Begin typing your search above and press return to search.

ఉన్నది పోయే.. ఉంచుకున్నదీ పాయే!

ఇప్పుడు కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్‌ పరిస్థితి కూడా ఇదేనని అంటున్నారు

By:  Tupaki Desk   |   16 Jan 2024 11:30 PM GMT
ఉన్నది పోయే.. ఉంచుకున్నదీ పాయే!
X

ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే ఎన్నికల్లో గెలుపొందడమే లక్ష్యంగా ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ చేస్తున్న మార్పులుచేర్పులు ఆ పార్టీలో కలకలానికి దారి తీస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సిట్టింగుల స్థానాలను వారికి కాకుండా వేరే వారికి జగన్‌ కేటాయిస్తున్నారు. మరికొందరు సిట్టింగులను వేరే స్థానాల నుంచి బరిలోకి దించుతున్నారు. అలాగే ఇంకొందరు సిట్టింగులకు అసలు సీట్లే ఇవ్వడం లేదు. ఈ మార్పులు వైసీపీ నేతల్లో అసంతృప్తి కారణమవుతున్నాయని అంటున్నారు.

ఇప్పుడు కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్‌ పరిస్థితి కూడా ఇదేనని అంటున్నారు. ప్రస్తుతం జగన్‌ మంత్రివర్గంలో జోగి రమేశ్‌ గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నారు. ప్రతిపక్ష నేతలను తీవ్రమైన భాషలో దూషించే నేతగా ఆయన పేరు పొందారు. ఇదే కారణంతో మంత్రి పదవి లభించిందనే వారూ ఉన్నారు.

కాగా వచ్చే ఎన్నికలకు సంబంధించి జోగి రమేశ్‌ కు జగన్‌ పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గం సీటును కేటాయించారు. దీంతో ఆయన తన సన్నిహితుల వద్ద అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం.

జోగి రమేశ్‌ తొలిసారి 2009లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున పెడన నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో నియోజకవర్గం మారారు. మైలవరం నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. ఇక 2019 ఎన్నికలకు వచ్చే నాటికి ఆయన మళ్లీ మైలవరం నుంచి నియోజకవర్గం మార్చారు. పెడన నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.

వాస్తవానికి జోగి రమేశ్‌ సొంత ఊరు .. మైలవరం నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం. ప్రస్తుతం మైలవరం వైసీపీ ఎమ్మెల్యేగా వసంత కృష్ణప్రసాద్‌ ఉన్నారు. అయితే జోగి రమేశ్‌ తానున ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న పెడనతోపాటు మైలవరం నియోజకవర్గంలోనూ తన కార్యకలాపాలు నిర్వహించడం, ఆయన అనుచరులు స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ ను లెక్కచేయకపోవడం తదితర కారణాలు తీవ్ర కలకలానికి దారితీశాయి. వసంత కృష్ణ ప్రసాద్, జోగి రమేశ్‌ మధ్య వివాదాన్ని సాక్షాత్తూ ముఖ్యమంత్రి జగన్‌ పరిష్కరించాల్సి వచ్చింది.

వాస్తవానికి వచ్చే ఎన్నికల్లో జోగి రమేశ్‌ మైలవరం నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించారని చెబుతున్నారు. ఒకవేళ ఆ సీటు ఇవ్వకపోతే ప్రస్తుతం తాను ఎమ్మెల్యేగా ఉన్న పెడన నుంచి పోటీ చేయడానికి సిద్ధమయ్యారు, అయితే వైసీపీ అధినేత జగన్‌ ఎవరూ ఊహించని విధంగా జోగి రమేశ్‌ కు పెనమలూరు అసెంబ్లీ సీటును కేటాయించారు.

పెనమలూరు నుంచి పోటీ చేయడం జోగి రమేశ్‌ కు కూడా ఇష్టం లేదని చెబుతున్నారు. ఇప్పటికే ఆయన తన సన్నిహితుల దగ్గర ఈ విషయంలో ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే జోగి రమేశ్‌ రాకను పెనమలూరు నియోజకవర్గంలో వైసీపీ ముఖ్య నేతలుగా ఉన్న కమ్మ కార్పొరేషన్‌ చైర్మన్‌ తుమ్మల చంద్రశేఖర్, డీసీఎంఎస్‌ చైర్‌ పర్సన్‌ పడమటి స్నిగ్థ వ్యతిరేకిస్తున్నారు. జోగికి సహకరించేది లేదని తెల్చిచెబుతున్నారు,

ఈ నేపథ్యంలో జోగి రమేశ్‌ సైతం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పెడన, పోటీ చేయాలనుకున్న మైలవరం.. రెండూ రాకపోవడంతో అంతర్మథనం చెందుతున్నట్టు గాసిప్స్‌ వినిపిస్తున్నాయి. పెనమలూరు సీటు తనకు ఇష్టం లేకపోయినా అధినేత జగన్‌ బలంగా కట్టబెట్టినట్టు భావిస్తున్నారని అంటున్నారు.