కాలంతో పాటు మారని కాంగ్రెస్ .. పొంగులేటి అలా.. జూపల్లికిఇలానా ?
ఈ లెక్కన పొంగులేటి కంటే జూపల్లి రాజకీయాల్లో సీనియర్. కానీ, పార్టీలో చేరిక సందర్భంగానే ఆయన పట్ల కాంగ్రెస్ వ్యవహరించిన తీరే సరిగా లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
By: Tupaki Desk | 2 Aug 2023 12:35 PM GMTప్రస్తుతం అంతా సోషల్ మీడియా యుగం. ఏ విషయమైనా క్షణాల్లో ప్రజలకు చేరిపోతోంది. దానికితగ్గట్లే ప్రజల ఆలోచనా ధోరణి కూడా మారుతోంది. ఏది అసలో ఏది నకిలీయో జనం తక్షణమే పసిగట్టేస్తున్నారు. తమ అభిప్రాయాలను నిర్మొహమాటంగా వ్యక్తం చేస్తున్నారు కూడా. అందుకనే ఏం చేసినా ఆచితూచి వ్యవహరించాలి. కానీ, కాలంతో పాటు కాంగ్రెస్ పార్టీ మారడం లేదు. ఆ పార్టీ వ్యవహారాలు పాత తరం పద్ధతులనే తలపిస్తున్నాయి.ఇందుకు తాజా నిదర్శనం ఇద్దరు నాయకుల చేరిక సందర్భంగా వ్యవహరించిన తీరు.
ప్రియాంక రాలేకపోయారా?
తెలంగాణలో అధికార బీఆర్ఎస్ ను ప్రస్తుతం ఢీకొట్టే స్థితిలో ఉంది కాంగ్రెస్ పార్టీ. సంస్థాగత బలానికి తోడు నాయకత్వ పటిమ ఆ పార్టీ సొంతం. దీంతోనే కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకు సీఎం కేసీఆర్ పావులు కదుపుతున్నారు. అయితే, ఆయనకు షాక్ ఇస్తూ ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొల్లాపూర్ కు చెందిన మాజీ మంత్రి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధపడ్డారు.
ఇది నిజంగా బీఆర్ఎస్ కు షాకే. అయితే, పొంగులేటి చేరికను ఖమ్మంలో పెద్దఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేశారు. పొంగులేటికి ఉన్న ఆదరణతో ప్రజలు భారీగానే హాజరయ్యారు. ఈ సభకు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ హాజరయ్యారు. పొంగులేటిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఇక కొల్లాపూర్ లో భారీ బహిరంగ సభ ద్వారా జూపల్లి క్రిష్ణారావు చేరికను కూడా ఘనంగా నిర్వహించాలని భావించారు. కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాకం గాధీ హాజరయ్యేలా సభ ఏర్పాటు చేస్తామన్నారు. కానీ వివిధ కారణాలతో అది వాయిదా పడుతూ వస్తోంది. మరోవైపు ఎన్నికలకు మూడు నాలుగు నెలలు కూడా లేదు. అధిష్ఠానం మాత్రం జూపల్లి చేరికకు త్వరపడడంలేదు. ఇలాంటి సమయంలో వేచి చూసి విసిగిపోయిన ఆయన స్వయంగా ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే సమక్షంలో పార్టీలో చేరుతున్నారు.
పొంగులేటి కంటే జూపల్లి సీనియర్ కదా..?
జూపల్లి క్రిష్ణారావు ఉమ్మడి మహబూబ్ నరగ్ జిల్లాలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా కీలక నేతగా వ్యవహరించారు. ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణలోనూ మంత్రిగా వ్యవహరించారు. అంతేకాదు.. 1999 నుంచి 2014 వరకు వరుసగా గెలుస్తూ వచ్చారు. 2004లో కాంగ్రెస్ రెబల్ పోటీ చేసి మరీ గెలిచారు. మొత్తమ్మీద ఐదుసార్లు ఆయన గెలుపొందారు. 2010 తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. 2014లో గెలిచినా.. 2018లో తొలిసారిగా ఓడిపోయారు. ఆయన మీద విజయం సాధించిన హర్షవర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరడంతో రాజకీయాలు మారిపోయాయి.
అందులోనూ హర్షవర్ధన్ రెడ్డి కొనుగోలు కోసం బీజేపీ వల విసిరిన ఎమ్మెల్యేల్లో ఒకరు కావడం, ఆ అంశాన్ని బీఆర్ఎస్ రాజకీయంగా వాడుకోవడంతో కీలకంగా మారారు. పొంగులేటి విషయానికి వస్తే ఆయన ఉమ్మడి ఖమ్మంలో ప్రభావవంతమైన నాయకుడే అయినా.. ఎంపీగా ఒక్కసారే గెలిచారు. ఈ లెక్కన పొంగులేటి కంటే జూపల్లి రాజకీయాల్లో సీనియర్. కానీ, పార్టీలో చేరిక సందర్భంగానే ఆయన పట్ల కాంగ్రెస్ వ్యవహరించిన తీరే సరిగా లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.