున్నాయి. ఇందులో భాగంగా... జేఎంఎం శాసనసభా పక్ష నేతగా పేరున్న జార్ఖండ్ రవాణా మంత్రి చంపాయ్ సోరెన్ తనకు 47 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ప్రకటించారు. ఇప్పుడు వారిని కాపాడుకునే పనిలో ఉన్నారని తెలుస్తుంది.

అవును... హేమంత్ సోరెన్ అరెస్టు అనంతరం తనకు తనకు 47 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని జార్ఖండ్ రవాణా మంత్రి చంపాయ్ సోరెన్ ప్రకటించారు.అయినప్పటికీ ఆయన ప్రమాణ స్వీకారానికి గవర్నర్ ఇంకా ఆహ్వానించలేదు. ఈ సమయంలో ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకోవడం ఇప్పుడు చంపాయ్ ముందున్న పెద్ద టాస్క్ గా చెబుతున్నారు. దీంతో... ఆయన కీలక నిర్ణయం (కాంప్ రాజకీయం) తీసుకున్నారని తెలుస్తుంది.

ఇందులో భాగంగా... అధికార పార్టీ ఎమ్మెల్యేలను ఆకర్షించేందుకో, కొనేందుకో, బేరాలాడేందుకో ప్రతిపక్ష పార్టీ బీజేపీ ప్రయత్నించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో... భయంతోనో, ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగానో... జేఎంఎం - ఆర్జేడీ - కాంగ్రెస్‌ పార్టీలు జేఎంఎంకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలను ప్రత్యేక విమానంలో ఝార్ఖండ్ నుంచి హైదరాబాద్‌ కు తరలించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

సుప్రీంకోర్టును ఆశ్రయించిన సోరెన్!:

ఆ సంగతి అలా ఉంటే... భూ కుంభకోణం కేసులో ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) అధినేత హేమంత్ సోరెన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో... భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఈ పిటిషన్‌ ను జాబితా చేయగా... ఈ అంశాన్ని శుక్రవారం విచారణకు తీసుకుంటామని పేర్కొన్నారని తెలుస్తుంది.

ఇదే క్రమంలో తన ఇంట్లో దాడులు చేస్తున్న సమయంలో ఒక వీడియో సందేశం విడుదల చేసిన సోరెన్... "వారికి ఇంకా ఎలాంటి ఆధారాలు కనుగొనబడలేదు. వారు నా ఢిల్లీ నివాసంపై దాడులు నిర్వహించి నా ప్రతిష్టను చెడగొట్టడానికి ప్రయత్నించారు. పేదలు, ఆదివాసీలు, దళితులు, అమాయక ప్రజలమైన మేము ఇప్పుడు దౌర్జన్యాలకు పాల్పడే వారిపై కొత్త పోరాటం చేయాలి!" అని అన్నారు.

బీజేపీ ప్రభుత్వంపై లాలూ ఫైర్!:

మరోపక్క... ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, బీజేపీ ప్రభుత్వంపై తన విమర్శలను కొనసాగించారు. ఇందులో భాగంగా... జార్ఖండ్‌ లోని గిరిజన ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ ను కేంద్రంలోని నియంతృత్వ ప్రభుత్వం చిత్రహింసలకు గురిచేస్తోంది. బీజేపీ అనుసరిస్తున్న ఈ అసహ్యకరమైన వ్యూహాలు స్వల్పకాలం ఇబ్బందులను కలిగిస్తాయి కానీ.. వెనుకబడిన, దళిత, గిరిజన, మైనారిటీ వర్గాల సంకల్పం, ఆశయాలను ఓడించలేవని అన్నారు.