రిపబ్లికన్లు వద్దన్న ట్రంప్.. బైడెన్ కావాలన్న డెమోక్రాట్లు.. ఎప్పుడైనా ఇలాగైందా?
అమెరికా అధ్యక్షుడిగా ఉన్న జో బైడెన్ మరోసారి ఎన్నికల బరిలో దిగానులకోవడమే ఆశ్చర్యకరం.
By: Tupaki Desk | 22 July 2024 12:30 PM GMTఅమెరికా చరిత్రలోనే ఎప్పుడూ ఇలా జరగలేదేమో..? అధ్యక్ష అభ్యర్థిగా ప్రకటితమైన అధ్యక్షుడు ఎన్నికల రంగం నుంచి తప్పుకోవడాన్ని ఇటీవల ఎప్పుడూ చూసి ఉండమేమో..? అసలు గతంలో ఎప్పుడైనా ఇలాంటి సందర్భంగా ఎదురైందా? అనేది కూడా అనుమానమే. మరోవైపు అధ్యక్ష అభ్యర్థిగా ఉన్న మాజీ అధ్యక్షుడిపై కాల్పులు జరగడమూ ఇటీవలి కాలంలో ఎప్పుడూ చూడలేదు. మరి దీనికిముందు కూడా తెరవెనుక పెద్ద డ్రామానే నడిచిందట.
ఇప్పుడు అంతా తారుమారు
అమెరికా అధ్యక్షుడిగా ఉన్న జో బైడెన్ మరోసారి ఎన్నికల బరిలో దిగానులకోవడమే ఆశ్చర్యకరం. ఆయనకు ఇప్పటికే 81 ఏళ్లు. అనారోగ్య సమస్యలు ఉన్నాయి. అయినా, పదవిపై మోజుతోనో, ప్రజా సేవ పట్ల అంకితభావంతోనో మరోసారి కదనంలోకి దిగారు. కానీ.. చుట్టూ ఎన్నో వివాదాలు. ఎన్నో విమర్శలు. ఎప్పుడో శక్తి హీనం అయిన కొవిడ్ బారిన పడ్డారంటేనే బైడెన్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలుస్తోంది. కాగా, ఇంతటి ఇబ్బందిని ఊహించారో లేదో కానీ.. అసలు బైడెన్ ను ఆయన పార్టీ నేతలైన డెమోక్రాట్లు పట్టుబట్టి అధ్యక్ష ఎన్నికల బరిలో దించారంటే నమ్మాల్సిందే. కానీ, ఇప్పుడదే డెమోక్రాట్లు బైబై బైడెన్ అంటూ పట్టుబట్టి మరీ సాగనంపారు. ఎన్నికల్లో ప్రతికూలతను గమనించి మాజీ అధ్యక్షుడు ఒబామా వంటి వారు సైతం బైడెన్ పోటీ పట్ల వ్యతిరేకత వ్యక్తం చేశారు. ప్రతినిధుల సభ మాజీ స్పీకర్ అయిన నాన్సీ పెలోసీ అయితే నేరుగానే విమర్శలకు దిగారు. చివరకు అంతా అనుకున్నట్లే.. ఆదివారం బైడెన్ బైబై చెప్పేశారు.
అమ్మో ట్రంప్ నా..?
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎలాంటివారో అందరికీ తెలిసిందే. దూకుడైన ఆయన తీరు పట్ల సొంత పార్టీ రిపబ్లికన్ లోనే మొదట్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ట్రంప్ వస్తే తమకు ఇబ్బంది అని వారంతా భావించారు. దీంతో మూకుమ్మడిగా ఆయన అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు. కానీ, ట్రంప్ ఎలాగోలా పంతం నెగ్గించుకున్నారు. అయితే, ఎన్నికల రేసు ముందుకు సాగేకొద్దీ ట్రంప్ పట్ల వారి వైఖరి మారిపోయింది. ఇప్పుడు రిపబ్లికన్లు అందరూ.. ట్రంప్.. ట్రంప్.. అంటూ హోరెత్తిస్తున్నారు. ఇదంతా చూసిన విశ్లేషకులు ఎంతలో ఎంత మార్పు? అని ఆశ్చర్యపోతున్నారు.
కొసమెరుపు: బైడెన్ తప్పుకొన్నారు సరే.. ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ అధ్యక్ష అభ్యర్థిత్వం సంగతేమిటి? అనేది ప్రశ్న. ఇప్పటికే ఆమె గనుక ప్రత్యర్థి అయితే తన గెలుపు సులువని ట్రంప్ వ్యాఖ్యానించారు. అంతేగాక అమెరికన్ సమాజంలో మహిళను అధ్యక్షురాలిగా ఎన్నుకోవడం అనేది దుర్లభం అని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూద్దాం?