Begin typing your search above and press return to search.

బైబై బైడెన్.. కమాన్ కమల.. అమెరికాలో చరిత్రలో ఎరుగని పరిణామం?

ఆదివారం నాటి సమావేశాన్ని ప్రతినిధుల సభలోని మైనారిటీ నేత హకీం జెఫరీస్‌ నిర్వహించారు.

By:  Tupaki Desk   |   8 July 2024 8:25 AM GMT
బైబై బైడెన్.. కమాన్ కమల.. అమెరికాలో చరిత్రలో ఎరుగని పరిణామం?
X

అగ్ర రాజ్యం అమెరికా ఎన్నికల్లో బహుశా ఇటీవలి కాలంలో ఎన్నడూ చూడని సందర్భం రానుందా..? ఇప్పటికీ పోలింగ్ కు బ్యాలెట్ నే వాడుతూ వస్తున్న అమెరికాలో అనూహ్య పరిణామం చోటుచేసుకునుందా..? అది కూడా అధికార డెమోక్రటిక్ పార్టీలోనే జరగనుందా..? ఒకదాని వెనుక ఒకటి పరిణామాలను చూస్తుంటే ఇదే నిజం అనిపిస్తోంది. ఇద్దరు వయోధిక నేతలు పోటీ పడుతున్న దేశంలో ఒకరు ముందే తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే, ఇక్కడ అనూహ్యంగా అవకాశం భారతీయురాలికి దక్కుతుందనే అభిప్రాయం వినిపిస్తోంది.

సంవాదంలో వెనుకబడి..

రిపబ్లికన్ పార్టీ తరఫున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అధ్యక్షుడు బైడెన్ మరోసారి పోటీ పడడంతో అమెరికా ఎన్నికలు అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంన్నాయి ఇద్దరూ 75 ఏళ్లు దాటిన నేతలు కావడమే దీనికి కారణం. అయితే, బైడెన్ పూర్తిగా వెనుకబడ్డారన్న అభిప్రాయాలు వస్తున్నాయి. అత్యంత కీలకమైన డిబేట్ లో బైడెన్‌ తడబడ్డారు. దీంతోనే ఆయన అభ్యర్థిత్వంపై నీలినీడలు కమ్ముకున్నాయి. అందుకనే.. ఏదో ఒకటి తేల్చేందుకు డెమోక్రాట్లు కీలక నేతలు ఆదివారం సమావేశమయ్యారు. ప్రతినిధుల సభలో మళ్లీ మెజారిటీ సాధించాలంటే బైడెన్‌ ను తప్పించాలని కీలక నేతలు అభిప్రాయపడ్డట్లు, బైడెన్ గనుక పోటీలో ఉంటే గెలుపు కష్టమేనని అంచనాకు వచ్చినట్ల తెలిసింది. కాగా, ట్రంప్‌ నుంచి దేశాన్ని రక్షించాలంటే బైడెన్ కాకుండా బలమైన నేతను బరిలో నిలపాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డట్లు చెబుతున్నారు.

2 గంటల సుదీర్ఘ భేటీ..

ఆదివారం నాటి సమావేశాన్ని ప్రతినిధుల సభలోని మైనారిటీ నేత హకీం జెఫరీస్‌ నిర్వహించారు. ఇందులో చాలామంది బైడెన్‌ తప్పుకోవాలనే అభిప్రాయపడ్డట్లు సమాచారం. మద్దతుగా కొంతమంది నిలిచినా వారి సంఖ్య అతి స్వల్పంగా ఉన్నట్లు సమాచారం. చాలా మంది బైడెన్‌ నిష్క్రమణకే మొగ్గు చూపారు. కాగా, బైడెన్‌ ను తప్పిస్తే.. ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ను బరిలో నిలపాలని డెమోక్రాట్లు యోచిస్తున్నారట. ట్రంప్ ను ఓడించే శక్తి కమలాకు ఉందని నమ్ముతున్నట్లు తెలిసింది. ఈ మేరకు అంతర్గతంగా చర్చలు కూడా జరుగుతున్నట్లు సమాచారం.

రేపు తేలిపోతుంది..

బైడెన్ అభ్యర్థిత్వంపై మంగళవారం ఏదో ఒకటి తేలిపోనుంది. కాకస్‌ సమావేశం జరగనుండడమే దీనికి కారణం. బైడెన్‌కు ఉన్న అనుభవం, ప్రతిష్ఠను బట్టి.. బరి నుంచి దూరం జరిగే ప్రక్రియ సజావుగా సాగాలని పార్టీ నేతలు కోరుకుంటున్నారు. కానీ, బైడెన్ ఏమో ఎన్నికల ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు. తానే అభ్యర్థిని అని ఢంకా బజాయిస్తున్నారు. డెమోక్రాట్లంతా తన వెంటనే ఉన్నట్లు చెబుతున్నారు.

పోటీలో ఉండాలా? లేదా? కొన్ని రోజుల్లో చెబుతారని బైడెన్ కు అత్యంత సన్నిహితుడు, హవాయి గవర్నర్‌ జోష్‌ గ్రీన్‌ శనివారమే ప్రకటన చేశారు. అంతకుముందు ఆయన బైడెన్‌ డెమోక్రాటిక్‌ పార్టీ గవర్నర్లతో సమావేశమయ్యారు. బైడెన్‌ వైదొలగితే.. ఆ స్థానంలో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ను గ్రీన్ ప్రతిపాదించే అవకాశం ఉంది.