Begin typing your search above and press return to search.

జియో దూకుడు.. ఇకపై కొత్త వ్యాపారంలోకి!

అమెరికాకు చెందిన బ్లాక్ రాక్ సంస్థతో కలిసి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ మ్యూచువల్ ఫండ్ వ్యాపారంపై పెట్టుబడులు పెడుతున్నట్లుగా ప్రకటించింది.

By:  Tupaki Desk   |   23 Jan 2025 6:23 AM GMT
జియో దూకుడు.. ఇకపై కొత్త వ్యాపారంలోకి!
X

అంతకంతకూ విస్తరిస్తున్న జియో సరికొత్త వ్యాపారంలోకి అడుగు పెట్టింది. ఈసారి తాను మాత్రమే కాకుండా కొత్త భాగస్వామితో సరికొత్త వ్యాపారానికి తెర తీసింది. అమెరికాకు చెందిన బ్లాక్ రాక్ సంస్థతో కలిసి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ మ్యూచువల్ ఫండ్ వ్యాపారంపై పెట్టుబడులు పెడుతున్నట్లుగా ప్రకటించింది. ఇందుకోసం రూ. 117 కోట్లను పెట్టినట్లుగా ప్రకటించాయి.

ఈ వ్యాపారంలో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్.. బ్లాక్ రాక్ సంస్థలు చెరో యాభై శాతం వాటాతో జియో బ్లాక్ రాక్ అస్సెట్ మేనేజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ను ఏర్పాటు చేసింది. జియో బ్లాక్ రాక్ అస్సెట్ మేనేజర్స్ కు సంబంధించిన రూ.117 కోట్ల విలువ చేసే ఈక్విటీ షేర్లను (ఒక్కొక్కటి రూ.10 ముఖ విలువ) జియో ఫైనాన్షియల్.. బ్లాక్ రాక్ లు చెరిసగం కేటాయింపులు జరుపుకున్నట్లుగా వెల్లడించింది. ఈ కంపెనీ ద్వారా స్టాక్ బ్రోకింగ్ వ్యాపారాన్ని నిర్వహించనున్నారు.

కొవిడ్ తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్ లో మదుపు చేసే వారి సంఖ్య అనూహ్యంగా పెరగటం తెలిసిందే. ఎక్కువ మంది రిటైల్ పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్లకు తరలి వస్తున్నారు. మార్కెట్లు.. పెట్టుబడి అవకాశాల్ని సులభంగా అందుకునేందుకు ఆన్ లైన్ ట్రేడింగ్ ప్లాట్ ఫామ్ ల వైపు ఇన్వెస్టర్లు మళ్లుతున్నారు. ఈ కారణంగానే జెరోధా.. ఏంజిల్ వన్.. అప్ స్టాక్స్.. ఫైవ్ పైసా లాంటి సంస్థలు త్వరితగతిన పెరగటం తెలిసిందే. ఈ ఫ్లాట్ ఫాంలు యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ ఫేస్ లతో ఈ వ్యాపారంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాయి. ఎక్కువ మందికి స్టాక్ ట్రేడింగ్ ను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఈ నేపథ్యంలో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ ఈ వ్యాపారం మీద ఫోకస్ చేసింది.

ఇక.. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ 2024 డిసెంబరుకు అమ్మకాల్లో స్వల్ప పెరుగుదలను నమోదు చేసింది. 2023 డిసెంబరుతో పోలిస్తే 2024 డిసెంబరులో స్వల్ప వ్రద్ధిని నమోదు చేసింది. అయితే.. 2023 డిసెంబరులో ఉన్న 77 శాతం లాభాల మార్జిన్ మాత్రం 2024 డిసెంబరు నాటికి 71 శాతానికి పడిపోవటం గమనార్హం. లాభాల్లో క్షీణత ఉన్నప్పటికి.. నికర లాభం స్థిరంగా ఉంది. తాజా వ్యాపారంతో జియో ఫైనాన్షియల్ సర్వీస్ మరింత బలోపేతం కానుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.