జన సైనికుల కలలు ఏం కావాలి? : పవన్‌కు జోగయ్య సూటి ప్రశ్న
యాచించే స్థితిని పవన్ నుంచి జనసైనికులు కోరుకోవట్లేదని.. రాజ్యాధికారాన్ని చేపట్టే విషయంలో వైఖరి ఏంటో స్పష్టం చేయాలంటూ లేఖ ద్వారా ప్రశ్నించారు.
By: Tupaki Desk | 22 Dec 2023 8:22 AM GMTజనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి మాజీ ఎంపీ, కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు చేగొం డి హరిరామజోగయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. జన సైనికుల కలలు ఏం కావాలంటూ ప్రశ్నలు గుప్పించారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్‌కు బహిరంగ లేఖ రాశారు. యాచించే స్థితిని పవన్ నుంచి జనసైనికులు కోరుకోవట్లేదని.. రాజ్యాధికారాన్ని చేపట్టే విషయంలో వైఖరి ఏంటో స్పష్టం చేయాలంటూ లేఖ ద్వారా ప్రశ్నించారు.
టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ వ్యాఖ్యల నేపథ్యంలో.. రాబోయే కాలంలో చంద్రబాబు నాయకత్వా న్ని పవన్ నిజంగా సమర్థిస్తున్నాడా? ఒకవేళ సమర్థిస్తే.. బడుగు బలహీన వర్గాల పరిస్థితి ఏంటని హరిరామజోగయ్య నిలదీశా రు. ఏపీలో 80 శాతం జనాభా ఉన్న బడుగు బలహీన వర్గాలకు మోక్షం ఇంకెప్పుడు? అని లేఖ ద్వారా పవన్‌ను నిలదీశారు.
‘‘మిమ్మల్ని నమ్ముకున్నవాళ్లు, మీ నుంచి ఏదో ఆశిస్తున్నవాళ్లు.. మీ వైఖరి ఏంటో తెలుసుకోవాలని అనుకుంటున్నారు. ఆ వైఖరిని స్పష్టంగా అందరికీ అర్థం అయ్యేట్లు చెప్పాలి’’ అని లేఖలో కోరారు. ``ఏపీ ఏర్పడిన నాటి నుంచి అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రెండు కుల నాయకులే రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. మీరు పెద్దన్న పాత్ర పోషిస్తూ.. బడుగు, బలహీన వర్గాలకు దారి చూపిస్తారని, నీతినిజా యితీలతో పాలన సాగిస్తారని అందరూ ఆశించారు. దీనికి మీరు ఏం సమాధానం చెబుతారు?`` అని జోగయ్య నిలదీశారు.
రాష్ట్రానికి అనుభవస్తుని నాయకత్వమే కావాలంటూ పవన్ కల్యాణ్ అనేకసార్లు ప్రస్తావించిన మాటను కూడా లేఖలో హరిరామజోగయ్య ప్రస్తావించారు. అధికారం చేపట్టి.. బలహీనవర్గాలను శాసించే స్థితికి మీరు తెస్తారని జనసైనికులు కలలు కంటున్నారని, ఆ కలలు ఏం కావాలని కోరుకుంటున్నారో పవన్ చెప్పాల్సిన అవసరం ఉందని లేఖలో పేర్కొన్నారు. దీనిపై జనసేన ఎలా రియాక్ట్ అవుతుందోచూడాలి.