పదవి దిగే వేళలో బైడెన్ సంచలనం.. ఆ కేసులో కొడుక్కి క్షమాభిక్ష!
మరికొద్ది రోజుల్లో అధ్యక్ష పీఠం నుంచి దిగనున్న బైడెన్ ఈ తరహా నిర్ణయాన్ని ప్రకటించటం ఇప్పుడు సంచలనంగా మారింది.
By: Tupaki Desk | 2 Dec 2024 4:20 AM GMTఅమెరికా లాంటి దేశంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. తప్పు చేసిన వారు ఎంతటి ఉన్నత పదవుల్లో ఉన్నప్పటికి వారు చట్టం నుంచి తప్పించుకోవటం చాలా కష్టంగా ఉంటుంది. అలాంటిది సీరియస్ నేరారోపణలు ఎదుర్కొంటున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ కు కేసుల నుంచి క్షమాభిక్ష ప్రకటిస్తూ అధ్యక్ష హోదాలో జో బైడెన్ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. మరికొద్ది రోజుల్లో అధ్యక్ష పీఠం నుంచి దిగనున్న బైడెన్ ఈ తరహా నిర్ణయాన్ని ప్రకటించటం ఇప్పుడు సంచలనంగా మారింది.
అక్రమంగా ఆయుధం కొనుగోలుతో పాటు మరో రెండు క్రిమినల్ కేసుల్లో హంటర్ కు క్షమాభిక్ష ప్రసాదిస్తూ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్య చేశారు. తన కొడుకు మీద కేసులు రాజకీయ ప్రేరేపితమైనవన్న బైడెన్.. తాను తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా ప్రజలు అర్థం చేసుకుంటారని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇంతకూ హంటర్ మీద ఉన్న ఆరోపణలు ఏమిటి? అవి రుజువయ్యాయా? లాంటి అంశాల్లోకి వెళితే.. 2018లో బైడెన్ కుమారుడు హంటర్.. గన్ కొనుగోలు చేశారు. అయితే.. ఆయుధ డీలర్ కు ఇచ్చిన అప్లికేషన్ లో తన వివరాలను తప్పుగా ఇచ్చారు. అనంతరం ఈ వ్యవహారం వెలుగు చూసింది. అతడిపై డ్రగ్స్ కొనుగోలు చేసిన ఆరోపణలు ఉన్నాయి. అయితే.. తాను డ్రగ్స్ కొనుగోలు చేయలేదని.. మాదకద్రవ్యాలకు తాను బానిస కాలేదని.. తాను అక్రమంగా ఆయుధాన్ని కొనుగోలు చేయలేదని పేర్కొన్నారు. వీటితో పాటు కాలిఫోర్నియాలో 1.4 మిలియన్ డాలర్ల పన్ను ఎగవేత ఆరోపణలు అతడిపై ఉన్నాయి. ఈ కేసులకు సంబంధించి అతడు తప్పు చేసినట్లుగా రుజువైంది.
అక్రమ ఆయుధ కొనుగోలు ఇష్యూలో అతడిపై నమోదైన కేసులో కోర్టు అతడ్ని దోషిగా తేల్చింది. అయితే.. శిక్ష ఖరారు చేయలేదు. ఈ సందర్భంగా జో బైడెన్ స్పందిస్తూ తాను కోర్టు తీర్పును అంగీకరిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కేసులో తాను కొడుకు తరఫున క్షమాభిక్ష కోరనని అప్పట్లో పేర్కొన్నారు. అలాంటి బైడెన్ తాజాగా కొడుక్కి క్షమాభిక్షను ప్రసాదిస్తూ ప్రకటన చేయటం షాకింగ్ గా మారింది.
తాజాగా చేసిన ప్రకటనలో అమెరికా ప్రజలను ఉద్దేశిస్తూ ఆయన పలు అంశాల్ని పేర్కొన్నారు. తాను నిజాన్ని చెప్పాలని.. తన జీవితం మొత్తంలో తాను నిజాన్ని చెప్పే సూత్రాన్ని పాటిస్తున్ననని పేర్కొన్నారు. ‘న్యాయశాఖ తీసుకునే నిర్ణయాల్లో జోక్యం చేసుకోనని అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తొలిరోజే చెప్పా. ఆ మాటకు కట్టుబడి ఉన్నా. నా కొడుకు హంటర్ ను అన్యాయంగా విచారించే వేళలోనూ నేను చూస్తూ ఉండిపోయాను. రాజకీయ కుట్రలో భాగంగానే అతడిపై కేసులు పెట్టారు. జరిగింది ఏమైనా.. అతడి మీద ఉన్న కేసుల్లో అతడికి క్షమాభిక్ష ప్రసాదించాలని నిర్ణయించుకున్నా. ఒక తండ్రిగా.. దేశాధ్యక్షుడిగా నేను తీసుకున్న నిర్ణయాన్ని దేశ ప్రజలు అర్థం చేసుకుంటారని భావిస్తున్నా’’ అని పేర్కొన్నారు. తాజా నిర్ణయంతో జోబైడెన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉందని.. పదవి దిగే వేళలో ఆయన తీసుకున్న నిర్ణయం.. అమెరికా చరిత్రలో అలా నిలిచిపోతుందని చెప్పక తప్పదు.