కోదండ సారుకు దాసోజు గండం.. ఎమ్మెల్సీ కేసు తిరగమోత
బీఆర్ఎస్ హయాంలో ప్రస్తుత హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమించడం వివాదాస్పదమైంది.
By: Tupaki Desk | 13 Aug 2024 9:47 AM GMTఇద్దరూ ఉన్నత విద్యావంతులే.. ఇద్దరూ తెలంగాణ ఉద్యమకారులే.. ఇద్దరూ సామాజిక చైతన్యం ఉన్నవారే.. చివరకు ఇద్దరూ అధికార కేంద్రాలకు దూరమైనవారే.. ఇద్దరూ ఎమ్మెల్సీ అందినట్లే అంది చేజారినవారే. అయితే, ఇప్పుడు మరోసారి ఇదే అంశం చర్చనీయాంశం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇదేంటో కానీ.. తెలంగాణ శాసన మండలి గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నామినేటెడ్ వ్యవహారం ఎంతకూ తెగేలా లేదు. చివరకు ఎవరిని నియమించినా అది ఆగిపోయేలా కనిపిస్తోంది. అది బీఆర్ఎస్ ప్రభుత్వమైనా.. కాంగ్రెస్ సర్కారులో అయినా..
కౌశిక్ రెడ్డి నుంచి కోదండ వరకు..
బీఆర్ఎస్ హయాంలో ప్రస్తుత హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమించడం వివాదాస్పదమైంది. ఆయనను సామాజిక సేవా రంగంలో ప్రతిపాదించగా అప్పటి గవర్నర్ తమిళిసై తిరస్కరించారు. ఆ తర్వాత బీఆర్ఎస్ సర్కారే దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణలను ఎమ్మెల్సీలుగా నియమించాలని తమిళిసైకి సిఫారసు చేసింది. కానీ, ఆమె ఇది కుదరదంటూ తోసిపుచ్చారు. ‘తన (గవర్నర్) కోటా’లో ప్రతిపాదించిన వీరిద్దరూ రాజకీయ నాయకులని తేల్చిచెప్పారు. అయితే, అప్పటి ప్రభుత్వానికి, తమిళిసైకి ఉన్న తీవ్ర విభేదాలు కూడా దీని వెనుక కారణంగా చెప్పకొచ్చారు. అయితే, తమిళిసై ఉండగానే బీఆర్ఎస్ ఓడిపోవడం.. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక దాదాపు మూడు నెలల వ్యవధి పాటు తమిళిసై గవర్నర్ గా ఉన్నారు. ఈ స్వల్ప సమయంలోనే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా తెలంగాణ జన సమితి పార్టీ అధినేత కోదండరాం, సియాసత్ ఉర్ధూ దిన పత్రిక ఎడిటర్ అమీర్ అలీఖాన్ పేర్లను రేవంత్ రెడ్డి సర్కారు ప్రతిపాదించింది. వీటిని ఆమె ఆమోదించారు.
మళ్లీ అదే పేచీ..
బీఆర్ఎస్ హయాంలో కౌశిక్ రెడ్డి పేరుపై వచ్చినట్లే.. కాంగ్రెస్ సర్కారులో కోదండ పేరుపై అభ్యంతరాలు ఉండవని భావిస్తే అనూహ్యంగా దాసోజు శ్రవణ్ సీన్ లోకి వచ్చారు. తనను, కుర్రా సత్యనారాయణల పేర్లను రాజకీయ నాయకులుగా పేర్కొంటూ తిరస్కరించిన గవర్నర్.. కాంగ్రెస్ ప్రభుత్వం సూచించిన పేర్లలో కోదండరాంను ఎలా ఆమోదిస్తుందంటూ కోర్టుకు వెళ్లారు. కోదండరాం తెలంగాణ జన సమితి (టీజేఎస్) అనే రాజకీయ పార్టీ అధ్యక్షుడు అంటూ శ్రవణ్, కుర్రా సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్ ను విచారించిన హైకోర్టు.. రాష్ట్ర గవర్నర్ నిర్ణయాన్ని తప్పుపట్టింది. అలా అందినట్లే అందిన ఎమ్మెల్సీ పదవి కోదండ, అమీర్ అలీఖాన్ ల చేజారింది. అయితే, ఇటీవల మంత్రివర్గ సమావేశంలో కోదండ, అమీర్ పేర్లను మరోసారి గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా సిఫారసు చేయాలని నిర్ణయించి, ఆ మేరకు పంపింది. అయితే, అప్పటికే ఇంచార్జి గవర్నర్ స్థానంలో పూర్తిస్థాయి గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ వచ్చారు. ఇప్పుడు జిష్ణు దేవ్ తీసుకునే నిర్ణయమే కీలకం కానుంది. మరోవైపు ఆయన నిర్ణయంపై దాసోజు సిద్ధంగా ఉన్నారు. ఆమోద ముద్ర వేస్తే గనుక కోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నారు. అదే జరిగితే.. కోర్టు ఏం చెబుతుందో చూడాలి.
కాగా, శ్రవణ్, కోదండరాంలు తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అదే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక కేసీఆర్ కు దూరమయ్యారు. మలి దశ ఉద్యమంలో కోదండే ముందున్నారు. ఇక వివిధ వేదికలపై, మీడియాలో శ్రవణ్ తెలంగాణ వాదం వినిపించారు. అలాంటి వారు ఇప్పుడు ఎమ్మెల్సీ పదవుల అంశమై పరోక్షంగా తలపడుతున్నారు.