ఏపీలో 'జూన్ 1' వివాదం.. ఈ సారి ఏం జరుగుతుంది?
ఇక, ఇప్పుడు జూన్ 1 వస్తోంది. మరో నాలుగు రోజుల్లో 60 లక్షల మందికి సామాజిక పింఛన్లు ఇవ్వాల్సి ఉంది. ఇప్పుడు ఏం చేస్తారు?
By: Tupaki Desk | 27 May 2024 1:45 PM GMTప్రతి నెల 1వ తేదీ అనగానే ఏపీలో ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేసే వలంటీర్లు గుర్తుకు వస్తారు. వృద్ధులు, ఒంటరి మహిళ లు, దివ్యాంగులకు.. ఈ వ్యవస్థ బాగానే అందుబాటులోకి వచ్చింది. అయితే.. వలంటీర్లు వైసీపీకి అనుకూలంగా ఉన్నారన్న ఫిర్యాదులు రావడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఏప్రిల్, మే నెలల్లో వలంటీర్ల వ్యవస్థను సుప్తచేతనావస్థలో ఉంచింది. వారు నిర్వహిస్తున్న అన్ని ప్రధాన విధులకు దూరం పెట్టాలని ఆదేశించింది. తద్వారా వైసీపీ చేస్తున్న వలంటీర్ రాజకీయాలకు ఎన్ని కల సంఘం ముకుతాడు వేసిందని ప్రతిపక్షాలు కూడా హర్షించాయి. దీంతో ఫెయిర్ ఎలక్షన్స్ జరుగుతాయని పేర్కొన్న విషయం తెలిసిందే.
అయితే.. ఈ విషయంలో ప్రతిపక్షాలను ఇరుకున పెట్టేలా అధికార పక్షం చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. వలంటీర్లను కట్టడి చేసిన సర్కారు.. పింఛను దారులకు ఇవ్వాల్సిన పింఛన్లను ఇవ్వడంలో ముప్పుతిప్పలు పెట్టిందనే వాదన వచ్చింది. ఏప్రిల్ 1-3 వరకు అసలు పింఛన్లే ఇవ్వలేదు. తర్వాత.. పింఛను దారులను గ్రామ, వార్డు సచివాలయాలకు పిలిచి ఆరు రోజుల పాటు పంపిణీ చేశారు. ఈ క్రమంలో ఎండల వేడి తాళలేక.. ఆ ఒక్క నెలలోనే 33 మంది వృద్ధులు మృతి చెందారని అధికారిక లెక్కలే చెప్పాయి. వీటిని ప్రతిపక్షాలపై సర్కారు నెట్టేసింది. చంద్రబాబు ప్రోద్బలంతోనే వలంటీర్ల వ్యవస్థ ఆగిపోయిందని.. అందుకే మీకు తిప్పలు వచ్చాయని వైసీపీ నాయకులు ప్రచారం చేశారు.
ఇదొక పెద్ద దుమారం రేపింది. ఇదేసమయంలో ప్రతిపక్షాలు కూడా ఎదురు దాడి చేశాయి. ఎన్నికల సంఘం ఆన్‌లైన్‌లో సొమ్ము లు వేయమంటే.. సర్కారు తన ఇష్టాను సారం వ్యవహరించి ఇంత మంది ప్రాణాలు తీసిందని చెప్పుకొచ్చాయి. మొత్తానికి ఏప్రిల్ ముగిసింది. మే నెలకు వచ్చేసరికి వార్డు సచివాలయ వ్యవస్థను పక్కన పెట్టి నేరుగా బ్యాంకుల్లో వేశారు. అయితే.. ఎప్పటి నుంచో ఆయా ఖాతాలు వినియోగంలో లేకపోవడంతో ఫైన్లు.. ఇతరత్రా చార్జీలతో పేదల పింఛను సొమ్మును బ్యాంకులు సగానికి పైగా మినహాయించుకున్నాయి. మరికొందరికి పాన్ కార్డులు లేకపోవడంతో నానా తిప్పలు పడ్డారు. అసలు ఇప్పటికీ.. మే నెల తాలూకు పింఛను సొమ్మును ఎంత మంది తీసుకున్నారో కూడా తెలియదు.
ఇక, ఇప్పుడు జూన్ 1 వస్తోంది. మరో నాలుగు రోజుల్లో 60 లక్షల మందికి సామాజిక పింఛన్లు ఇవ్వాల్సి ఉంది. ఇప్పుడు ఏం చేస్తారు? అనేది ప్రశ్న. ఏప్రిల్, మే నెలల్లో పోలింగ్ ఉందన్న ఉద్దేశంతో వలంటీర్లను నిలిపివేశారు. మరి ఇప్పుడు పోలింగ్ అయిపోయింది. కాబట్టి వలంటీర్లను తీసుకువస్తారా? ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘాన్ని అనుమతి కోరతారా? అనేది కీలక ప్రశ్న. లేకపోతే.. బ్యాంకుల్లోనే మరోసారి వేస్తారా? అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే.. ఇప్పటి వరకు ఈ విషయంపై సర్కారు నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడం గమనార్హం. దీనిని ప్రతిపక్షాలు కార్నర్ చేస్తూ.. సీఎం జగన్ కు మేలు జరగాలనే కుట్రలో చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, సెర్ఫ్ సీఈఓ మురళీధర్ రెడ్డి పింఛన్ దారులను ఇబ్బంది పెడుతున్నారని.. ఆరోపిస్తుండడం గమనార్హం. మరి దీనిపై సర్కారు నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి.