జోగి...వెల్లంపల్లి ట్రాక్ లోకి వచ్చినట్లేనా ?
ఫీజు రీయింబర్స్ మెంట్ ని కూటమి ప్రభుత్వం చెల్లించకపోవడంతో విద్యార్ధులు పరీక్షల ముందు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు.
By: Tupaki Desk | 30 Jan 2025 11:30 PM GMTవైసీపీలో ఫైర్ బ్రాండ్ గా ముద్రపడిన మాజీ మంత్రులు జోగి రమేష్ వెల్లంపల్లి శ్రీనివాసరావు మళ్ళీ మీడియా ముందు కనిపించారు. చాలా కాలం తరువాత ఆయన కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేశారు. ఫిబ్రవరి 5న ఫీజు పోరాటం వైసీపీ ఆధ్వర్యంలో చేస్తామని హెచ్చరించారు. ఫీజు రీయింబర్స్ మెంట్ ని కూటమి ప్రభుత్వం చెల్లించకపోవడంతో విద్యార్ధులు పరీక్షల ముందు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు.
ఇదిలా ఉంటే ఈ ఇద్దరు మాజీ మంత్రులు వైసీపీ అధికారంలో ఉన్నపుడు రోజూ మీడియా ముందు కనిపించేవారు. చాలా జోరు చేసేవారు. గత ఎన్నికల్లో ఓటమి పాలు కాగానే వీరు వాయిస్ అయితే ఎక్కడా లేకుండా పోయింది. ఇక జోగి రమేష్ కుటుంబం మీద కేసులు పడ్డాయి. ఆయన ఒక దశలో టీడీపీలోకి వెళ్తారు అని కూడా ప్రచారం జరిగింది.
ఆయన సైలెంట్ కావడం చూసి అంతా ఆయన వైసీపీకి దూరం అనుకున్నారు. అలాగే వెల్లంపల్లి శ్రీనివాసరావు కూడా పార్టీ వేదికల మీద పెద్దగా కనిపించడం లేదు. దాంతో ఈ ఇద్దరు నాయకుల విషయంలో వైసీపీ ఆలోచించుకోవాల్సిందే అని అనుకున్నారు. కానీ మాజీ మంత్రులు ఇపుడు మీడియా ముందుకు వచ్చి కూటమి ప్రభుత్వం మీద ధాటీగా విమర్శలు చేయడంతో ఉమ్మడి క్రిష్ణా జిల్లాలో కీలక నేతలు ట్రాక్ లోకి వచ్చినట్లేనా అన్న చర్చ సాగుతోంది.
వైసీపీ ఓటమి చెంది ఎనిమిది నెలలు గడచాయి. దాంతో వైసీపీలో బడా నాయకులు అంతా ఇపుడు సరైన సమయం కాదని మౌన ముద్ర దాల్చారని అంటున్నారు. మరి కొత్త ఏడాదిలో ఇలా కీలక నేతలు మళ్ళీ సందడి చేయడం దేనికి సంకేతం అని చర్చ వస్తోంది.
కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకపోవడంతో తమకు ఎంతో కొంత అనుకూలత ఉంటుందని భావించే వైసీపీ నేతలు మెల్లగా జనంలోకి వస్తున్నారు అని అంటున్నారు. అదే సమయంలో కొందరు నేతలు కూటమి వైపు వెళ్ళేందుకు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించకపోవడం వల్ల కూడా వారు సైలెంట్ అయి ఆ తరువాత పార్టీ స్టాండ్ తీసుకున్నారు అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే పార్టీలో ముఖ్య నాయకులు మళ్ళీ గొంతు పెంచడం వైసీపీకి హుషారు ని ఇస్తోందని అంటున్నారు.
ఇదిలా ఉంటే వైసీపీలో ఇంకా చాలా గొంతులు లేవాల్సి ఉందని అంటున్నారు. మరి వారికి ఏడాది కాలం సరిపోతుందా లేక ఇంకా ఎక్కువ కాలం కావాలా అన్న చర్చ కూడా ఉంది. అయితే రాజకీయాల్లో రోజులు ఎపుడూ ఒకేలా ఉండవని వైసీపీ నేతలు కొందరు ఇపుడిపుడే ఓటమి షాకుల నుంచి బయటకు వస్తున్నారని రానున్న రోజులలో పార్టీలో మళ్ళీ పూర్వపు సందడి కనిపిస్తుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చూడాలి మరి ఏమి జరుగుతుందో.