Begin typing your search above and press return to search.

అంబానీ సమర్పించు 'జియో' మెగా ఐపీవో!

ఇప్పటివరకు రూ.21వేల కోట్లు సమీకరించిన ఎల్ఐసీ (లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్) ఐపీవోనే అతి పెద్దదిగా ఉంది

By:  Tupaki Desk   |   6 July 2024 5:27 AM GMT
అంబానీ సమర్పించు జియో మెగా ఐపీవో!
X

రిలయన్స్ సంస్థను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఏం చేసినా భారీగా చేసే ఈ సంస్థ.. తన సంస్థ నుంచి రిలయన్స్ జియోను వేరు చేయటం తెలిసిందే. టెలికాం సేవల విభాగమైన జియోకు సంబంధించి కీలక నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా చెబుతున్నారు. దేశంలోనే అతి పెద్దదైన ఐపీవోకు జియో రంగం సిద్ధం చేస్తుందన్నది ఇప్పుడు కార్పొరేట్ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది. ఈ ఐపీవో ద్వారా రిలయన్స్ జియో సమీకరించాలనుకుంటున్న నిధులు ఎంతో తెలుసా? అక్షరాల రూ.55వేల కోట్లు. ప్రస్తుతం చర్చ జరుగుతున్నదే వాస్తవ రూపం దాలిస్తే.. దేశంలోనే అతి పెద్ద ఐపీవోగా మారుతుంది.

ఇప్పటివరకు రూ.21వేల కోట్లు సమీకరించిన ఎల్ఐసీ (లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్) ఐపీవోనే అతి పెద్దదిగా ఉంది. రిలయన్స్ జియో దాన్ని అధిగమించటం ఖాయమంటున్నారు. రిలయన్స్ జియో ఇటీవలే మొబైల్ టారిఫ్ లు పెంచటం.. ఇప్పటివరకు 4జీ టారిఫ్ తోనే 5జీ సేవల్ని ఇస్తున్న సంస్థ.. ఇకపై 5జీకి ప్రత్యేక టారిఫ్ నిర్ణయించే వీలుందని చెబుతున్నారు. ఇవన్నీ కూడా సదరు టెలికాం సేవల సంస్థ పబ్లిక్ ఇష్యూకు వెళ్లే ముందు చేసే ప్రయత్నాలుగా చెబుతున్నారు. దీనికి తోడు.. సాంకేతిక అంశం కూడా ఐపీవోకు వెళ్లేందుకు కారణమవుతుందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

పెద్ద కంపెనీలు తమ విలువలో కనీసం 5 శాతం.. చిన్న కంపెనీలు అయితే పది శాతానికి సమానమైన వాటాను ఐపీవో ద్వారా అమ్మాల్సి ఉంటుంది. జియో విలువను మదింపు చేస్తే.. దాని 5 శాతం వాటానే దాదాపు రూ.55వేల కోట్లుగా ఉంటుంది. ప్రస్తుతం జియో ప్లాట్ ఫామ్స్ లో ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ కు 67.03 శాతం వాటా.. మిగిలిన 32.97 శాతంలో 17.72 శాతం మెటా.. గూగుల్ కు ఉన్నాయి . అంతర్జాతీయ పీఈ సంస్థలైన విస్టా ఈక్విటీ పార్టనర్స్.. కేకేఆర్.. పీఐఎఫ్.. సిల్వర్ లేక్.. ఎల్ కాటర్టన్.. జనరల్ అట్లాంటిక్.. టీపీజీలకు 15.25 శాతం వాటా ఉంది.

2020లో అంతర్జాతీయ పెట్టుబడిదార్ల నుంచి జియో ప్లాట్ ఫామ్స్ కు రూ.1.52 లక్షల కోట్లను సమీకరించిన సంగతి తెలిసిందే. తాజా ఐపీవో ద్వారా సదరు అంతర్జాతీయ సంస్థలు జియో నుంచి తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవచ్చని చెబుతున్నారు. తాజా టారిఫ్ పెంపు.. 5జీ కు ప్రత్యేక టారిఫ్ ప్లాన్ ప్రతిపాదన నేపథ్యంలో జియో విలువ దాదాపు రూ.11.11 లక్షల కోట్ల వరకు ఉండొచ్చని ప్రముఖ అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ జెఫ్రీస్ అంచనా వేస్తోంది.

కార్పొరేట్ వర్గాల అంచనా ప్రకారం జియో కానీ రూ.55వేల కోట్ల ఐపీవోకు వెళితే.. దేశంలోనే అతి పెద్ద ఐపీవోగా నిలుస్తుందని చెప్పక తప్పదు. దీనికి సంబంధించిన చర్చకు అధికారిక ఆన్సర్ రావాలంటే ఆగస్టు వరకు వెయిట్ చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఏటా ఆగస్టులో రిలయన్స్ తమ వార్షిక్ సాధారణ సమావేశాన్ని ఏర్పాటు చేయటం తెలిసిందే. ఈసారి విశ్లేషకులు.. పరిశ్రమల నిపుణులు.. జియో ఐపీవో గురించి ముకేశ్ అంబానీని క్లారిటీ ఇవ్వాలని కోరే వీలుంది. ఆ సమయంలోనే మెగా ఐపీవోకు సంబంధించి కీలక ప్రకటన వెలువడే వీలుందన్న మాట వినిపిస్తోంది.