Begin typing your search above and press return to search.

జోగయ్య కీలక సూచన : ఆ 32 అసెంబ్లీ నియోజక వర్గాలు!

పవన్ను ముఖ్యమంత్రిగా చూడాలన్నది జోగయ్య చిరకాల వాంఛన్న విషయం అందరికీ తెలిసిందే.

By:  Tupaki Desk   |   6 Jan 2024 5:36 AM GMT
జోగయ్య కీలక సూచన : ఆ 32 అసెంబ్లీ  నియోజక వర్గాలు!
X

వచ్చేఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సీనియర్ రాజకీయ నేత, కాపు సామాజికవర్గం ప్రముఖుల్లో ఒకరైన చేగొండి హరిరామజోగయ్య కీలకమైన సూచన చేశారు. ఈ మేరకు పవన్ కు బహిరంగలేఖ విడుదలచేశారు. అందులో ఏముందంటే మ్యానిఫెస్టోలో పెట్టాల్సిన సంక్షేమ పథకాలతో పాటు రాజకీయపరమైన సూచనలు కూడా ఉన్నాయి. అవేమిటంటే పోటీచేయాల్సిన నియోజకవర్గాలు. పవన్ను ముఖ్యమంత్రిగా చూడాలన్నది జోగయ్య చిరకాల వాంఛన్న విషయం అందరికీ తెలిసిందే.

అందుకు అనుగుణంగానే జనసేనకు కాపుల మద్దతుకోసం జోగయ్య కష్టపడుతున్నారు. ఈ నేపధ్యంలోనే రాబోయే ఎన్నికల్లో 6 పార్లమెంటు స్ధానాల్లో పార్టీ పోటీచేయాల్సిందే అని స్పష్టంగా చెప్పారు. అలాగే 32 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేనకు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు చెప్పారు. జనసేన కాకినాడ, అనకాపల్లి. నర్సాపురం, మచిలీపట్నం, గుంటూరు, రాజంపేట పార్లమెంటు సీట్లలో పోటీచేయాలని సూచించారు. ఈ నియోజకవర్గాల్లో కాపుల జనాభా ఎక్కువగా ఉన్నందు వల్లే జోగయ్య వీటిని సూచించారు.

అలాగే రాయలసీమలోని తిరుపతి, చిత్తూరు, మదనపల్లి, నంద్యాల, రాయచోటి, రాజంపేట, పుట్టపర్తి, కోడూరు, ఉత్తరాంధ్రలోని ఎచ్చెర్ల, పాతపట్నం, నెల్లిమర్ల, గజపతినగరం, పలాస, విజయనగరం, పెందుర్తి, యలమంచిలి, చోడవరం, అనకాపల్లి, విశాఖ దక్షిణం, గాజువాక, భీమిలీ, ఆముదాలవలస, తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం, కాకినాడ సిటి, రూరల్, ముమ్మిడివరం, అమలాపురం, రాజోలు, రాజమండ్రి రూరల్, రాజానగరం, రామచంద్రాపురం, కొత్తపేట సీట్లలో పోటీచేస్తే గెలుపు అవకాశాలు ఎక్కవుగా ఉన్నాయన్నారు. ఇన్ని నియోజకవర్గాలను చెప్పిన జోగయ్య పశ్చిమగోదావరి, కోస్తా జిల్లాల్లోని నియోజకవర్గాలను ఎందుకు వదిలిపెట్టారో తెలీటంలేదు.

ఇపుడు జోగయ్య ప్రస్తావించిన నియోజకవర్గాలు జనసేనకు గెలుపు అవకాశాలు ఉన్నవనే. అంతేకాని పోటీచేయాల్సిన నియోజకవర్గాల సంఖ్య మాత్రం కాదు. మరి జోగయ్య దృష్టిలో జనసేన ఎన్ని నియోజకవర్గాల్లో పోటీచేయాలో మాత్రం ప్రకటించలేదు. ఏదేమైనా పొత్తులో టీడీపీ, జనసేన ఏ పార్టీ ఎన్నిసీట్లకు పోటీచేయాలి, పోటీచేయబోయే నియోజకవర్గాలేవి అన్న విషయాలు చంద్రబాబు, పవన్ స్ధాయిలో డిసైడ్ అయిపోయుంటాయి. కాకపోతే వాటిని ఇద్దరు ప్రకటించలేదంతే. సంక్రాంతి తర్వాత ప్రకటించబోతున్నట్లు సమాచారం. చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.