Begin typing your search above and press return to search.

అగ్రరాజ్య అధ్యక్షుడి బుర్ర పనిచేయడం లేదు.. జి-7లో ఈ సీనే నిదర్శనం

ఇంతటి ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ సదస్సులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నవ్వుల పాలయ్యారు.

By:  Tupaki Desk   |   14 Jun 2024 7:44 AM GMT
అగ్రరాజ్య అధ్యక్షుడి బుర్ర పనిచేయడం లేదు.. జి-7లో ఈ సీనే నిదర్శనం
X

ప్రపంచంలో అత్యంత బలమైన కూటమి ఏదంటే జి-7గా చెప్పాలి. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, కెనడా, ఇటలీ, జపాన్ ఇందులో సభ్య దేశాలు. ఈ కూటమి 50వ సమావేశం ప్రస్తుతం ఇటలీలోని అపూలియా ప్రాంతంలో జరుగుతోంది. దీనికి భారత ప్రధాని మోదీ ఆహ్వానిత దేశాల ప్రతినిధిగా హాజరవుతున్నారు.

ఇంతటి ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ సదస్సులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నవ్వుల పాలయ్యారు. ఇప్పటికే అమెరికా ఉపాధ్యక్షుడిగా తాను పనిచేసిన కాలం గుర్తుకురాకపోవడం, కుమారుడు చనిపోయిన సమయం మర్చిపోవడం వంటివి బైడెన్ పై విమర్శలకు దారితీశాయి. తాజాగా జీ-7కి వచ్చిన నేతలంతా గ్రూప్‌ ఫొటోకు పోజు ఇస్తుంటే.. బైడెన్ వారికి భిన్నమైన దిశలో తిరిగి.. ఏదో, ఎవరినో వెదుకుతూ కనిపించారు. ఎవరితోనో మాట్లాడుతూ ఉండిపోయారు.

అయితే, అటువైపు ఎవరూ లేకున్నా.. బైడెన్ ఇలా చేయడం సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. మరోవైపు ఎంతసేపటికీ ఆయన గ్రూప్‌ ఫొటో దిగేందుకు రాలేదు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ వెళ్లి బైడెన్ ను దాదాపు లాక్కొచ్చినంత పనిచేశారు.

బైడెన్ ఆరోగ్యం బాగేనా?

బైడెన్‌ వయసు 81 ఏళ్లు. ఆయన ఆరోగ్యంపై చాలా రోజుల నుంచి విమర్శలు వస్తున్నాయి. అధికారిక నివాసం వైట్‌ హౌస్‌లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో అందరూ సంగీతానికి తగ్గట్టుగా డ్యాన్స్ చేస్తుంటే.. బైడెన్ ఏమీ తెలియనట్లుగా ఉండిపోయారు. ఆయన జ్ఞాపక శక్తి మందగించిందని.. చాలా ‘‘మసక’’గా, ‘‘మబ్బు’’గా ఉందంటూ ఇటీవల ఓ నివేదిక వచ్చింది. జీవితంలోని కీలక ఘటనలను సైతం ఆయన గుర్తు లేవని తెలిపింది.

ఎన్నికల్లో గెలుపు మాటేమిటో?

ఈ ఏడాది చివర్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలున్నాయి. డెమెక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా బైడెన్, రిపబ్లికన్ పార్టీ తరఫున ట్రంప్ తలపడుతున్నారు. బైడెన్ పై ప్రస్తుతం వస్తున్న ఆరోపణలు డెమోక్రాటిక్ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. వీటిని రిపబ్లికన్ పార్టీ కుట్రగా తోసిపుచ్చుతోంది.