ఊపిరి పీల్చుకున్న సోరెన్ సర్కార్!
ఈ నేపథ్యంలో జార్ఖండ్ ఎమ్మెల్యేలను హైదరాబాద్ కు తరలించారు. ఫిబ్రవరి 5న విశ్వాస పరీక్ష జరగనుండటంతో వారంతా ఫిబ్రవరి 4 సాయంత్రం జార్ఖండ్ కు చేరుకున్నారు.
By: Tupaki Desk | 5 Feb 2024 10:36 AM GMTజార్ఖండ్ లో ఎలాంటి మలుపులు చోటు చేసుకోలేదు. జార్ఖండ్ ముఖ్యమంత్రి, జేఎంఎం అధ్యక్షుడు హేమంత్ సోరెన్ ను మనీలాండరింగ్ కేసులో ఎనఫోర్సుమెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన తన సతీమణి కల్పన సోరెన్ ను సీఎంను చేయాలని ఆశించారు. అయితే దీనికి ఆమె సహచర ఎమ్మెల్యే, తోటి కోడలు అడ్డు చెప్పారు. దీంతో ఆ ప్రయత్నం నెరవేరలేదు. దీంతో సీనియర్ ఎమ్మెల్యే చంపయ్ సోరెన్ కు ముఖ్యమంత్రి బాధ్యతలను హేమంత్ సోరెన్ అప్పగించారు.
హేమంత్ సోరెన్ అరెస్టు, ఎమ్మెల్యేల మధ్య లుకలుకలతో జార్ఖండ్ లోనూ రాజకీయ సంక్షోభం తప్పదని.. కొందరు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరతారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జార్ఖండ్ ఎమ్మెల్యేలను హైదరాబాద్ కు తరలించారు. ఫిబ్రవరి 5న విశ్వాస పరీక్ష జరగనుండటంతో వారంతా ఫిబ్రవరి 4 సాయంత్రం జార్ఖండ్ కు చేరుకున్నారు.
బలపరీక్షలో చంపయ్ సోరెన్ ప్రభుత్వానికి అనుకూలంగా 47 ఓట్లు వచ్చాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా 29 ఓట్లు పడ్డాయి. దీంతో ప్రభుత్వం బలపరీక్షల్లో నెగ్గినట్టయింది.
కాగా జార్ఖండ్ లో మొత్తం 81 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రస్తుతం అసెంబ్లీలో జార్ఖండ్ ముక్తి మోర్చా(28), కాంగ్రెస్(16), ఆర్జేడీ(1) కూటమికి 45 సీట్లు ఉన్నాయి. ఈ మూడు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. సీపీఐ(ఎంఎల్)ఉన్న ఏకైక ఎమ్మెల్యే ఆ కూటమికి బయటి నుంచి మద్దతు అందిస్తున్నారు.
ఇక ప్రతిపక్ష బీజేపీ కూటమికి 29 మంది ఎమ్మెల్యేలున్నారు. బలపరీక్షలో గెలవాలంటే జేఎంఎం కూటమికి 41 ఓట్లు వస్తే సరిపోతుంది. అయితే, కావాల్సిన మెజారిటీ కంటే మరో నలుగురి మద్దతు అధికంగా ఉంది. దీంతో బలపరీక్షలో నెగ్గింది. ఈ నేపథ్యంలో జైలులో ఉన్న జేఎంఎం అధినేత హేమంత్ సోరెన్ కు కాస్త ఊరట లభించింది.