జో లాలీ.. జో జాలీ.. ఆ అధ్యక్షుడు.. 532 రోజులు పడక సీనే
అమెరికా అధ్యక్షుడు బైడెన్ వైట్ హౌస్ నుంచి కాలు బయట పెట్టారంటే బీచ్ లకు వెళ్తుంటారు.
By: Tupaki Desk | 8 Sep 2024 10:30 PM GMTఅమెరికా చరిత్రలో బలహీన అధ్యక్షుడిగా.. అధ్యక్ష అభ్యర్థిగా ప్రకటితమైన తర్వాత కూడా తప్పుకొన్న అతికొద్ది మందిలో ఒకడైన నాయకుడిగా.. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి పుంజుకొనే అవకాశం ఇచ్చిన అభ్యర్థిగా.. ఇలా ఎన్నో చెత్త రికార్డులు సొంతం చేసుకున్నారు ఆయన. అమెరికాకు అత్యంత పెద్ద వయసులో అధ్యక్షుడైన ఆయన.. మరోసారి పోటీకి నిలవడమే ఆశ్చర్యం అంటే.. ఈ నాలుగేళ్లు ఆయన చేసినది ఇంకా ఏమీ లేదని తెలిసి నోరెళ్లబెట్టాల్సి వస్తోంది.
బీచ్ లంటే పొలోమంటూ..
అమెరికా అధ్యక్షుడు బైడెన్ వైట్ హౌస్ నుంచి కాలు బయట పెట్టారంటే బీచ్ లకు వెళ్తుంటారు. గత వారం ఆయన కుటుంబంతో కలిసి డెలావేర్ రెహోబోత్ బీచ్ కు వెళ్లారు. అక్కడే రెండు గంటలు ఉన్నారు. ఆయన భార్య జిల్.. కొన్ని కాగితాలు అందిస్తూ కనిపించారు. మధ్యలో కొందరు టూరిస్టులు బైడెన్ కు హాయ్ చెప్పి వెళ్లారు. ఓవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం హొరున సాగుతుంటే.. మరోవైపు బైడెన్ తనకేమీ పట్టనట్లు బీచ్ ఒడ్డున సేదదీరుతుండడంపై విమర్శలు వచ్చాయి. కాగా, బైడెన్ ఇప్పుడే కాదు.. తరచూ ఇలా వెకేషన్ కు వెళ్తుంటారు
దాదాపు సగం రోజులు సెలవులోనే
బైడెన్ 2021 జనవరిలో అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. వచ్చే జనవరి వరకు ఆయన పదవిలో కొనసాగనున్నారు. అయితే, ఈ కాలంలో ఇప్పటివరకు 532 రోజుల పాటు ఆయన వెకేషన్ లో గడిపోయారు. దీనిని రిపబ్లికన్ నేషనల్ కమిటీ తాజా విశ్లేషణలో పేర్కొంది. నాలుగేళ్ల పదవీ కాలంలో బైడెన్ దగ్గరదగ్గరగా 40 శాతం సెలవుల్లోనే గడిపేశారన్నమాట. ఇక 81 ఏళ్ల బైడెన్ వయోభారంతో అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచి వైదొలగారు. అంతకుముందు ఆయన మతిమరపు బాగా చర్చనీయాంశం అయింది. జి 7 దేశాల సదస్సు సందర్భంగా మిగతా దేశాధినేతలందరూ ఒకవైపు ఉంటే.. బైడెన్ ఎటువైపో చూడడం వైరల్ అయింది. స్టేజీ మీద ఓ మహిళను ఆలింగనం చేసుకోవడం కూడా నవ్వుల పాల్జేసింది.
మంచి కంటే చెడ్డ పేరే ఎక్కువ
అమెరికాకు బైడెన్ ఉపాధ్యక్షుడిగానూ పనిచేశారు. దీంతో ఆయన అధ్యక్షుడిగా మరింత రాణిస్తారని భావించారు. అయితే, ఈ మేరకు అంచనాలను అందుకోలేకపోయారు. ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర బైడెన్ హయాంలోనే జరిగాయి. దీనినే ట్రంప్ ఇప్పుడు తన ప్రచారంలో వాడుకుంటున్నారు. తాను గనుక అమెరికాకు అధ్యక్షుడిగా ఉండి ఉంటే ఉక్రెయిన్ పై రష్యాను యుద్ధం చేయకుండా ఆపేవాడినని అంటున్నారు. ఇక దేశం ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించుకోకుండా బైడెన్ తరచూ సెలవులు పెట్టేస్తారనే ఆరోపణలు ఉన్నాయి. ద్రవ్యోల్బణం, సరిహద్దు భద్రత, అంతర్జాతీయ వైరుధ్యాలను పరిష్కరించడంలో బైడెన్ విఫలమయ్యారనేది చాలామంది వాదన. కాగా, ట్రంప్ 2016-20 మధ్య 26 శాతం, రోనాల్డ్ రీగన్, బరాక్ ఒబామా 11 శాతం రోజులు వెకేషన్ లో గడిపారు. జిమ్మీ కార్టర్ మాత్రం 79 రోజులే విరామం తీసుకున్నారు.