ప్రత్యేక హోదాపై కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు!
ప్రత్యేక హోదా అంశం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. కేంద్రంలో బీజేపీకి పూర్తి స్థాయి మద్దతు లభించలేదు
By: Tupaki Desk | 14 July 2024 9:07 AM GMTప్రత్యేక హోదా అంశం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. కేంద్రంలో బీజేపీకి పూర్తి స్థాయి మద్దతు లభించలేదు. దీంతో టీడీపీ, జేడీయూల మద్దతుతో బీజేపీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. టీడీపీ, జేడీయూ మద్దతు ఉపసంహరించుకుంటే బీజేపీ ప్రభుత్వం కూలిపోతుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేక హోదా సాధించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
మరోవైపు ప్రత్యేక హోదా డిమాండ్ ను బీహార్ కూడా వినిపిస్తోంది. తమకు ప్రత్యేక హోదా, వెనుకబడిన ప్రాంతాలకు నిధులు కేటాయించాలని జేడీయూ డిమాండ్ చేస్తోంది. ప్రస్తుతం బీహార్ లో జేడీయూ, బీజేపీ సంకీర్ణ సర్కారు అధికారంలో ఉంది. జేడీయూ అధినేత నితీశ్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. జేడీయూకు 12 మంది ఎంపీలు ఉన్నారు.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రంలో ప్రత్యేక హోదా డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో బీహార్ మాజీ ముఖ్యమంత్రి, హిందుస్థానీ ఆవామీ మోర్చా అధినేత, కేంద్ర సూక్ష్మ, చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి అయిన జితన్ రామ్ మాంఝీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రత్యేక హోదాను తాము కోరుకుంటున్నప్పటికీ నీతి ఆయోగ్ ప్రత్యేక హోదా ఇవ్వడానికి తిరస్కరిస్తోందని తెలిపారు. తమకే కాకుండా ఏ రాష్ట్రానికైనా ప్రత్యేక హోదా ఇవ్వడానికి నీతి ఆయోగ్ అంగీకరించడం లేదన్నారు. ఇందుకు సంబంధించి పలు నిబంధనలను ప్రస్తావిస్తోందని తెలిపారు.
ప్రత్యేక హోదా ఇస్తే రాష్ట్ర ఆర్థిక అవసరాలు తీరతాయని జితన్ రామ్ మాంఝీ వెల్లడించారు. వివిధ రాజకీయ పార్టీలకు చెందినవారు దేన్నైనా సాధించగలుగుతున్నారని.. ప్రత్యేక హోదాను మాత్రం సాధించలేకపోతున్నారని తెలిపారు.
అయితే బీహార్ కు ఆర్థిక సాయం చేస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని తెలిపారు. తమ రాష్ట్ర అభివృద్ధికి ఎంత డబ్బు కావాలన్నా కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ అందజేస్తామని హామీ ఇచ్చారని మాంఝీ చెప్పారు.
కాగా కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి జేడీయూ నాయకులు బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఆ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి విజయ్ కుమార్ చౌదరి, భవన నిర్మాణ శాఖ మంత్రి అశోక్ చౌదరి తమ డిమాండ్లపై గళం విప్పారు.
ఇలాగే ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక హోదా విషయంలో అధికార టీడీపీ, జనసేనను వైసీపీ ఇరుకునపెడుతోంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదాను సా«ధించాలని డిమాండ్ చేస్తోంది. కేంద్రంలో బీజేపీకి ప్రాంతీయ పార్టీల మద్దతు అవసరమైందని.. టీడీపీ, జనసేనలు కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించాయని వైసీపీ గుర్తు చేస్తోంది. కాబట్టి ప్రత్యేక హోదా సాధించాలని డిమాండ్ వినిపిస్తోంది.
ఇప్పుడు బీహార్ లో సైతం లాలూప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్ కూడా ఇదే డిమాండ్ వినిపిస్తోంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ కూడా మద్దతు ఇస్తున్న నేపథ్యంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావాలని విపక్ష నేత తేజశ్వీ యాదవ్ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర కేబినెట్ మంత్రి జితన్ రామ్ మాంఝీ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.