జోగితో రాసుకుంటే...సీన్ సితారేనా ?
వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ తో రాసుకుని పూసుకుని తిరిగితే ఏమవుతుంది అన్నది మాత్రం తెలుగు తమ్ముళ్లే పక్కాగా చెప్పగలరు
By: Tupaki Desk | 17 Dec 2024 3:30 PM GMTజోగీ జోగీ రాసుకుంటే బూడిద రాలుస్తుంది అన్నది ముతక సామెత. వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ తో రాసుకుని పూసుకుని తిరిగితే ఏమవుతుంది అన్నది మాత్రం తెలుగు తమ్ముళ్లే పక్కాగా చెప్పగలరు. నిన్నటికి నిన్న సర్దార్ గౌతు లచ్చన పేరిట విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో జోగి రమేష్ కనిపించి అందరికీ షాక్ కి గురి చేశారు. అది గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సభ అయినా అక్కడకు వచ్చిన వారు అంతా టీడీపీకి చెందిన వారే.
మరి జోగి రమేష్ ని ఎవరు పిలిచారో ఆయన ఎందుకు వచ్చారో రాజకీయ కారణాలు అయితే తెలియవు కానీ దాని మీద నారా లోకేష్ చంద్రబాబు మాత్రం ఘాటుగానే రియాక్ట్ అయినట్లుగా ప్రచారం సాగింది. జోగి రమేష్ తో రాసుకుని పూసుకుని తిరుగుతారా అంటూ తమ్ముళ్లను మందలించారని కూడా ప్రచారం సాగింది
దానికి మంత్రి కొలుసు పార్ధసారధి అయితే మీడియా సమావేశం పెట్టి మరీ చంద్రబాబుకు సారీ చెప్పారు. అది పార్టీ కార్యక్రమం కాదని మాత్రమే తాము భావించామని అన్నారు. జోగి రమేష్ అక్కడికి ఎందుకు వచ్చారో తెలియదని చూసి తాను ఆశ్చర్యపోయాను అని వివరణ ఇచ్చారు. అంతే కాదు జోగి రమేష్ తో తనకు ఎటువంటి వ్యక్తిగత అనుబంధమూ లేదని తేల్చేశారు.
తనకి పిలిచి టికెట్ ఇచ్చి మంత్రిని చేసిన చంద్రబాబు మనసు బాధపడి ఉంటే క్షమాపణలు అని ఆయన పెద్ద మాటే వాడారు. అలాగే పార్టీకి అన్ని విషయాలు తెలుసు అని తాము ఎపుడూ ఇలా చేయమని కూడా తెలుసు అని ఆయన సుదీర్ఘ వివరణే ఇచ్చారు.
ఇంకోవైపు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష కూడా తన తాత లచ్చన్న కార్యక్రమం అని తాను వెళ్ళానని అంతే తప్ప అక్కడ ఎవరు వచ్చారో చూడలేదని అన్నారు. మొత్తానికి జోగి రమేష్ అక్కడ ఎంట్రీతో టీడీపీ పెద్దలు అయితే అగ్గి మీద గుగ్గిలమే అవుతున్నారు.
దీనికి అంతటికీ కారణం ఏంటి అంటే వైసీపీ ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నపుడు జోగి రమేష్ టీడీపీ వారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు ఆయన ఏకంగా చంద్రబాబు లోకేష్ మీద కూడా తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. వాటిని తమ్ముళ్ళు అయితే మరచిపోలేదని అంటున్నారు.
అంతే కాకుండా చంద్రబాబు ఇంటి మీదకు దాడికి రమేష్ వెళ్లారు అన్నది అప్పట్లో సంచలనమైంది. తాను బాబుకు వినతిపత్రం ఇవ్వాలని మాత్రమే ఆయన ఇంటికి వెళ్లాను అని జోగి రమేష్ ఆ తరువాత చెప్పినా ఆయన మందీ మార్బలంతో వెళ్లడంతో పాటు అక్కడ ఆయన అనుచరులు చేసిన రచ్చ చూసిన టీడీపీ అయితే అది దాడి అనే నిర్ధారించింది.
ఇవన్నీ పక్కన ఉంచితే అగ్రి గోల్డ్ ఇష్యూలో జోగి రమేష్ కుమారుడిని కూటమి ప్రభుత్వం వచ్చాక అరెస్ట్ చేశారు. అది కూడా ఆయనకు ఇబ్బందిగా మారింది. దాంతో పాటు బాబు ఇంటి మీద దాడి కేసు ఉంది. ఇలా ఉక్కిరిబిక్కిరి అవుతున్న దశలో ఆయన టీడీపీలో చేరాలని చూస్తున్నారు అని ప్రచారంలో ఉంది.
దానికి తగినట్లుగానే ఆయన అక్కడ కనిపించారు అని కూడా అంటున్నారు. అయితే జోగి రమేష్ సడెన్ గా టీడీపీ వారితో కనిపించడంతో పార్టీ హైకమాండ్ అయితే ఫైర్ అయినట్లుగానే ఉంది అని చెబుతున్నారు. ఇవన్నీ జోగిని పార్టీలోకి తీసుకునే సీన్ లేదని చెప్పేందుకే అని అంటున్నారు.
టీడీపీ అనేక మంది వైసీపీ నేతలను చేర్చుకుంటోంది. అయితే వారంతా వ్యక్తిగతంగా టీడీపీ నేతలను అధినేతలను పెద్దగా విమర్శించిన దాఖలాలు లేవన్న ట్రాక్ రికార్డు చూసి మరీ చాన్స్ ఇస్తోంది. మరీ ముఖ్యంగా చంద్రబాబు లోకేష్ ల మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన వారికి అయితే పసుపు పార్టీలో చోటే లేదని కూడా స్పష్టం చేస్తోంది.
రాజకీయంగా రెండు దశాబ్దాలుగా కీలకంగా ఉంటూ వచ్చిన మాజీ మంత్రి జోగి రమేష్ కి ఇవన్నీ తెలియవా అన్నది కూడా చర్చగా ఉంది. అయితే రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు అనుకునే వారికి అక్కడ ఉన్నది లోకేష్ అన్నది కూడా గమనించాలని అంటున్నారు. మొత్తానికి జోగితో రాసుకుంటే సీన్ సితారే అన్న గట్టి హెచ్చరికను అయితే టీడీపీ హైకమాండ్ పంపింది అని అంటున్నారు.