రేవంత్‌కు తలనొప్పి.. జూనియర్‌ల సమ్మె!
తెలంగాణలో తొలిసారి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పెద్ద చిక్కే వచ్చి పడింది. రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు మెరుపు సమ్మెకు దిగారు.
By: Tupaki Desk | 24 Jun 2024 9:45 AM GMTతెలంగాణలో తొలిసారి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పెద్ద చిక్కే వచ్చి పడింది. రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు మెరుపు సమ్మెకు దిగారు. తమ డిమాండ్లను నెరవేర్చాలనివారు పట్టుబడుతున్నారు. రేవంత్ రెడ్డి సర్కారులో ఇదే తొలిసారి.. జూనియర్ డాక్టర్లు సమ్మె చేయడం గమనార్హం. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క అత్యవసర సేవలు మాత్రమే కొనసాగుతున్నాయి. నిజానికి వాటిని కూడా ఆపేస్తామని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
జూనియర్ డాక్టర్ల సెమ్మె కారణంగా.. సాధారణ రోగులతో పాటు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు కూడా.. ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓపీ సేవలు, ఎలక్టివ్ సర్జరీలు, వార్డ్ డ్యూటీలు నిలిచిపోయాయి. దాదాపు 4 వేల మంది జూనియర్ డాక్టర్లు సమ్మెలో పాల్గొంటున్నారు. మొత్తంగా 7 నుంచి 8 కీలక డిమాండ్లను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. అయితే.. గత నాలుగు రోజులుగా.. వైద్యులు తమ డిమాండ్ల పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.
ఇదిలావుంటే.. జూనియర్ డాక్టర్ల డిమాండ్లలో ప్రధానంగా 10వ తేదీలోగా.. వారికి స్టైఫండ్ ఇవ్వాలని కోరు తున్నారు. గత ప్రభుత్వం ఎప్పుడు ఇచ్చిందో తెలియని పరిస్థితి అందరికీ తెలిసిందే. ఉద్యోగుల జీతాల నే సక్రమంగా ఇవ్వలేదు. ఇక, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉద్యోగులకు 1న వేతనాలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో తమకు 10వ తేదీనే.. స్టయిఫండ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
సర్కారీ దవాఖానాల్లో భద్రత, ఎంబీబీఎస్ సీట్లలో 15 శాతం ఉమ్మడి కోటా కూడా తెలంగాణకే కావాలి, సీనియర్ రెసిడెండ్లకు రూ.1.25 లక్షల గౌరవ వేతనం ఇవ్వాలి వంటి కీలక డిమాండ్లు ఉన్నాయి. వీటికితోడు.. కొత్త భవనాల నిర్మాణం కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే.. ప్రస్తుతం సీఎం అందుబాటులో లేకపోవడంతో మంత్రులు బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు.