ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర.. అదే జరిగితే యుద్ధమే: బైడెన్
ఇరాన్ అంటే అమెరికాకు మొదటినుంచీ మంట.. ఎందుకో గానీ ఇరాన్ ఉనికినే సహించనంతగా ఉంటుంది అమెరికా ధోరణి.
By: Tupaki Desk | 15 Oct 2024 9:14 AMఇరాన్ అంటే అమెరికాకు మొదటినుంచీ మంట.. ఎందుకో గానీ ఇరాన్ ఉనికినే సహించనంతగా ఉంటుంది అమెరికా ధోరణి. ఇరాన్ పొరుగునే ఉన్న ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ ను పదవి నుంచి దించేసి అతడిని వేటాడి వెంటాడి మరీ చంపిన చరిత్ర అమెరికాది. కానీ, ఇరాన్ మాత్రం ఏమీ చేయలేకపోతోంది. ఇరాన్ ఆర్థికంగా బలమైనదే కాక.. అణు సామర్థ్యం ఉన్న దేశం కావడమే దీనికి కారణమేమో? అయితే, ఇప్పుడు ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ఇరాన్ వైపు మళ్లింది. తమ దేశంలో అతిథిగా ఉన్న హమాస్ అగ్ర నేతను హతమార్చడం, తమ పెంపుడు సంస్థ అయిన హెజ్బొల్లా అధినేతను నిర్మూలించడం ఇరాన్ కు కంటగింపుగా మారింది. దీంతోనే ఇజ్రాయెల్ కొద్ది రోజుల కిందట 200 క్షిపణులను ప్రయోగించింది. ఇక వీటి మధ్యలోనే అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం రిపబ్లికన్ల అభ్యర్థిగా పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ హత్యకూ ప్లాన్ వేస్తోందని కథనాలు వస్తున్నయి.
అధ్యక్షుడు ఎవరైనా అమెరికా అంతే..
అధ్యక్ష పీఠంపై ఎవరున్నా ఇరాన్ విషయంలో అమెరికా ధోరణి ఒకటే. ఇరాన్ ను ధూర్త (రోగ్ కంట్రీ) దేశంగా కొన్ని దశాబ్దాల కిందటే పేర్కొంది అమెరికా. మళ్లీ ఇప్పుడు ఇరాన్ తో సంఘర్షణకు దిగుతోంది. అయితే, ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ పై ఇప్పటికే మూడు హత్యయత్నాలు జరిగాయి. వాస్తవానికి జూలైలో జరిగిన మొదటి హత్యాయత్నంమే వీటిలో సీరియస్. బుల్లెట్ ట్రంప్ చెవి పక్కనుంచి దూసుకెళ్లింది. రెండో ఘటనలో అనుమానితుడిని ముందుగానే అరెస్టు చేశారు. మూడో ఘటన అంత తీవ్రమేమీ కాదు. కాకపోతే ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర పన్నుంతోందనే కథనాలు వస్తున్నాయి.
అదే జరిగితే రెచ్చగొట్టినట్లే..
ట్రంప్ పై కుట్రలకు పాల్పడిడే అది అమెరికాను యుద్ధానికి రెచ్చగొట్టే కార్యక్రమంగా పరిగణిస్తామని అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రభుత్వం ఇరాన్ ను హెచ్చరించింది. ట్రంప్ ఇరాన్ హిట్ లిస్ట్ లో ఉండడంతో ఈ మేరకు తీవ్రంగా హెచ్చరించింది. ట్రంప్ నకు వ్యతిరేకంగా ఏ కుట్ర యత్నం చేసినా దాన్ని యుద్ధాన్ని ప్రేరేపించేదిగానే భావిస్తామని అమెరికా అధికారి స్పష్టం చేశారు. గమనార్హం ఏమంటే.. ట్రంప్ తో గత ఎన్నికల్లో ప్రత్యర్థిగా తలపడి గెలిచిన, ఈ ఎన్నికల్లో పోటీ నుంచి మధ్యలో తప్పుకొన్న అధ్యక్షుడు బైడెన్ తన ప్రత్యర్థి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఎప్పటికప్పుడు తాజా సమాచారం తెలుసుకోవడంతో పాటు.. తగిన చర్యలకు బృందాలను ఆదేశిస్తున్నారట. ఈ మేరకు ఇరాన్ కుట్రలపై దృష్టిపెట్టాలని సూచించినట్లు సమాచారం.
ఇరాన్ ఉన్నతాధికారులకే సూచన
బైడెన్ యంత్రాంగం ఏకంగా ఇరాన్ ఉన్నతస్థాయి అధికారులకు తమ సందేశాన్ని పంపినట్లు సమాచారం. ఇది బైడెన్ సూచనల మేరకు జరిగిందని చెబుతున్నారు. అందులోని సారాంశం ఏమంటే.. ట్రంప్ హత్యాయత్నానికి కుట్రలు చేయడాన్ని తక్షణమే ఆపివేయాలని కోరడం. అలా కాకుండా ఏ హత్యాయత్నమైనా జరిగితే దానిని యుద్ధాన్ని ప్రేరేపించేదిగా భావిస్తామని కుండబద్దలు కొట్టారు. అయితే, తాము అమెరికా జోలికి రామని ఇరాన్ స్పష్టంచేసింది. కానీ, అమెరికా కొన్ని దశాబ్దాలుగా తమ విషయాల్ల కలగచేసుకుంటున్నదని ఆరోపించింది. దీనికి ఉదాహరణగా.. 1953 నాటి తిరుగుబాటు, 2020లో ఖాసీం సులేమానీ హత్యలను ప్రస్తావించింది. నాడు అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ స్వయంగా ఖాసీం సులేమానీ హత్యకు ఆదేశించినట్లు కథనాలు వచ్చాయి.
ట్రంప్ టీమ్ ప్రకటన ఇదే..
ఎన్నికల ప్రచారంలో ఉన్న ట్రంప్ బృందం గత నెలలో ఓ ప్రకటన చేసింది. తమ దేశంలో అస్థిరత, గందరగోళం సృష్టించాలని ఇరాన్ ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించింది. ట్రంప్‌నకు ముప్పు ఉందని నిఘా కార్యాలయం హెచ్చరించింది అని పేర్కొంది. ఇరాన్ బెదిరింపులు బాగా పెరిగిపోయాయని అధికారులు గుర్తించినట్లు తెలిపింది. కాగా తనను ఉద్దేశించి వస్తున్న హెచ్చరికలపై ట్రంప్ ట్వీట్ చేశారు. ‘నా హత్యకు ఇరాన్ చాలా ప్రయత్నాలు చేసింది. అవి ఫలించలేదు. మళ్లీ ప్రయత్నిస్తోంది’ అని వ్యాఖ్యానించారు.