పరువా-పదవా... బైడెన్‌కు చిక్కుముడి!
ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్‌ను మరోసారి కూడా ప్రతిపాదించిన నాయకులు.. పార్టీ కీలక నేతలు సైతం.. ''వద్దు ప్రభూ'' అంటూ.. బైబై చెప్పేందుకు సిద్ధమయ్యారు.
By: Tupaki Desk | 20 July 2024 4:47 AM GMTఅది 2020. అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు సమారంభం ప్రారంభమైంది. డెమొక్రాట్లు కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలోనే అధ్యక్ష అభ్యర్థి ఎవరనేది నిర్ణయించాల్సి ఉంది. దాదా పు అనుకున్న నాయకులు.. చట్టసభల సభ్యులు.. ఆహ్వానితులు అందరూ వచ్చేశారు. కానీ, ఓ కుర్చీ ఖాళీ గా ఉంది. ఆయన కోసమే అందరూ వేచి ఉన్నారు. ఎట్టకేలకు 22 నిమిషాల ఆలస్యంగా ఆయన అక్కడకు చేరుకున్నారు. అంతే! అందరూ ముక్తకంఠంతో ఆయననే అధ్యక్ష రేసులో నిలపాలని నిర్ణయించి.. అక్కడికక్కడే అభినందనలతో ముంచెత్తారు. ఆ నాయకుడే... ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్.
ఇప్పుడు నాలుగేళ్లు గడిచిపోయాయి. ఈ నవంబరులో మరోసారి అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే.. ఇప్పుడు కూడా అనేక సమావేశాలు జరుగుతున్నాయి. కానీ.. నిన్న మొన్నటి వరకు సమర్థించిన గళాలు.. ఇప్పుడు మారుతున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్‌ను మరోసారి కూడా ప్రతిపాదించిన నాయకులు.. పార్టీ కీలక నేతలు సైతం.. ''వద్దు ప్రభూ'' అంటూ.. బైబై చెప్పేందుకు సిద్ధమయ్యారు. కానీ.. 2020లో అధ్యక్ష రేసులో పాల్గొనేందుకు తటపటాయించిన.. అదే బైడెన్ ఇప్పుడు మాత్రం ఆ సీటును వదులుకునేందుకు సిద్ధంగా లేనని చెబుతున్నారు.
''నేను ఖచ్చితంగా పోటీలో ఉంటాను. ట్రంప్(రిపబ్లికన్ అభ్యర్థి.. మాజీ ప్రెసిడెంట్)ను మట్టికరిపించి తీరు తాను'' అనే బైడెన్ సెలవిస్తున్నారు. కానీ, డెమొక్రట్లు మాత్రం బైడెన్ అభ్యర్థిత్వాన్ని ససేమిరా అంటూ.. మరో సారి తీర్మానం చేసే పరిస్థితి వచ్చింది. అయితే.. ఇంతగా ఆయనను 2020లో కావాలను కున్నవారే.. వద్దుకునే పరిస్థితికి రావడం.. అనారోగ్య సమస్యలు.. మాత్రమే కాదు. నిరుద్యోగం, వలస విధానం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై బైడెన్ అనుసరిస్తున్న విధానాలను మెజారిటీ అమెరికన్లు వ్యతిరేకిస్తున్నారు.
వీటికితోడు.. బైడెన్ మతిమరుపు.. అనాలోచిత చర్యలు వంటివి కూడా.. కలిసివచ్చాయి. ఫలితంగా ఇప్పుడు ఆయనను వద్దనే గళాలు పెరిగిపోయాయి. వారం కిందట 15 మంది డెమొక్రాట్లు వ్యతిరేకిస్తే.. ఇప్పుడు ఈ సంఖ్య నాలుగు రెట్లు పెరిగిపోయింది. ఏకంగా తీర్మానం చేసే పరిస్థితి వచ్చేసింది. మరి దీనిని బైడెన్ ఎలా తీసుకుంటారు? పదవి కోసం .. పాకులాడితే.. పార్టీ తీర్మానం చేసిన తర్వాత.. ఆయన పరువు పోతుంది. దేశ చరిత్రలోనే ఇది ఒక అధ్యాయంగా మిగిలిపోతుంది. అలా కాకుండా.. తనంతట తనే తప్పుకొంటే.. ఎలానూ వచ్చే పరిస్థితి లేని పదవి పోయినా.. పరువు మిగులుతుంది. మరి ఏం చేస్తారో చూసేందుకు.. ప్రపంచం యావత్తు ఆసక్తిగా ఉంది.