Begin typing your search above and press return to search.

ప్రియమైన చంద్రబాబు మామయ్యకు....జూనియర్ అదుర్స్ !

టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సందర్భంగా ఎన్నో రకాలైన అభినందనలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి.

By:  Tupaki Desk   |   5 Jun 2024 11:19 AM GMT
ప్రియమైన చంద్రబాబు మామయ్యకు....జూనియర్ అదుర్స్ !
X

టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సందర్భంగా ఎన్నో రకాలైన అభినందనలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. కానీ అందులో ఆసక్తిని పెంచేది సంచలనమైనది ఒక అభినందన ఉంది. అది అంతా చర్చించుకునేదిగా ఉంది. వైరల్ కూడా అయింది.


ఆ అభినందన ఎవరిది అంటే ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ది. ఇంతకీ ఆయన చేసిన ట్వీట్ ఏమిటి అంటే "ప్రియమైన చంద్రబాబు మామయ్యకి ఈ చారిత్రాత్మక విజయాన్ని సాధించినందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు సాధించిన ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు నడిపిస్తుందని ఆశిస్తున్నాను. అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేశ్ కి, మూడోసారి విజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి, ఎంపీలుగా గెలిచిన పురందేశ్వరి అత్తకి, మతుకుమిల్లి శ్రీభరత్ కు నా శుభాకాంక్షలు" అంటూ తన బంధువులకు ఎన్టీఆర్ విషెస్ తెలియజేశారు.


అదే విధంగా మరో ట్వీట్ లో జనసేనాని పవన్ కల్యాణ్ కు కూడా ఎన్టీఆర్ శుభాభినందనలు తెలియజేశారు. ఇంతటి ఘన విజయం సాధించిన పవన్ కల్యాణ్ కు కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ పేర్కొన్నారు. ఇపుడు ఈ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. టీడీపీతో జూనియర్ ఎన్టీఆర్ కి పెద్దగా సంబంధాలు లేవని అంతా ప్రచారం చేస్తూ ఉంటారు.

కానీ జూనియర్ చాలా అవగాహన ఉన్న వారు. ఎపుడు ఏ సమయంలో ఏమి చేయాలో ఆయనకు బాగా తెలుసు. అందుకే ఆయన సరైన సమయంలోనే చంద్రబాబుని అభినందిస్తూ ట్వీట్ చేసారు అని అంటున్నారు. ఒక్క దెబ్బతో తంకు బాబుకు అలాగే టీడీపీకి మధ్య ఎలాంటి గ్యాప్ లేదని కూడా చాటి చెప్పారని అంటున్నారు.

దాంతో జూనియర్ ది తెలుగుదేశం రక్త సంబంధమే అని అంటున్నారు. ఆ బంధాన్ని ఎవరూ విడదీయలేరని కూడా అంటున్నారు. తెలుగుదేశం పార్టీ విషయంలో జూనియర్ ఎపుడూ అండగా ఉంటారు అన్న మరో సంకేతం కూడా ఇచ్చినట్లు అయింది.

ఒక్క జూనియర్ మాత్రమే కాదు కళ్యాణ్ రామ్ కూడా చంద్రబాబుకు బాలయ్యకు, లోకేష్ కి ఇతర బంధువులకు అభినందనలు తెలియచేస్తూ ట్వీట్ చేశారు. ఇది నిజంగా నందమూరి నారా కుటుంబాలలో ఆనందం నింపిదే. అంతే కాదు తెలుగుదేశం పార్టీ అభిమానులలోనూ హర్షం నింపేదే అని అంటున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ అయినా కళ్యాణ్ రాం అయినా తాత పెట్టిన పార్టీ కోసం కట్టుబడి ఉంటారని అంతా అంటూ వచ్చారు. అదే ఇపుడు నిజం అయింది అని అంటున్నారు. అయితే జూనియర్ ప్రస్తుతం సినిమాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన ఫోకస్ అంతా అటు వైపే ఉంది. దాంతోనే ఆయన రాజకీయాల మీద దృష్టి పెట్టడం లేదు అని అంటున్నారు.