జనసేనలో జానీ మాస్టర్, ఫృధ్వీ... ఒకరు పోటీ, మరొకరు ప్రచారం?
ఈ సమయంలో... ప్రధాన పార్టీలలోని అసంతృప్తులకు ఆల్టర్నేటివ్ గా ఉపయోగపడుతుందనే కామెంట్లూ వినిపిస్తున్నాయి.
By: Tupaki Desk | 24 Jan 2024 2:28 PM GMTఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల సందడి మొదలైపోయింది. ఎన్నికలకు కేవలం రెండు మూడు నెలలు మాత్రమే సమయం ఉందని అంటున్న వేళ.. ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ, జనసేన ఎన్నికల కసరత్తులు మొదలుపెట్టాయి. ఇదే సమయంలో షర్మిల చేరికతో కొత్త జోష్ లో ఉన్నట్లు కనిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ సైతం ఎన్నికల రేస్ లోకి వచ్చేసింది. ఈ సమయంలో... ప్రధాన పార్టీలలోని అసంతృప్తులకు ఆల్టర్నేటివ్ గా ఉపయోగపడుతుందనే కామెంట్లూ వినిపిస్తున్నాయి.
ఇక ఎన్నికలకు సమాయత్తమవుతున్న కార్యక్రమంలో భాగంగా అధికార వైసీపీ పెద్ద ఎత్తున ఇన్ చార్జ్ లను మారుస్తుంది. సామాజిక సమీకరణలు, సర్వేల ఫలితాలు, కార్యకర్తల అభిప్రాయాలు, నేతల పనితీరును ఆధారం చేసుకుని ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలుస్తుంది. మరోపక్క టీడీపీ - జనసేనలు సైతం సీట్ల సర్ధుబాటు, అభ్యర్థుల ఎంపికల పనిలో నిమగ్నమైపోయాయని తెలుస్తుంది. ఇదే సమయంలో తమ కూటమిలో బీజేపీ చేరికపైనా ఎదురు చూస్తున్నారని సమాచారం!
ఇదే సమయంలో ఆయా ప్రధాన పార్టీలలోని అసంతృప్తులు పార్టీలు మారుతున్నారు. టిక్కెట్లు రాలేదనో, ఆశించిన టిక్కెట్ ఇవ్వలేదనో... కారణం ఏదైనా అనుచరుల మనోభిష్టం మేరకు అని చెప్పి కండువాలు మారుస్తున్నారని తెలుస్తుంది. ఈ సమయంలో జనసేనలోకి సినీజనాల నుంచి చేరికలు జరిగాయి. ఇందులో భాగంగా.. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్.. పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు.
అవును... ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఇందులో భాగంగా... మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా జానీ మాస్టార్ కి కండువా కప్పిన పవన్ కల్యాణ్... ఆయనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. దీనికి సంబంధించిన విషయాలను జనసేన తన అధికారిక ఎక్స్ లో వెల్లడించింది.
పవన్ కల్యాణ్ కు వీరాభిమాని అయిన జానీ మాస్టర్.. ఎన్నికల వేళ జనసేన పార్టీలో చేరడం ఆసక్తిగా మారింది. దీంతో... ఆయన ఎక్కడ నుండి పోటీ చేస్తారనేదానిపైనా ఉత్కంఠ నెలకొంది. ఆంధ్రప్రదేశ్ లోని ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన జానీ మాస్టర్... ఆ జిల్లాలోని ఏదో ఒక స్థానం నుండి బరిలో ఉంటారని ఈ సందర్భంగా ఊహాగానాలు మొదలైపోయాయి.
ఇదే సమయంలో... పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరారు ప్రముఖ సినీ నటుడు పృధ్వీ రాజ్ (30 ఇయర్స్ ఇండస్ట్రీ ఫృధ్వీ). ఈ సమయంలో... ఫృధ్వీకి పార్టీ కండువా వేసి పవన్ కళ్యాణ్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.