జోగి ధీమానే వేరు బాస్.. విచారణ ముగిశాక ఏమన్నారంటే?
ఈ నేపథ్యంలో విచారణకు వెళ్లిన జోగి.. గంట కంటే తక్కువ సమయానికే బయటకు వచ్చేయటం విశేషం.
By: Tupaki Desk | 12 April 2025 4:50 AMసాధారణంగా ఏదైనా కేసు విషయంలో మాజీ మంత్రి స్థాయి ఉన్న నేతను విచారణకు పిలిస్తే సీన్ ఎలా ఉంటుంది? ఐదారేళ్ల క్రితం ఇదే ప్రశ్నను అడిగితే సమాధానం ఒకలా ఉండేది. కానీ.. వైసీపీ ప్రభుత్వంలో ఏపీలో చోటు చేసుకున్న పరిణామాలు.. నేతల మీద కేసులు.. వాటి విచారణ వేళ చోటు చేసుకునే పరిణామాల గురించి కథలు కథలుగా చెప్పుకునే పరిస్థితి. కట్ చేస్తే.. ప్రస్తుతం కూటమి సర్కారులో వైసీపీ నేతల్ని విచారణకు పిలిచిన వేళ.. చోటు చేసుకుంటున్న పరిణామాలు భిన్నంగా ఉంటున్నాయి.
ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఇంటి మీదకు కర్రలు.. రాళ్లతో దాడి చేసిన ఉదంతానికి సంబంధించిన కేసులో వైసీపీ నేత కం మాజీ మంత్రి జోగి రమేశ్ ను విచారించేందుకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో విచారణకు వెళ్లిన జోగి.. గంట కంటే తక్కువ సమయానికే బయటకు వచ్చేయటం విశేషం. మరో ఆసక్తికరమైన అంశం ఏమంటే.. సీఐడీ లాంటి సంస్థలు విచారణకు పిలిస్తే.. నోటీసుల్లో పేర్కొన్న సమయానికి ఉండటం జరుగుతుంది. అలా చేస్తే ఆయన జోగి రమేశ్ ఎందుకు అవుతారు.
విజయవాడలోని తులసీనగర్ లో ఉన్న సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి శుక్రవారం ఉదయం పదిన్నర గంటలకు జరిగే విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇస్తే.. జోగి రమేశ్ మధ్యాహ్నం పన్నెండు గంటలకు రావటం ఒక ఎత్తు అయితే..కేవలం గంట కంటే తక్కువ సమయానికే బయటకు వచ్చేశారు. 2021 సెప్టెంబరు 17న చంద్రబాబు ఇంటిపైకి పెద్ద ఎత్తున వాహనాలతో దండయాత్రగా కర్రలు.. రాళ్లు పట్టుకొని ఎందుకు వెళ్లారు? దాడి చేయాలన్న ప్లాన్ లేకపోతే అలా ఎందుకు వెళ్లినట్లు? అని అడగ్గా.. కర్రలు.. రాళ్లను పట్టుకొని తాము వెళ్లలేదని చెప్పినట్లుగా తెలుస్తోంది.
ప్రస్తుత అసెంబ్లీ సభాపతి అయ్యన్నపాత్రుడు నాటి సీఎం జగన్ పై అసభ్య వ్యాఖ్యలు చేసినందుకు నిరసన తెలిపేందుకు చంద్రబాబు ఇంటికి వెళ్లినట్లుగా పేర్కొన్నారు. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. జోగి రమేశ్ చెప్పిన మాటల్ని విన్న సీఐడీ అధికారులు.. దానికి కౌంటర్ గా తమ వద్ద ఆధారాల్ని చూపించాల్సి ఉందని.. అలాంటిదేమీ జరగలేదన్న విమర్శ వినిపిస్తోంది. విచారణ అనంతరం జోగి రమేశ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
రెడ్ బుక్ పేరుతో మహా అయితే ఇంకో ఏడాది పాటు తమపై కేసులు పెడతారని.. ఆ తర్వాత ఆ రెడ్ బుక్ ఎక్కడ ఉంటుందో? అంటూ అభ్యంతరకర భాషతో వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు.. లోకేశ్ లు అధికారం ఉందని విర్రవీగుతున్నారని.. తమపై కేసులు పెడితే మహా అయితే రెండు.. మూడు నెలలు జైల్లో ఉంచుతారని.. అంతకు మించి ఏం చేయగలరంటూ వేస్తున్న ప్రశ్నలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. విపక్షంలో ఉండి కూడా ‘ఫైర్’ పుట్టేలా మాట్లాడుతున్న జోగి రమేశ్ మరోసారి సంచలనంగా మారారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.