Begin typing your search above and press return to search.

అనుకున్నదే జరిగింది.. డ్యామేజ్ జరిగాక తప్పుకున్న బైడెన్

చివరకు ఏదోలా పోరాడిన ఆయన.. తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్నికల రేసు నుంచి తప్పుకోవాల్సిన దుస్థితి ఎదురైంది.

By:  Tupaki Desk   |   22 July 2024 4:36 AM GMT
అనుకున్నదే జరిగింది.. డ్యామేజ్ జరిగాక తప్పుకున్న బైడెన్
X

అధికారానికి మించిన వ్యామోహం ఇంకొకటి ఉండదు. ఎంత నీతులు చెప్పే వారైనా సరే.. అధికారం ఒకసారి చేతికి వచ్చిన తర్వాత దాన్ని వదిలేందుకు సుతారం ఇష్టపడరు. మరికొన్నిరోజులు.. ఇంకో అవకాశం.. ఇలా ఏదో ఒక మాట చెప్పి.. సదరు అధికారం తన చేతిలోనే ఉండిపోవాలని తపిస్తుంటారు. అధికారాన్ని ఒంటికి వేసుకునే చొక్కా మాదిరి భావించేటోళ్లు వేళ్ల మీద లెక్కించేంతగా మాత్రమే ఉంటారు. ముదిమి వయసులో అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టి.. ఆరోగ్యం సహకరించకపోయినా.. కవర్ చేస్తూ పాలన సాగిస్తున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. రెండోసారి అధ్యక్ష పదవి రేసులోకి రావటం తెలిసిందే. నిజానికి ఆయన రేసులోకి రాకుండా కొత్త వారికి అవకాశం ఇచ్చి ఉంటే గౌరవంగా ఉండటమే కాదు.. ఆయనపై ప్రశంసలు వెల్లువెత్తేవి. కానీ.. అలా చేస్తే ఆయన బైడెన్ ఎందుకు అవుతారు?

చివరకు ఏదోలా పోరాడిన ఆయన.. తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్నికల రేసు నుంచి తప్పుకోవాల్సిన దుస్థితి ఎదురైంది. పార్టీకి.. ఆయనకు జరగాల్సినంత డ్యామేజీ జరిగిపోయిన తర్వాత కానీ ఎన్నికల రేసు నుంచి తాను తప్పుకుంటున్నట్లుగా ప్రకటన చేశారు. మొత్తంగా చూస్తే.. తనపై పార్టీలో వచ్చిన తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో రేసు నుంచి తప్పుకోక తప్పలేదు. ట్రంప్ తో జరిగిన చర్చలో ఘోర వైఫల్యం ఆయనకు భారీ ఎదురుదెబ్బగా చెప్పాలి. ఆ రోజైనా.. తన పరిస్థితిని తాను అర్థం చేసుకొని ఉంటే బైడెన్ కు ఈ రోజు ఇంతటి అవమానం తప్పేది.

తాను అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకున్న విషయాన్ని పేర్కొంటూ ఒక లేఖ రాశారు బైడెన్. దీంతో డెమొక్రాట్లకు ఒకవైపు ఆనందం.. మరోవైపు అమోయం నెలకొంది.దీనికి కారణం అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇంకా నాలుగు నెలలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పుడు అధ్యక్ష రేసులోకి ఎవరు వస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.బైడెన్ మాత్రం.. తన వారసురాలిగా ఉపాధ్క్ష్యక్ష పదవిలో ఉన్న భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ పేరును ప్రతిపాదించారు. అంతేకాదు.. సోషల్ మీడియాలోనూ ఆమెకు తన మద్దతు ఉంటుందన్న విషయాన్ని తెలియజేసేలా పోస్టు పెట్టారు.

తన పూర్తి మద్దతును హారిస్ కు ఇస్తున్నట్లు చెప్పిన బైడెన్.. ‘‘ఆమె అభ్యర్థిత్వాన్ని ఆమోదిస్తున్నా. డెమొక్రాట్లు ఐక్యంగా ట్రంప్ ను ఓడించండి’’ అని పేర్కొన్నారు. డెమొక్రాట్లలో ఎక్కువ మంది హారిస్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఎన్నికలకు తక్కువ టైం ఉన్న నేపథ్యంలో ఆమెనే.. సురక్షితమైన అభ్యర్థి అవుతారన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.

తాజా పరిణామాల నేపథ్యంలో మరో ఇద్దరు అభ్యర్థుల పేర్లు తెర మీదకు వచ్చాయి. వారిలో ఒకరు.. కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ కాగా ఇంకొకరు ఇల్లినోయి గవర్నర్ బేబీ ఫ్రిట్జ్ కెర్. ఇదిలా ఉండగా.. అధ్యక్ష రేసులో మరో పేరు కూడా వచ్చింది. అయితే.. ఆ విషయాన్నిప్రస్తావిస్తూ సదరు నేత (మిషిగన్ గవర్నర్ విట్మర్)తాను ఎన్నికల బరిలో లేనని.. తన మీద తప్పుగా ప్రచారం జరుగుతుందని స్పష్టం చేశారు. ఆగస్టు 19-22లో షికాగోలో జరిగే సమావేశంలో డెమొక్రాట్ల అభ్యర్థిని ఎన్నుకుంటారని చెబుతున్నారు.

తాజా పరిణామాల మీద ట్రంప్ స్పందించారు. అమెరికా చరిత్రలో అత్యంత చెత్త అధ్యక్షుడు బైడెన్ గా పేర్కొన్న ఆయన.. డెమొక్రాటిక్ నామినీగా బైడెన్ వైదొలిగిన తర్వాత స్పందించారు. కమలా హారిస్ అభ్యర్థిగా బరిలోకి దిగితే తాను మరింత సులువుగా ఓడిస్తానని పేర్కొనటం గమనార్హం. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ రోజున అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఒకలాంటి సిత్రమైన పరిస్థితి నెలకొంది. దేశ చరిత్రలో ఒక అభ్యర్థి ఎన్నికల నుంచి అర్ధాంతరంగా వైదొలిగితే ఏం చేయాలన్న దానిపై అవగాహన లేదు.కారణం.. ఇలాంటి పరిస్థితి ఎదురుకావటం ఇదే తొలిసారి అని చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఈ అంశంపై మరింత క్లారిటీ వస్తుందని చెబుతున్నారు. ఏమైనా.. బైడెన్ పుణ్యమా అని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో సినిమాటిక్ మలుపులు చోటు చేసుకుంటున్నాయని మాత్రం చెప్పక తప్పదు.