Begin typing your search above and press return to search.

జూనియర్ ఎర్రన్న వైసీపీ టార్గెట్...ఆమెతోనే విజయం...!?

అయితే ఆ ఎన్నికల్లో ఫస్ట్ టైం పోటీ చేసిన దివగంత నేత ఎర్రన్నాయుడు కుమారుడు రామ్మోహన్ విజయం సాధించారు

By:  Tupaki Desk   |   28 Dec 2023 1:30 AM GMT
జూనియర్ ఎర్రన్న వైసీపీ టార్గెట్...ఆమెతోనే విజయం...!?
X

ఉత్తరాంధ్రాలో వైసీపీని ఊరించే హాట్ ఫేవరేట్ సీటు శ్రీకాకుళం ఎంపీ సీటు. 2014, 2019లలో రెండు సార్లు జరిగిన ఎన్నికల్లోనూ ఈ సీటులో వైసీపీకి గెలుపు లభించలేదు. 2014లో రెడ్డి శాంతిని వైసీపీ నుంచి పోటీ చేయించారు. బలమైన కాపు సామాజికవర్గం సమీకరణలతో వైసీపీ వ్యూహరచన చేసింది.

అయితే ఆ ఎన్నికల్లో ఫస్ట్ టైం పోటీ చేసిన దివగంత నేత ఎర్రన్నాయుడు కుమారుడు రామ్మోహన్ విజయం సాధించారు. తన తండ్రి మరణానంతరం వచ్చిన సానుభూతి టీడీపీ వేవ్ అన్నీ ఆయనకు కలసి వచ్చాయి. ఇక 2019లో చూస్తే జగన్ ప్రభంజనం అంతటా వీచింది. శ్రీకాకుళం జిల్లాలో ఆ వేవ్ కనిపించింది. ఉమ్మడి జిల్లాలో ఉన్న మొత్తం పది అసెంబ్లీ అసెంబ్లీ సీట్లలో ఎనిమిది వైసీపీ పరం అయ్యాయి.

కేవలం రెండు మాత్రమే టీడీపీ గెలుచుకుంది. అలాంటి చోట ఎంపీ సీటు కూడా వైసీపీ పరం కావాలి. కానీ అలా జరగలేదు. ఎనిమిది వేల ఓట్ల మెజారిటీతో రామ్మోహన్ నాయుడు రెండవసారి విజయం సాధించారు. 2019లో వైసీపీ తరఫున దువ్వాడ శ్రీనివాస్ పోటీ చేశారు. ఆయన బలమైన కాళింగ సామాజికవర్గానికి చెందిన నేత.

దాంతో వైసీపీ బాగానే లాక్కొచ్చింది. కానీ ఓటమి మాత్రం తప్పలేదు. ఇక 2024లో ముచ్చటగా మూడవసారి వైసీపీ తలపడుతోంది. ఈసారి ఎట్టి పరిస్థితులలో శ్రీకాకుళం ఎంపీ సీటు వదులుకోరాదు అని చూస్తోంది. ఇక రెండు సార్లు ఎంపీ అయిన రామ్మోహన్ కి కొంత ఆసక్తి తగ్గింది అని అంటున్నారు. ఆయన పట్ల కూడా జనంలో మోజు తగ్గింది అంటున్నారు.

కొత్త ముఖం వస్తే ఆదరించవచ్చు అన్నది కూడా ఉంది. దీంతో వైసీపీ మరోసారి సోషల్ ఇంజనీరింగ్ చేస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో కాళింగులు హెచ్చు సంఖ్యలో ఉన్నారు. అదే విధంగా కాపులు కూడా ఉన్నారు. గత రెండు ఎన్నికల్లోనూ ఈ రెండు వర్గాలకు వైసీపీ టికెట్లు ఇచ్చింది. ఈసారి ఈ రెండు సామాజిక వర్గాలను మిక్స్ చేస్తోంది.

అదేలా అంటే శ్రీకాకుళం జిల్లాపరిషత్ చైర్మన్ పిరియా విజయ సాయిరాజ్ కి ఎంపీ టికెట్ ఇవ్వాలని చూస్తోంది. ఆమె సూర్య బలిజ సామాజికవర్గం. అలాగే ఆమె భర్త సాయిరాజ్ కాళింగ సామాజిక వర్గానికి చెందిన వారు. ఇక విజయ సాయిరాజ్ జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నారు. జిల్లా అంతటా తెలిసిన వారు. పైగా ఆమె విద్యాధికురాలిగా బీసీ మహిళగా ఉండడం ప్లస్ పాయింట్ అంటున్నారు.

ఆమె రాజకీయ అరంగేట్రం మొదటిసారి చేసి జెడ్పీటీసీగా గెలిచారు ఆ వెంటనే జిల్లా పరిషర్ చైర్ పర్సన్ అయిపోయారు. దాంతో ఆమెను ఇపుడు ఎంపీ బరిలోకి దించుతున్నారు. పేరులోనే విజయాన్ని ఉంచుకున్న ఆమె శ్రీకాకుళం ఎంపీ సీటుని గెలిచి వైసీపీకి ఆ విజయం అందిస్తారు అని అంటున్నారు.

మరో వైపు చూస్తే శ్రీకాకుళం ఎంపీ అభ్యర్ధి కోసం వైసీపీ చాలా మంది పేర్లు పరిశీలించింది. మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఆయన సోదరుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణదాస్ ని కూడా సంప్రదించినట్లుగా ప్రచారం సాగింది.

అదే విధంగా 2004, 2009లలో శ్రీకాకుళం ఎంపీగా కాంగ్రెస్ నుంచి పోటీ చేసి కేంద్ర మంత్రిగా పనిచేసిన కిల్లి కృపారాణి పేరు కూడా ఒక దశలో ప్రస్తావనకు వచ్చింది. అలాగే స్పీకర్ తమ్మినేని సీతారాం పేరుని కూడా పరిగణనలోకి తీసుకున్నారని అంటున్నారు.

అయితే వీరంతా ఎంపీకి పెద్దగా సుముఖత వ్యక్తం చేయకపోవడంతో విజయ సాయిరాజ్ దగ్గర హై కమాండ్ ఆలోచనలు ఆగాయని అంటున్నారు. ఆమె అయితే కచ్చితంగా విజయం సాధిస్తామని హై కమాండ్ నమ్ముతోంది.చూడాలి మరి ఏమి జరుగుతుందో.