Begin typing your search above and press return to search.

టీడీపీ - జనసేన పొత్తుపై జోగయ్య సంచలనం వ్యాఖ్యలు!

ఒకరు ఒకటంటే.. మరొకరు పది అంటున్నారు. మరొకరు పది అంటే.. ఇంకొకరు వంద అంటున్నారు. ఈ సమయంలో... హరిరామ జోగయ్య ఎంటరయ్యారు.

By:  Tupaki Desk   |   27 Jan 2024 10:35 AM GMT
టీడీపీ - జనసేన పొత్తుపై జోగయ్య సంచలనం వ్యాఖ్యలు!
X

రిపబ్లిక్ డే సందర్భంగా పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మండపేట, అరకు స్థానాలను పొత్తుధర్మానికి విరుద్ధంగా ప్రకటించడాన్ని పవన్ తప్పుబట్టారు. అందుకే తాను కూడా రెండు సీట్లు ప్రకటిస్తాను అన్నట్లుగా రాజోలు, రాజానగరం స్థానాలను ప్రకటించారు. దీంతో... వ్యవహారం చర్చనీయాంశం అయ్యింది. వీరి పొత్తుకు బీటలు వారుతున్నాయనే చర్చ మొదలైంది.


అది చాలదన్నట్లుగా "చర్యకు ప్రతిచర్య ఉంటుంది" అని.. అది న్యూటన్ గమన నియమాల ప్రకారం అంటూ ఆన్ లైన్ వేదికగా చెప్పాలనుకున్న విషయాన్ని తిప్పి తిప్పి చెప్పినంతపనిచేశారు నాగబాబు. అప్పటికే ఆన్ లైన్ వేదికగా... జనసైనికులకు, తమ్ముళ్లకు వార్ మొదలైపోయింది. ఒకరు ఒకటంటే.. మరొకరు పది అంటున్నారు. మరొకరు పది అంటే.. ఇంకొకరు వంద అంటున్నారు. ఈ సమయంలో... హరిరామ జోగయ్య ఎంటరయ్యారు.


అవును... టీడీపీ - జనసేన మధ్య పొత్తుల వ్యవహారం రచ్చ రచ్చగా మారుతున్న సంకేతాలు మొదలైన సంగతి తెలిసిందే! ఈ క్రమంలో "జనసేనతో మనకు అవసరమా"? అంటూ తమ్ముళ్లు చంద్ర్బాబును ప్రశ్నిస్తుండగా... 60 సీట్లు లేకపోతే టీడీపీతో పొత్తు వల్ల ప్రయోజనం శూన్యం అని జనసైనికుల నుంచి వినిపిస్తున్న మాటలు. ఈ సమయంలో కనీసం 50 సీట్లు అయినా జనసేనకు కేటాయించకపోతే టీడీపీ పొత్తు విఫల ప్రయోగంగా మారే అవకాశం అని హెచ్చరికలు జారీ చేశారు జోగయ్య.


ఇందులో భాగంగా... జనసేన ఎదుగుదలకు తెలుగుదేశమే అడ్డమా అంటూ కీలక ప్రశ్న వేసిన జోగయ్య... పవన్ కల్యాణ్ పెద్ద మనసుతో సర్దుకపోవటమే తప్పవుతుందా అన్నట్లుగా స్పందించారు. ఇదే సమయంలో... గెలుపోటముల సంగతి కాసేపు పక్కనపెడితే... గత ఎన్నికల్లో జనసేన 137 సీట్లలో ఒంటరిగా పోటీ చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు జోగయ్య. ఇదే క్రమంలో... పొత్తు ధర్మాన్ని పాటించకుండా జనసేన సీట్లలో తమ అభ్యర్దులకు అవకాశం కల్పించేలా చంద్రబాబుకు ప్లాన్స్ వేస్తున్నారని అన్నారు.

ఇదే సమయంలో జనసేనకు కనీసం 50స్థానాలు తగ్గకుండా కేటాయించాలని డిమాండ్ చేసిన హరిరామ జోగయ్య... జనసేన బలాన్ని తక్కువగా అంచనా వేస్తూ.. తక్కువ స్థానాలకు పరిమితం చేయాలని చూస్తే.. ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరించాల్సిన పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. కారణం... జనసేనకు గౌరవ ప్రదమైన సీట్లు ఇవ్వటం లేదనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్తే... టీడీపీ పోటీ చేసే స్థానాల్లో జనసేన కేడర్ వ్యతిరేకంగా వ్యవహరించే ప్రమాదాన్ని కాదనలేమని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ప్రధానంగా... జనసేనకు గౌరవప్రదమైన సీట్లు కేటాయించడం వల్ల మాత్రమే ఆ పార్టీ ఓటు బ్యాంక్ తమ అభ్యర్థులకు బదిలీ అవుతుందనే విషయాన్ని టీడీపీ నేతలు గుర్తించాలని జోగయ్య సూచించారు. ఇక ఈ సమర్భంగా ... పొత్తు ధర్మాన్ని పాటించకుండా చంద్రబాబు ఏకపక్షంగా సీట్లను ప్రకటించటం తప్పేనని చెప్పిన ఆయన... రాజోలు, రాజానగరంతో పాటు పార్టీకి బలమున్న మరిన్ని నియోజకవర్గాలను పవన్ ప్రకటించి ఉండాల్సిందని జోగయ్య అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా పవర్ షేరింగ్ ప్రస్థావన కూడా తెచ్చిన హరిరామ జోగయ్య... 2019 ఎన్నికల్లో జనసేన 60 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పది వేలకు పైగా ఓట్లు సాధించిందని.. అదే విధంగా ఆరు ఎంపీ స్థానాల్లోనూ బలం ఉందని తెలిపారు. ఫలితంగా... ఒకరి అవసరం మరొకరికి ఉందనే విషయాన్ని రెండు పార్టీలూ పరిగణలోకి తీసుకోవాలని.. ఇదే సమయంలో పవర్ షేరింగ్ లో కూడా జనసేనకు టీడీపీ తగిన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

ఇన్ని విషయాలు వెల్లడిస్తూ, టీడీపీకి సూచనలతో కూడిన హెచ్చరికలు చేసిన జోగయ్య... 25-30 సీట్లు కేటాయిస్తే పవన్ ఇప్పటి వరకు చెప్పిన మాటలకు విలువ లేకుండా పోతుందని.. జనసేనకు సీట్లు, అధికారంలో వాటా ఇవ్వకుంటే పొత్తు విఫల ప్రయోగంగా మారుతుందని జోగయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.