Begin typing your search above and press return to search.

ఎల్బీ స్టేడియంలో చర్చ పెడదామా? హరీశ్ కు జూపల్లి ప్రతి సవాలు

ఈ సవాలుపై తాజాగా మంత్రి జూపల్లి క్రిష్ణారావు స్పందించారు. హరీశ్ సవాలుకు ముఖ్యమంత్రి రేవంత్ రావాల్సిన అవసరం లేదని.. ఆ సవాల్ ను తాను స్వీకరిస్తున్నట్లుగా ప్రకటించారు.

By:  Tupaki Desk   |   20 Oct 2024 8:08 AM GMT
ఎల్బీ స్టేడియంలో చర్చ పెడదామా? హరీశ్ కు జూపల్లి ప్రతి సవాలు
X

గడిచిన కొద్ది రోజులుగా తెలంగాణ అధికార కాంగ్రెస్.. విపక్ష బీఆర్ఎస్ మధ్య నడుస్తున్న మాటల యుద్దం అంతకంతకూ ముదురుతోంది. మూసీ ప్రక్షాళనపై తమ ప్రభుత్వం కమిట్ మెంట్ తో ఉందని.. తాము మూసీ సుందరీకరణ చేయటం లేదని.. ప్రక్షాళన చేస్తున్నట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ స్పష్టం చేయటం తెలిసిందే. దీనిపై హరీశ్.. కేటీఆర్ లు అదే పనిగా కౌంటర్లు ఇవ్వటం తెలిసిందే. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ.. మల్లన్నసాగర్ పై చర్చకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ కు హరీశ్ సవాలు విసిరారు.

ఈ సవాలుపై తాజాగా మంత్రి జూపల్లి క్రిష్ణారావు స్పందించారు. హరీశ్ సవాలుకు ముఖ్యమంత్రి రేవంత్ రావాల్సిన అవసరం లేదని.. ఆ సవాల్ ను తాను స్వీకరిస్తున్నట్లుగా ప్రకటించారు. ‘‘పదేళ్లలో కేసీఆర్.. కేటీఆర్.. హరీశ్ రావులతో సహా బీఆర్ఎస్ నేత ఆదాయం పెరిగింది. దేశంలోనే సంపన్న ప్రాంతీయ పార్టీగా బీఆర్ఎస్ ఎలా ఎదిగింది? మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల్లో విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లారు. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో సమాధానం చెప్పాలి?’’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు మంత్రి జూపల్లి.

తెలంగాణ వచ్చినప్పుడు రాష్ట్ర ఆదాయం.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో చేసిన అప్పు.. అవినీతి.. ఎవరెంత దోచుకున్నారో.. చర్చించటానికి తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పిన జూపల్లి.. తనతో చర్చకు కేసీఆర్.. కేటీఆర్.. హరీశ్ రావులలో ఎవరు వచ్చినా తాను సిద్ధమేనని స్పష్టం చేశారు. ఎల్బీ స్టేడియంలో ప్రజలు.. మీడియా ముందు బహిరంగ చర్చ పెడదామని.. అన్ని అంశాలపై చర్చిద్దామని ప్రతి సవాలు విసిరారు. బీఆర్ఎస్ నేతల అవినీతిని ఆధారాలతో సహా బయటపెడతానని వ్యాఖ్యానించారు.

మూసీ నిర్వాసితులపై కపట ప్రేమ చూపిస్తున్నారని.. నిర్వాసితులకు ప్రభుత్వం డబుల్ బెడ్రైం ఇళ్లు ఇస్తే.. వారికి రాజకీయంగా మాట్లాడటానికి ఏం ఉండదని కేటీఆర్.. హరీశ్ లు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నట్లుగా మండిపడ్డారు. 2016లొ బీఆర్ఎస్ ప్రభుత్వమే మూసీ ఒడ్డు నుంచి 50 మీటర్ల బఫర్ జోన్ అని జీవో ఇచ్చిందని.. అందులో తన ఇల్లు కూడా పోతుందని పేర్కొన్నారు. మరి.. జూపల్లి సవాలుకు మాజీ మంత్రి హరీశ్ ఏ రీతిలో రియాక్టు అవుతారో చూడాలి.