Begin typing your search above and press return to search.

జో బిడెన్ కాన్వాయ్ ని ఢీకొట్టిన కారు... యూఎస్ లో కలకలం!

ప్రపంచ దేశాల్లో అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన వ్యక్తిగా అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిని చెబుతారు.

By:  Tupaki Desk   |   18 Dec 2023 7:16 AM GMT
జో బిడెన్  కాన్వాయ్  ని ఢీకొట్టిన కారు... యూఎస్  లో కలకలం!
X

ప్రపంచ దేశాల్లో అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన వ్యక్తిగా అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిని చెబుతారు. ఈయన భద్రత కోసం యూఎస్‌ సీక్రెట్‌ సర్వీస్‌ తీసుకునే జాగ్రత్తలు అత్యంత కట్టుదిట్టంగా ఉంటాయి. ఇక ఆ కాన్వాయ్ గురించి అయితే చెప్పే పనేలేదు. ఇదే సమయంలో విదేశీ పర్యటనల సందర్భంలో అయితే ఇది డబుల్ ఉంటుంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ కాన్వాయ్ లో కలకలం జరిగింది.

అవును... అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడి కాన్వాయ్ లో భద్రతా వైఫల్య ఘటన కలకలం రేపింది. అధ్యక్షుడు జో బిడెన్ కాన్వాయ్‌ లోని ఒక వాహనాన్ని ఓ ప్రైవేటు కారు ఢీకొట్టింది. పైగా ఆ వాహనం ఢీకొన్న 130 అడుగుల దూరంలోనే బిడెన్ ప్రయాణించే కారు ఉండటం గమనార్హం. దీంతో అమెరికాలో ఒక్కసారిగా కలకలం రేగింది.

వివరాళ్లోకి వెళ్తే.. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వైట్ హౌస్ తెలిపిన వివరాల ప్రకారం.. అధ్యక్షుడు జో బిడెన్, ఆయన సతీమణి జిల్‌ తో కలిసి ఆదివారం రాత్రి డెలావర్‌ లోని తమ పార్టీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ డిన్నర్‌ ముగించుకుని బిడెన్ దంపతులు ఆఫీసు బయట ఉన్న కాన్వాయ్‌ వద్దకు వస్తుండగా.. ఓ కారు వేగంగా దూసుకొచ్చింది.

అదేవేగంతో యునైటెడ్ స్టేట్స్ సీక్రెట్‌ సర్వీస్‌ వాహనాన్ని ఢీకొంది. అనంతరం మరో వాహనంపైకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించింది. ఆ సమయంలో జిల్‌ అధ్యక్ష వాహనంలో కూర్చుని ఉండగా.. జో బిడెన్ తాను ప్రయాణించాల్సిన వాహనానికి సమీపంలోనే ఉన్నారు. దీంతో వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది.. అధ్యక్షుడిని వేగంగా వాహనంలోకి తీసుకెళ్లారు.

ఈ ఘటన నేపథ్యంలో బిడెన్ దంపతులను వెంటనే వైట్‌ హౌస్‌ కు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. ఇదే సమయంలో బిడెన్ దంపతులు క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. ఈ విషయాలను సీక్రెట్ సర్వీస్ ప్రతినిధి స్పెషల్ ఏజెంట్ స్టీవ్ కోపెక్ వెల్లడించారు. ఇదే సమయంలో ఘటనకు పాల్పడిన వాహనాన్ని యూఎస్ సీక్రెట్‌ సర్వీస్‌ సిబ్బంది చుట్టుముట్టారు. అనంతరం సదరు డ్రైవర్‌ ను అదుపులోకి తీసుకున్నారు.