9 ఏళ్లుగా మెదడు క్యాన్సర్... యూఎస్ మాజీ ప్రెసిడెంట్ 100వ బర్త్ డే!
అవును... అమెరికా 39వ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ మంగళవారం 100వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ ఘనత సాధించిన తొలి అధ్యక్షుడిగా చరిత్ర సృష్టించారు.
By: Tupaki Desk | 2 Oct 2024 8:30 AM GMTఆరోగ్యమే మహాభాగ్యం అంటారు.. నిండు నూరేళ్లూ సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని పెద్దలు దీవిస్తుంటారు. అయితే 91వ ఏట మెదడు క్యాన్సర్ బారిన పడినప్పటికీ తాజాగా తన 100వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు అమెరికా మాజీ ప్రెసిడెంట్ జిమ్మీ కార్టర్. యూఎస్ కు ఈయన 39వ ప్రెసిడెంట్.
అవును... అమెరికా 39వ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ మంగళవారం 100వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ ఘనత సాధించిన తొలి అధ్యక్షుడిగా చరిత్ర సృష్టించారు. 1924 అక్టోబర్ 1 న జన్మించిన కార్టర్... 1971-81 మధ్యలో దేశాధ్యక్షుడిగా సేవలందించారు. ఈ క్రమంలో 2002లో ఆయనకు నోబెల్ శాంతి బహుమతి లభించింది.
వాస్తవానికి తొమ్మిదేళ్ల క్రితం జిమ్మీ కార్టర్ మెదడు క్యాన్సర్ బారిన పడ్డారు. అట్లాంటాలోని కార్టర్ సెంటర్ లో తొమ్మిదేళ్ల క్రితం జరిగిన విలేకరుల సమావేశంలో కార్టర్.. తన క్యాన్సర్ నిర్ధారణ, చికిత్స గురించి చర్చించారు. ఆ సమయంలో కార్టర్ వయసు 91 సంవత్సరాలు. ఆ సమయంలో తన శారీరక స్థితి గురించి ఆయన వివరించారు.
2015 ఆగస్టు ప్రారంభంలో 91 సంవత్సరాల వయసులో కార్టర్ కు మెలనోమా నిర్ధారణ అయ్యింది. ఇది క్యాన్సర్ కి అత్యంత ప్రమాదకరమైన రూపం అని చెబుతారు. అదే నెలలో అతనికి కాలేయ శస్త్రచికిత్స జరిగింది. ఆ సమయంలోనే అతని మెదడు క్యాన్సర్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఆ సమయంలో అతను జీవించడానికి సుమారు ఆరు నెలల సమయం ఇవ్వబడిందట.
అయితే అనూహ్యంగా మాజీ ప్రెసిడెంట్ మంగళవారం తన 100వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా స్పందించిన నిపుణులు... ఆయన విషయంలో అదృష్టం కీలక పాత్ర పోషించిందని, ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదని, దానికి తోడు అతను పొందిన రోగనిరోధక చికిత్స కారణంగా ఈ రోజు జీవించి ఉన్నారని అంటున్నారు!