Begin typing your search above and press return to search.

జూబ్లీహిల్స్ ‘టానిక్ మార్ట్’ మూసివేత.. ఎందుకంటే?

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన జూబ్లీహిల్స్ లోని ‘టానిక్ మార్ట్’ ఎట్టకేలకు మూసేశారు.

By:  Tupaki Desk   |   2 Sep 2024 4:24 AM GMT
జూబ్లీహిల్స్ ‘టానిక్ మార్ట్’ మూసివేత.. ఎందుకంటే?
X

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన జూబ్లీహిల్స్ లోని ‘టానిక్ మార్ట్’ ఎట్టకేలకు మూసేశారు. ఆదివారంతో దీని కథ కంచికి చేరినట్లైంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబరు 36లో ఉన్న ఈ షాప్ ను ఎక్సైజ్ అధికారులు మూసేశారు. ఆగస్టు 31తో దీనికి ఉన్న లైసెన్స్ గడువు ముగియటంతో ఆదివారం(సెప్టెంబరు 1న) ఉదయం ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ కేఏబీ శాస్త్రి తదితర సిబ్బంది వచ్చి మూసేశారు.

మద్యం పాలసీ ప్రకారం రెండేళ్లకు ఒకసారి మద్యం లైసెన్స్ ను రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. కేసీఆర్ ప్రభుత్వంలో తెలంగాణ ఎక్సైజ్ పాలసీకి భిన్నంగా.. ప్రత్యేకంగా అనుమతులు ఇస్తూ దీన్ని ఓపెన్ చేశారు. మిగిలిన మద్యం షాపులకు భిన్నంగా టానిక్ ఎలైట్ మార్ట్ కు ప్రత్యేక అనుమతులు ఇస్తూ ప్రతి ఏడాది రెన్యువల్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. టానిక్ లైసెన్స్ దారుగా అనీత్ రాజ్ లక్ష్మణ్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఆయన పేరు మీద లైసెన్స్ జారీ చేశారు.

ఆగస్టు 31తో లైసెన్స్ ముగుస్తున్న నేపథ్యంలో రెండునెలల క్రితమే తమ మద్యం షాపు లైసెన్స్ ను రెన్యువల్ చేయాలని కోరుతూ అప్లికేషన్ పెట్టుకున్నారు. అయితే.. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మద్యం దుకాణాలకు ఒకేలాంటి నిబంధన ఉండాలన్న ఉద్దేశంతో ఉన్న రేవంత్ సర్కారు.. టానిక్ మార్ట్ కు లైసెన్స్ ను రెన్యువల్ చేయలేదు. అంతేకాద.. టానిక్ మార్ట్ కు జారీ చేసిన లైసెన్స్ ను సైతం రివ్యూ చేస్తామని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు.

టానిక్ ను మూసి వేసే సమయానికి అందులో రూ.1.7 కోట్ల విలువైన 10,291 లిక్కర్ బాటిల్స్ ఉన్న విషయాన్ని గుర్తించిన ఎక్సైజ్ అధికారులు.. వాటిని లిక్కర్ డిపోకు తరలించారు. తెలంగాణ వ్యాప్తంగా 2620 మద్యం షాపులు ఉన్నప్పటికీ.. కేసీఆర్ ప్రభుత్వం మాత్రం టానిక్ సంస్థకు ప్రత్యేక అనుమతులు ఇస్తూ.. లైసెన్స్ జారీ చేయటం అప్పట్లో పెద్ద చర్చగా మారింది. టానిక్ కు ఇచ్చిన మినహాయింపుల కారణంగా ప్రభుత్వ ఖజానాకు భారీగా రాబడి కోల్పోయినట్లుగా విమర్శలు ఉన్నాయి.

టానిక్ కు అనుబంధంగా వెలిసిన క్యూ మద్యం షాపుల మీదా విమర్శలు ఉన్నాయి. హైదరాబాద్ వ్యాప్తంగా క్యూ పేరుతో ఎనిమిది దుకాణాలు ఉన్నాయి. వీటిపై ఈ మార్చిలో తనిఖీలు నిర్వహించిన ఎక్సైజ్ అధికారులు తమ నిర్ణయాన్ని వెల్లడించలేదు. టానిక్ మూసివేత నేపథ్యంలో త్వరలోనే క్యూ మద్యం మార్ట్ ల మీదా నిర్ణయం వెలువడచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.