Begin typing your search above and press return to search.

జూబ్లీహిల్స్‌ ఎంఐఎం అభ్యర్థి ఫిక్స్... కరాటే క్వీన్ కి ఛాన్స్!

తెలంగాణలో ఎన్నికల సందడి నెలకొన్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   5 Nov 2023 8:41 AM GMT
జూబ్లీహిల్స్‌ ఎంఐఎం అభ్యర్థి ఫిక్స్... కరాటే క్వీన్ కి ఛాన్స్!
X

తెలంగాణలో ఎన్నికల సందడి నెలకొన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రాజకీయ పార్టీలన్నీ ప్రచారంతో ఊదరగొట్టేస్తున్నాయి! సరికొత్త వ్యూహాలు పన్నుతున్నాయి. ఈ సమయంలో ఆయా పార్టీల్లో టిక్కెట్లు దొరకని అభ్యర్థులు పక్కపార్టీల్లోకి జంప్ అయిపోతున్నారు. ఆ సంగతి అలా ఉంటే... ఈసారి 7 నియోజకవర్గాల్లో కాకుండా 9 నియోజకవర్గాల్లో పోటీచేస్తుంది ఎంఐఎం. ఇందులో భాగంగా ఈసారి జూబ్లీహిల్స్ లో ఒక మహిళా అభ్యర్థిని రంగంలోకి దింపుతుందని తెలుసుంది. ఆమె జాతీయ కరాటే చాంపియన్‌ కావడం గమనార్హం!

అవును... ఈ ఎన్నికల్లో 7 స్థానాల్లో కాకుండా 9 స్థానాల్లో పోటీ చేయాలని ఎంఐఎం ఫిక్సయ్యింది. దీంతో పాతబస్తీ లోని స్థానాలతోపాటు కొత్తగా జూబ్లీ హిల్స్, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లోనూ పోటీకి దిగాలని ఫిక్సయ్యింది! అయితే... ఇదంతా బీఆరెస్స్ మేలుకోరే అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రధానంగా జూబ్లీహిల్స్ లో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం ద్వారా.. పరోక్షంగా బీఆరెస్స్ కు హెల్ప్ చేయాలనుకుంటుందని అంటున్నారు. అలా అజారుద్దీన్ కి చెక్ పెట్టాలని కేసీఆర్, ఎంఐఎంతో కలిసి పావులు కదుపుతున్నారని చర్చ జరుగుతుంది.

వాస్తవానికి జూబ్లిహిల్స్ నియోజకవర్గానికి సిటీలో ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ ఎట్టిపరిష్తితుల్లోనూ గెలిచి సత్తా చాటాలని ప్రతీ రాజకీయ పార్టీ భావిస్తుంటుందని అంటుంటారు. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీనుంచి పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి ఈ టిక్కెట్ ఆశించారు. అయితే ఈ నియోజకవర్గానికి కాంగ్రెస్ అభ్యర్థిగా అజారుద్దీన్ ని ఎంపిక చేస్తూ విష్ణుకి షాక్ ఇచ్చింది. దీంతో ఆయన చెయ్యి విడిచి కారెక్కేశారు.

ఈ సమయంలో జూబ్లీహిల్స్ లో ఎలాగైనా సత్తాచాటాలని బీఆరెస్స్ పావులు కదుపుతుందని తెలుస్తుంది. ఇందులో భాగంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడానికి ఎంఐఎం ని రంగంలోకి దింపుతుందని అంటున్నారు. ఈ సమయంలో.. జూబ్లీహిల్స్‌ స్థానానికి మహిళా అభ్యర్థని రంగంలో దింపేందుకు మజ్లిస్‌ పార్టీ కసరత్తు చేస్తోందనే కథనాలు తెరపైకి వస్తున్నాయి.

కాంగ్రెస్‌ నుంచి భారత క్రికెట్‌ మాజీ కెప్టెన్‌ అజహరుద్దీన్‌ బరిలో దిగుతుండటంతో ఈ స్థానం ప్రధాన రాజకీయ పక్షాలకు ప్రతిష్టాత్మకంగా మారిన నేపథ్యంలో... తొలిసారిగా నగర అసెంబ్లీ ఎన్నికల్లో ఓ మహిళకు అవకాశం ఇచ్చేందుకు మజ్లిస్‌ పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోందని అంటున్నారు. ఇందులో భాగంగా... జాతీయ కరాటే చాంపియన్‌ సయ్యదా ఫలక్‌ అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తోందని సమాచారం.

దీంతో ఈసారి జూబ్లీహిల్స్ నియోజకవర్గం విషయంలో పోరు బలంగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. అధికార బీఆరెస్స్, కాంగ్రెస్ ల మధ్య ప్రధానంగా రసవత్తర పోరు సాగనుందని అంటున్న సమయంలో... మధ్యలో తాజాగా ఎంఐఎం మహిళా అభ్యర్థితో రంగంలోకి దిగుతుండటం చర్చనీయాంశం అయ్యింది.

కాగా... సయ్యదా ఫలక్‌ మూడేళ్ల క్రితమే మజ్లిస్‌ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో పార్లమెంట్‌ లో ముస్లిం గొంతుకగా అసదుద్దీన్‌ ప్రజా అంశాలను లేవనెత్తే ఏకైక నాయకుడంటూ కొనియాడి ఆమె పార్టీ అధిష్టానాన్ని ఆకట్టుకున్నారు! ఇదే సమయంలో ఉమ్మడి పౌరసత్వానికి వ్యతిరేకంగా హైదరాబాద్‌, ఢిల్లీ, షాహీన్‌ బాగ్‌ లలో జరిగిన నిరసన కార్యక్రమాలకు నాయకత్వం వహించి పార్టీ దృష్టిని ఆకర్షించారు. ఈ సమయంలో జూబ్లీహిల్స్ అభ్యర్థిగా ఈమె పేరు పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది.