25 నిమిషాల వీడియో కోసం రూ.850 కోట్ల ఖర్చు చేస్తున్న యూట్యూబర్
ఇంత భారీ బడ్జెట్ ఒక యూట్యూబ్ కోసం.. అది కూడా పాతిక నిమిషాల వీడియో కోసం అంటే అవాక్కు అవ్వాల్సిందే.
By: Tupaki Desk | 11 Jan 2025 6:30 AM GMTఇప్పుడున్న పరిస్థితుల్లో ఓ తెలుగు సినిమా కోసం పెట్టే ఖర్చు పెట్టే ఖర్చు రూ. 5 నుంచి రూ.10 కోట్లు అవుతుంది. రూ.100 కోట్ల బడ్జెట్ అంటే.. ఒక మోస్తరుకు మించిన సినిమా అవుతుంది. ఇక.. భారీ బడ్జెట్ మూవీ అంటే నాలుగైదు వందల కోట్లుగా చెబుతారు. మరి.. రూ.850 కోట్లు అయితే.. అదో సన్సేషన్ మూవీగా నిలుస్తుంది. ఇంత భారీ బడ్జెట్ ఒక యూట్యూబ్ కోసం.. అది కూడా పాతిక నిమిషాల వీడియో కోసం అంటే అవాక్కు అవ్వాల్సిందే. అలాంటి ప్రయత్నమే చేశాడో యూట్యూబర్.
అక్కడితో అగిందా? ఈ పాతిక నిమిషాల వీడియో కోసం ఒక భారీ సెట్ వేయించాడు. అందు కోసం రూ.119 కోట్లు ఖర్చు పెట్టిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఒక యూట్యూబర్ తన యూట్యూబ్ వీడియో కోసం ఇంత భారీగా ఖర్చు పెట్టటమా? అంటూ అవాక్కు అవుతున్నారు. ఇంతకూ అతనెవరు? అంత భారీగా ఎలా ఖర్చు చేస్తున్నాడంటే.. దానికి కారణం లేకపోలేదు.
మిస్టర్ బీస్ట్ గా పేరున్న అతని రియల్ పేరు.. జిమ్మీ డొనాల్డ్ సన్. కెనడాకు చెందిన ఈ యువకుడు.. టొరంటో సిటీకి సమీపాన ఒక భారీ సెట్ వేయించాడు. ఇందుకోసం వేయించిన సెట్ తో ఒక సినిమానే నిర్మించే వీలుంది. అంతలా ఖర్చు ఎలా చేస్తాడు? అంటే.. ప్రపంచంలోనే అత్యధిక సబ్ స్క్రైబర్లున్న యూట్యూబర్ గా అతనికి పేరుంది. ఇలాంటి ఘనత ఉన్న వ్యక్తి సంపాదన కూడా భారీగా ఉంటుంది కాబట్టి.. భారీగా ఖర్చు చేసినంత మాత్రాన అతగాడికి కలిగే నష్టమేమీ లేదంటున్నారు.
ఇంతకూ ఇంత భారీ సెట్ ఎందుకు వేయించాడంటే.. అతగాడు నిర్వహిస్తున్న ఒక గేమ్ కోసం ఈ భారీ సెటప్ కు తెర తీశాడు. ఇందులో గెలిచిన వారికి ప్రైజ్ మనీ ఎంతో తెలుసా? అది కూడా భారీనే. అవును.. ఈ గేమ్ షోలో విజేతకు ఏకంగా రూ.37కోట్లు ఇవ్వనున్నాడు. మొత్తంగా చూస్తే పాతిక నిమిషాల యూ ట్యూబ్ వీడియో కోసం పెట్టుకున్న బడ్జెట్ రూ.850 కోట్లు. ఇదంతా చదువుతున్నప్పుడు .. క్వాలిటీ కోసం ఎంతకైనా వెళ్లే మన జక్కన్న మాదిరే ఇతగాడి తీరు ఉన్నట్లు అనిపించట్లేదు?